Abn logo
Jul 31 2020 @ 01:57AM

గ్లోబల్ విద్యావిధానం

కేంద్రమంత్రివర్గం బుధవారం నాడు ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానం 2020, విద్యారంగంలో అనేక పెద్ద మార్పులను వాగ్దానం చేస్తున్నది. ప్రతిపాదించిన మార్పులన్నీ వాంఛనీయమైనవి కావన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కస్తూరిరంగన్ కమిటీ నివేదిక రెండేళ్ల కిందటే ప్రభుత్వానికి అందినా, దాన్ని పోయినేడాది పార్లమెంటు ముందుకు, ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ ఏడాది కాలంలో ఆ నివేదికపై విస్తృతంగా చర్చ జరిగిందని, ప్రజల నుంచి అనేక సూచనలు అందుకున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అంతే కాదు, 2015 సంవత్సరం నుంచి ఈ విధాన రూపకల్పన అన్నిదశలలో 2 లక్షలకు పైగా సలహాలు, సూచనలు వచ్చాయని, అన్ని అంచెల స్థానిక సంస్థలు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖతో సహకరిస్తూ, భాగస్వామ్యం వహించాయని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, విద్యారంగ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ పక్షాలు ఈ అంశం మీద అనుకున్నంతగా మేథోమథనం చేయలేదనిపిస్తుంది. నూతన విధానం అమలులోకి రావడానికి అనేక దశలు దాటవలసి వస్తుంది. ఈ సమయంలో అయినా చర్చ అర్థవంతంగా జరగవలసి ఉన్నది.


నూతన విద్యావిధానం ప్రాథమిక పూర్వ తరగతులను విద్యానిర్మాణంలో భాగం చేసింది. రెండుసంవత్సరాల ప్రాథమిక పూర్వ విద్యతో కలుపుకుని సెకండరీ స్థాయి (12వ తరగతి) దాకా పదిహేను సంవత్సరాల విద్య, అనంతరం నాలుగు సంవత్సరాల పట్టభద్రవిద్య, తరువాత ఒకటి లేదా రెండు సంవత్సరాల వ్యవధితో స్నాతకోత్తర కోర్సులు- ఇదీ చదువుల క్రమం. ఎంఫిల్ రద్దు చేశారు. సెకండరీ విద్య, మాధ్యమిక స్థాయిల నుంచే వృత్తివిద్యను సాధారణ విద్యాక్రమంలో మేళవిస్తారు. అనేక సబ్జక్టుల అధ్యయనం కూడా సెకండరీ స్థాయిలోనే మొదలవుతుంది. ఐదవ తరగతి దాకా, వీలయిన చోట్ల, మాతృభాష (లేదా ప్రాం తీయ భాష)లోనే విద్యాబోధన జరుపుతారు. పరీక్షలు జరిగే తరగతులు, జరిపే విధానం, మూల్యాంకన పద్ధతులు- మొదలయినవన్నీ మారిపోతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా-– భారతీయ సంస్కృతి పునాదులపై విశ్వస్థాయి మహాజ్ఞానశక్తిగా దేశాన్ని పునర్నిర్మించేందుకు ఈ విధానం ఉద్దేశించిందని వ్యాఖ్యానించారు. ఆ లక్ష్యాలకు సంబంధించిన అంశాలేమి ఉన్నాయో తెలుసుకోవడానికి నివేదికను లోతుగా మథించవలసి ఉంటుంది.


1986లో రాజీవ్ గాంధీ హయాంలో, పి.వి. నరసింహారావు మానవవనరుల శాఖ కేంద్రమంత్రిగా రూపొందిన నూతన విద్యావిధానం స్థానం లో ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది. భారతదేశాన్ని సమూలంగా మార్చివేసే సంకల్పం కలిగిన ప్రస్తుత కేంద్రప్రభుత్వం, అందుకు అత్యంత కీలకమయిన విద్యారంగంలో కూడా సంస్కరణల కోసం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ప్రయత్నాలు ప్రారంభించింది. నూతన విద్యావిధానం రూపకల్పన చేసే కమిటీకి ప్రభుత్వం తరఫున కొన్ని సూచనాంశాలను అందించేందుకు టిఎస్ఆర్ సుబ్రమణియన్ చైర్మన్‌గా ఒక కమిటీని 2015లో నియమించారు. ఆయన 2016 మేలో నివేదిక సమర్పించారు. ఆ తరువాత ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన నూతన జాతీయవిద్యా విధాన రూపకల్పన కమిటీని నియమించారు. అదే రెండేళ్ల కిందట నివేదికను సమర్పించింది. హిందీని తప్పనిసరి అభ్యసన భాషగా నిర్దేశిస్తూ తొలుత చేసిన సిఫారసును, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల తరువాత, తుది నివేదకలో తొలగించారు. ప్రభుత్వానికి సమర్పించిన 484 పేజీల నివేదికకు, ఆమోదించిన నివేదికకు మధ్య ఇంకా ఏమిమార్పులు జరిగాయో తెలియవలసి ఉన్నది.


