ప్రపంచవ్యాప్తంగా పది లక్షలు దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-09-28T08:29:09+05:30 IST

కరోనా మహమ్మారి విశ్వాన్ని కబళిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన

ప్రపంచవ్యాప్తంగా పది లక్షలు దాటిన కరోనా మరణాలు

న్యూయార్క్: కరోనా మహమ్మారి విశ్వాన్ని కబళిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య తాజాగా పది లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3.32 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవగా.. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 10,01,494కు చేరింది. అనేక దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మరోమారు విజృంభిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో కరోనాకు కేంద్రంగా ఉండేది. అయితే న్యూయార్క్ ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడంతో అక్కడ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కరోనా అదుపులోకి వచ్చిందనుకుంటే న్యూయార్క్‌లో మళ్లీ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. జూన్ నెల తరువాత న్యూయార్క్‌లో వెయ్యికు పైగా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. 


ఇక ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం మొదటి నుంచి కరోనాకు కేంద్రంగా ఉంది. ఇక గత కొద్ది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్రంలో విధించిన ఆంక్షల్లో సోమవారం నుంచి సడలింపులు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు సోమవారం నుంచి ఆఫీసులకు, అత్యవసర పనులకు బయటకు వెళ్లవచ్చని తెలిపింది. అయితే ప్రజలు తమ ఇంటి నుంచి ఐదు కిలోమీటర్లు దాటి వెళ్లకూడదని.. వెళ్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఇక భారత్‌లో నిత్యం 85 వేల నుంచి లక్ష కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా నిత్యం వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఈ మూడు దేశాల నుంచే నమోదయ్యాయి.

Updated Date - 2020-09-28T08:29:09+05:30 IST