పబ్లిక్‌ ఇష్యూకు గ్లాండ్‌ ఫార్మా!

ABN , First Publish Date - 2020-07-11T06:43:40+05:30 IST

చైనా ఫార్మా సంస్థ ఫోసన్‌ ఫార్మాసుటికల్స్‌ నిర్వహణలోని గ్లాండ్‌ ఫార్మా.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ.. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓకు సంబంధించి ముసాయిదా

పబ్లిక్‌ ఇష్యూకు గ్లాండ్‌ ఫార్మా!

  • చైనా సంస్థ ఫోసన్‌ ఫార్మా సన్నాహాలు 
  • రూ.6,000 కోట్ల సమీకరణ
  • సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు


ముంబై: చైనా ఫార్మా సంస్థ ఫోసన్‌ ఫార్మాసుటికల్స్‌ నిర్వహణలోని గ్లాండ్‌ ఫార్మా.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ.. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓకు సంబంధించి ముసాయిదా (డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌, డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసినట్లు తెలిసింది. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే.. చైనా మాతృసంస్థగా ఉన్న ఒక భారతీయ కంపెనీ తొలిసారిగా పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినట్లవుతుంది. భారత్‌-చైనా దేశాల మధ్య వివాదాలు ముదురుతున్న తరుణంలో ఫోసన్‌ ఫార్మా.. తన అనుబంధ సంస్థ గ్లాండ్‌ ఫార్మాను ఐపీఓకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తుండటం గమనార్హం. కాగా పబ్లిక్‌ ఇష్యూ కోసం ఈ నెలలోనే మర్చంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు గ్లాండ్‌ ఫార్మా సన్నాహాలు చేస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.5,000 కోట్ల నుంచి రూ.6,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలని గ్లాండ్‌ ఫార్మా భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లు నిదానంగా వృద్ధి బాట పడుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఐపీఓకు రావాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇష్యూలో భాగంగా ఫోసన్‌ గ్రూప్‌, గ్లాండ్‌ ఫార్మా ఫౌండర్స్‌ వాటాలను విక్రయించే అవకాశాలున్నాయి. కాగా గ్లాండ్‌ ఫార్మాలో 74 శాతం వాటాలను హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఫోసన్‌.. 2017 అక్టోబరులో సుమారు రూ.8,000 కోట్లకు (109 కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది.

Updated Date - 2020-07-11T06:43:40+05:30 IST