ఈ నూతన విద్యావిధానం వెనుక స్పష్టంగా కనిపించే ఉద్దేశ్యం మాత్రం విద్యారంగ ప్రపంచీకరణకు అనుగుణంగా మన దేశంలోని చదువుల పద్ధతులను మార్చుకోవడం. నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు, క్రెడిట్ల ఆధారంగా విద్యార్థి స్థాయిని కొలిచే పద్ధతి, కోర్సునుంచి వైదొలగడానికి, పాక్షికంగా మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండడం, మానవీయ, సామాజిక శాస్త్రాల, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల మేళవింపుతో పాఠ్యాంశాల ఎంపిక - వంటి ప్రతిపాదనలన్నీ గ్లోబల్ నమూనాకోసం సంకల్పించినవే. నూతన విధానం ద్వారా అనేక విదేశీ యూనివర్సిటీలు మనదేశంలో రకరకాల స్థాయిలలో పనిచేయడం సులువు అవుతుంది. బహుశా, భారతీయ యూనివర్సిటీలు కూడా కొన్ని, చిన్న చిన్న దేశాలలో వ్యాపారం చేయడం సాధ్యపడుతుంది. 


1968లో అమలులోకి వచ్చిన విద్యావిధానం- జాతీయోద్యమ ఆశయాలను, సమానత్వ భావనలను, విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణాన్ని, సర్వతోముఖ వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, 2020 నాటి విద్యావిధానంలో అటువంటి కాలం చెల్లిన సంగతులేమీ లేవు. నైపుణ్యాలను పెంచడం ఒక్కటే పరమలక్ష్యంగా కనిపిస్తుంది. వృత్తి విద్యను పదో తరగతి, లేదా ఇంటర్మీడియేట్ తరువాత మాత్రమే ప్రారంభించాలనుకోవడంలో మన పూర్వ విధానకర్తలకు ఒక కారణం ఉన్నది. సెకండరీ విద్య దాకా, అంటే పదో తరగతి దాకా, విద్య, అనేక జ్ఞానరంగాల మౌలిక అంశాలను బోధించాలి. విద్యార్థిని సామాజికుడిగా చేయడానికి కావలసిన విలువల విద్యను, సాధారణ పరిజ్ఞానాన్ని అందించాలి. వృత్తి విద్య పేరుతో ఆ మౌలిక శిక్షణకు గండి కొడితే, వ్యక్తి వికాసం అపరిపక్వంగా మిగిలిపోతుంది. ఆరవ తరగతి నుంచే కోడింగ్ వంటివి నేర్పాలన్నట్టుగా నివేదిక చెబుతున్నది. విద్యాభ్యాసానికి సాంకేతికతను వాడుకోవడం వేరు, విద్యార్థి దశలోనే ఉత్పాదకులుగా మారడం వేరు. వయసుకు మించిన వృత్తి విద్య నేర్పించడం విద్య మౌలిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. నైపుణ్యాల అవసరం ఉన్న మాట నిజమే, కానీ, ఎగుమతులకు మాత్రమేనా నైపుణ్యాలు? నైపుణ్యం, సాంకేతికత ఒక జత అనుకుంటే, అధ్యయనం, పరిశోధన మరో జత. రెండో జతను కూడా ప్రోత్సహిస్తేనే, నైపుణ్యాలు దేశీయంగా ఉపయోగపడతాయి.


విద్యాహక్కు చట్టం లక్ష్యాలకు, నూతన విద్యావిధానానికి వైరుధ్యాలు ఎదురవుతాయి. ప్రైవేటు విద్యారంగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చొరవా ఈ విధానంలో కనిపించడం లేదు. పైగా, ఫీజుల నిర్ణయంలో ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛ ఉండాలన్నట్టుగా సూచనలు చేశారు. ఐదో తరగతి దాకా మాతృభాషలో విద్యాబోధన అన్న ప్రతిపాదనలోనే, వీలయిన చోట్ల, అని చెప్పి లొసుగు పెట్టారు. స్థూల జాతీయోత్పత్తిలో విద్యకు కేటాయింపులు 6 శాతం ఉండాలన్న లక్ష్యం విధించుకున్నారు. 2019 మార్చితో ముగిసిన విద్యాసంవత్సరంలో మనదేశంలో వెచ్చించినది కేవలం 3.1 శాతం. దాన్ని దాదాపు రెట్టింపు చేయడం ఇప్పట్లో సాధ్యమేనా? విద్య వైద్య రంగాలలో ప్రైవేటు యాజమాన్యాలను పెంచి పోషించి, వారిప్పుడు మహాకాయులుగా మారిన తరువాత, విద్యకోసం, వైద్యం కోసం ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతాయా? 


నూతన విధానంలో తలపెట్టిన విద్యాబోధన పద్ధతులను అమలుచేయాలంటే, ఉపాధ్యాయులకు అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. నాలుగు సంవత్సరాల బిఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సును ఉపాధ్యాయ పోస్టులకు కనీస అర్హతగా 2030 నాటికి అమలుచేయాలన్నది లక్ష్యం. అన్ని చోట్లా ప్రాధమిక పూర్వ తరగతుల ఏర్పాటు కూడా 2030 నాటికే పూర్తి కావాలి. ఈ విధానంలో తక్షణం అమలు అయ్యేవి, చేయగలిగేవి ఏమీ లేవు. ముందు ఈ విధానంపై రాష్ట్రాల అభిప్రాయసేకరణ జరగాలి. చట్టం కావాలి. అమలుకు కావలసిన ప్రాథమిక వ్యవస్థలు ఏర్పాటు కావాలి. అదంతా పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియ మీద ఆసక్తి చూపి, మంచిచెడ్డల వివేచన జరిపితే, తగిన మరమ్మత్తులు సాధ్యం కావచ్చు.

Advertisement
Advertisement
Advertisement