కొవిడ్‌ వ్యాక్సిన్‌కు గ్లోబల్‌ టెండర్లు

ABN , First Publish Date - 2021-05-14T08:02:53+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్రంలో సుమారు కోటి మందికి వ్యాక్సినేషన్‌ కోసం 2కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. టెండర్‌ డాక్యు

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు గ్లోబల్‌ టెండర్లు

ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా ఆహ్వానం 

2 కోట్ల డోసుల కొనుగోలుకు సిద్ధం 

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించింది. రాష్ట్రంలో సుమారు కోటి మందికి వ్యాక్సినేషన్‌ కోసం 2కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. టెండర్‌ డాక్యుమెంట్‌ను ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5గంటల లోపు కంపెనీలు బిడ్‌ దాఖలు చేయవచ్చు. ప్రీ బిడ్‌ మీటింగ్‌ను ఈ నెల 20న నిర్వహించనున్నారు. జూన్‌ 3 సాయంత్రం 5 గంటలకు టెక్నికల్‌ బిడ్‌ ఓపెన్‌ చేస్తారు. ఫైనాన్షియల్‌ బిడ్‌లను ఈ-పొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ ఉత్పిత్తి కంపెనీలతో పాటు కంపెనీ ఏజెంట్లకూ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు టెండర్లలో పాల్గొంటే డీసీజీఐ అనుమతి తప్పనిసరి. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా ఎల్‌1 కంపెనీ వ్యాక్సిన్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. టెండర్లలో పాల్గొనే కంపెనీలకు ఏడాదికి రూ.20 కోట్ల టర్నోవర్‌ కచ్చితంగా ఉండాలి. దేశంలో ఎక్కడా ఏ కోర్టులోనూ బిడ్డింగ్‌ కంపెనీపై నేర నిరూపణ కాకూడదు. ఏపీఎంఎ్‌సఐడీసీకి సరఫరా చేసే వ్యాక్సిన్‌ 2 నుంచి 8 డిగ్రీల సెల్సియ్‌సలో నిల్వ చేయడానికి వీలుగా ఉండాలన్న నిబంధనను టెండర్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. 


గ్లోబల్‌ టెండర్లు పిలిచాం: సింఘాల్‌ 

కరోనా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. గురువారం ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ బిడ్ల దాఖలుకు 3 వారాల సమయం ఇచ్చామని, ఈ నెల 20, 22 తేదీల్లో ప్రీబిడ్‌ సమావేశాలు ఉంటాయన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగా గ్లోబల్‌ టెండర్లకు వెళ్తున్నాం కాబట్టి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ అనుమతులు పొంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులందరికీ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పథకం కింద నగదు రహిత చికిత్సలు అందిస్తున్నామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో 39,749 పడకలు ఉండగా 26,030మంది ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందుతున్నారన్నారు.  ఈ ఏడాది 3,025 మంది జనరల్‌ డ్యూటీ అధికారులను కొత్తగా తీసుకున్నామన్నారు. 2,472 మంది స్వీపర్లను నియమించుకున్నామన్నారు. అవసరమైతే అదనంగా మరో 25 శాతం మేర వైద్యసిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కొవిడ్‌ సేవలకు 1,143 మంది పీజీ విద్యార్థులు, 1,294 మంది హౌస్‌ సర్జన్లు, 954 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 638 మంది డెంటల్‌ విద్యార్థులను గుర్తించామన్నారు. ఆస్పత్రుల్లో 7,618 ఐసీయూ పడకల్లో 7,089 నిండాయన్నారు. 22,069 ఆక్సిజన్‌ పడకల్లో 20962 నిండాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు 16,724 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరా చేశామని, ప్రభుత్వ ఆస్పత్రులకు 21,157 ఇంజెక్షన్లు అందుబాటులోకి తెచ్చామని సింఘాల్‌ వివరించారు.


Updated Date - 2021-05-14T08:02:53+05:30 IST