Abn logo
Sep 24 2021 @ 00:23AM

గ్లోబుల్‌ రన్‌

  • 958 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ 
  • 60,000 స్థాయికి చేరువలో సూచీ
  •  17,800 మైలురాయిని దాటిన నిఫ్టీ 
  •  రూ.261 లక్షల కోట్లకు చేరిన  స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద 


ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. బీఎ్‌సఈ సెన్సె క్స్‌ 60,000కు చేరువ కాగా, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 17,800 మైలురాయిని అధిగమించింది. గురువారం ట్రేడింగ్‌ నిలిచేసరికి సెన్సెక్స్‌ 958.03 పాయింట్ల (1.63 శాతం) లాభంతో 59,885.36 వద్ద క్లోజైంది. నిఫ్టీ 276.30 పాయింట్ల (1.57 శాతం) పెరుగుదలతో 17,822.95 వద్దకు స్థిరపడింది. సూచీలకు సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపు స్థాయిలివి.


అంతేకాదు, ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 59,957.25 వద్ద, నిఫ్టీ 17,843.90 వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాలను సైతం నమోదు చేసుకున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తాజా ద్రవ్యవిధాన సమీక్షా సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కరోనా సంక్షోభాన్ని తట్టుకునేందుకు బాండ్ల కొనుగోలు ద్వారా ప్రస్తుతం మార్కెట్‌కు సమకూరుస్తున్న ద్రవ్య మద్దతును మాత్రం వచ్చే ఏడాది ప్రథమార్థం చివరినాటికి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ విషయంలో ఫెడ్‌ కఠిన వైఖరిని గ్లోబల్‌ ్ల ట్రేడర్లు పట్టించుకోకపోగా.. భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డారు. అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా ఉండటంతో దేశీయ మదుపర్లలోనూ కొనుగోళ్ల ఉత్సాహం ఉరకలేసింది. 


30లో 25 లాభాల్లో.. 

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో ఐదు మినహా మిగతావన్నీ లాభాల్లో పయనించాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేరు 5.15 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌ గా నిలిచింది. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎ్‌ఫసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 3 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 2 శాతానికి పైగా పెరిగాయి. కాగా, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.07 శాతం నష్టపోయింది. బీఎ్‌సఈలోని రియల్టీ, బ్యాంకింగ్‌, ఎనర్జీ, ఫైనాన్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్‌ రంగ సూచీలు 8.71 శాతం వరకు ఎగబాకాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ మాత్రం నేలచూపులు చూసింది.


రూ.3.16 లక్షల కోట్లు పెరిగిన సంపద 

 కాగా బుల్‌ ర్యాలీలో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద ఒక్కరోజే రూ.3,16,778 కోట్లు ఎగబాకింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ లేదా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.261.73 లక్షల కోట్లకు చేరుకుంది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌లో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి ఇది.


పారస్‌ ఇష్యూకు 304 రెట్ల బిడ్లు 

పారస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు అపూర్వ స్పందన లభించింది. గురువారంతో ముగిసిన కంపెనీ ఇష్యూకు 304.26 రెట్ల బిడ్లు లభించాయి. ఐపీఓలో భాగంగా కంపెనీ 71,40,793 షేర్లను విక్రయానికి పెట్టగా.. మొత్తం 217,26,31,875 షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి. 



రిలయన్స్‌ @ రూ.16 లక్షల కోట్లు 


కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ విలువ ఆల్‌ టైం రికార్డు స్థాయి రూ.16 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి లిస్టెడ్‌ కంపెనీ ఇదే. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్‌ షేరు ధర ఒక దశలో 2.72 శాతం లాభంతో రూ.2,496.95 వద్దకు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.16,88,455 కోట్ల స్థాయికి ఎగబాకింది. చివర్లో మాత్రం కంపెనీ షేరు ధర 2.43 శాతం లాభంతో రూ.2,489.65 వద్ద స్థిరపడింది. దాంతో మార్కెట్‌ క్యాప్‌ రూ.15,78,299.46 కోట్లకు పరిమితమైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్‌ షేరు 25 శాతానికి పైగా పెరిగింది.