వైభవంగా సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-16T05:07:17+05:30 IST

సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య గురువారం వైభవంగా జరుపుకున్నారు.

వైభవంగా సంక్రాంతి వేడుకలు
క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 15 : సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య గురువారం వైభవంగా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా ప్రతిఇంటా వేడుకలను బంధుమిత్రులతో కలిసి రకరకాల పిండివంటలతో సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో  యువత పాల్గొని వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పలువురు పోలీసులు ఇతర శాఖల అధికారులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా ప్రొద్దుటూరు పురపాలక పరిధి పదో వార్డు టీడీపీ అభ్యర్థి నల్లబోతుల పావని ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పోటీలకు వార్డులోని మహిళలు హాజరై ముగ్గులతో ప్రతిభ చాటారు.  ప్రధమ బహుమతి కింద రూ.7వేలు, ద్వితీయ బహుమతి కింద రూ. 5వేలు, తృతీయ బహుమతి కింద రూ.3వేలు అందివ్వగా, కళ్యాణి, భార్గవి, సునీతలు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సాధించారు. వారికి కాగా టీడీపీ కడప పార్లమెంట్‌ మహిళా కార్యదర్శి కోట శ్రీదేవి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, పట్టణ నాయకుడు నల్లబోతుల నాగరాజు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇరగం మల్లీశ్వరీ ల చేతుల మీదుగా నిర్వాహకులు బహుమతులను అందించారు. పోటీల్లో పాల్గొన్న మిగిలిన వారికి కన్సోలేషన్‌ బహుమతులను అందించారు. 

ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు

ప్రొద్దుటూరు టౌన్‌, జవనరి 15: డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రామేశ్వరంలో సంక్రాంతి సందర్భంగా యువకులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి జాఫర్‌సాధిక్‌ మాట్లాడుతూ పండుగల సందర్భంలో యువతలో చైతన్యం నింపడానికి సంక్రాంతి క్రికెట్‌ పోటీలు నిర్వహించామన్నారు.  కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు  రాజా, మారుతి, మహమ్మద్‌, తదితరులు పాల్గొన్నారు. 

ముద్దనూరులో సంక్రాంతి సంబరాలు

ముద్దనూరు జనవరి15: మండలంలో ప్రజలు గురువారం, శుక్ర సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. స్థానిక యూజీ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. పోలీస్‌ స్టేషన్‌ ముందు తెలుగు దనం ఉట్టిపడేలా  సీఐ హరినాథ్‌, ఎస్‌ఐ శంకర్‌రావు, ఏఎ్‌సఐ శ్రీనివాసులు పోలీసులు తెలుగు వారి సంప్రదాయ దుస్తులు తెల్ల పంచ, చొక్కాతో అందరిని ఆకట్టుకున్నారు. 

కొండాపురంలో..

కొండాపురం, జనవరి 15: మండలంలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకొన్నారు. గ్రామగ్రామాన రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. కాగా గండికోట ముంపు గ్రామాల్లో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంతగా జరుపుకోలేదు. ఉన్నఫలంగా గ్రామాలను ఖాళీ చేయించడంతో చెట్టుకొకరు, పుట్టకొకరు తరలివెళ్లారు. కనుమ రోజు పలు గ్రామాల్లో పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. 

ఉత్కంఠభరితంగా కబడ్డీ పోటీలు

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 15:  నగర పంచాయతీ పరిధిలోని పతంగే రామన్నరావు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి పండుగను పురష్కరించుకుని గురు, శుక్రవారం రోజున కబడ్డీ పోటీలు నిర్వహించారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నుంచి 20 టీంలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కబడ్డీ పోటీల్లో శుక్రవారం జమ్మలమడుగుకు చెందిన కన్నయ్యటీం మొదటి బహుమతి విజేతగా నిలువగా రెండవ స్థానంలో చీపాడుకు చెందిన జట్టు నిలిచింది. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి వంల నాగేంద్రయాదవ్‌ దాత రూ.20 వేలు ఇచ్చారు. రెండవ బహుమతికి దాత ద్వారకచర్ల శ్రీనివాసులరెడ్డి రూ.10 వేలు ఇచ్చారు. కబడ్డీ పోటీలను ఆర్గనైజర్లుగా సి.కిరణ్‌కుమార్‌, పవన్‌, ప్రసాద్‌, మేఘనాథరెడ్డి విజయవంతం చేశారు. బహుమతులను జమ్మలమడుగు వైసీపీ 16వ వార్డు ఇన్‌ఛార్జి మురళీకృష్ణ జట్లకు బహుమతులు అందించారు.

మైలవరంలో..

మైలవరం, జనవరి 15 : మండల పరిధిలోని వద్దిరాల, మైలవరం, దొమ్మరనంద్యాల, వేపరాల, చిన్నకొమెర్ల తదితర గ్రామాల్లో సంక్రాంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో ముస్తాబుచేశారు. రేగడిపల్లి, వద్దిరాల తదితర గ్రామాల్లో శ్రీసీతారాముల స్వామి వారిని పుర వీదుల్లో ఊరేగించి ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.భుక్తులు భజన పాటలు పాడుకుంటూ ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. 



Updated Date - 2021-01-16T05:07:17+05:30 IST