ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-17T09:35:26+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 9.37 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ లెక్కల

ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు చేరిన కరోనా కేసులు

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 9.37 లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9,37,111 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2 కోట్ల 96 లక్షల 74 వేల 788గా ఉంది. గురువారం లేదా శుక్రవారం ఈ సంఖ్య మూడు కోట్లను దాటే అవకాశం కనపడుతోంది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మందికి పైగా కోలుకున్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో 68 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా.. భారత్‌లో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. 


ఇక బ్రెజిల్, రష్యా, పెరూ దేశాలు ఆ తర్వాతి మూడు స్థానాల్లో నిలిచాయి. మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ మాత్రమే ఉన్నాయి. బ్రెజిల్‌లో మరణాల సంఖ్య లక్షా 34 వేలు దాటితే.. అమెరికాలో ఈ సంఖ్య రెండు లక్షలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల కరోనా మరణాలు నమోదైన దేశంగా అమెరికా మాత్రమే ఉంది. ఇక ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఏడాది చివరినాటికి విజయవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లోని వివిధ కంపెనీలు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. 

Updated Date - 2020-09-17T09:35:26+05:30 IST