ఇచ్చింది 10

ABN , First Publish Date - 2022-07-07T06:05:27+05:30 IST

విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే...

ఇచ్చింది 10

  1. రెండో రోజూ బడికి చేరని జీవీకే కిట్లు
  2. పాఠశాలకు 5 నుంచి 10 మాత్రమే పంపిణీ
  3. ఒక వస్తువు ఉంటే... మరొకటి ఉండదు
  4. పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, బూట్లు అరకొర సరఫరా
  5. 8వ తరగతి విద్యార్థులకు చేరని సీబీఎస్‌సీ పాఠ్య పుస్తకాలు 
  6. ఇదీ జగనన్న విద్యాకానుక పంపిణీ తీరు

 

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): 

  విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే... బడిలో అడుగు పెడుతున్నప్పుడే నాణ్యమైన బ్యాగు, మూడు జతలు దుస్తులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ... ఇలా పది వస్తుల విద్యా కానుక కిట్‌ పిల్లల చేతిలో పెడుతున్నాం. ప్రభుత్వ బడులు, ఎయిడెడ్‌  పాఠశాలల్లో చదువుతున్న 47 లక్షల మంది పిల్లలకు కానుక అందిస్తున్నాం. 

- మంగళవారం ఆదోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన విద్యా కానుక సభలో సీఎం జగన మాటలివీ...

తొలి రోజు కాదు కదా.. పాఠశాలలు పునఃప్రాంభమైన రెండో రోజు కూడా పాఠశాలలకు కిట్లు చేరలేదు. ఏ ఒక్క బడికీ పూర్తి స్థాయిలో అందలేదు. 5 లేదా 10 మంది విద్యార్థులకు ఇచ్చి... ఫోటోలు దిగి... మమ అనిపించారు. మెజార్టీ పాఠశాలల్లో ఒక్కరికీ ఇవ్వలేదు. కొన్ని పాఠశాలల్లో బెల్టులు, బ్యాగులు మాత్రమే ఇచ్చారు. పాఠ్య, నోట్‌ పుస్తకాలు సగం మందికి కూడా అందలేదు. సీఎం జగన విద్యా కానుక ప్రారంభించిన ఆదోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, నెహ్రూ మెమోరియల్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో మాత్రమే పూర్థి స్థాయిలో ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ కూడా కొన్ని పాఠ్య పుస్తకాలు అందలేదు. యూనిఫాం కుట్టు కూలీ రూ.40  ఏమాత్రం సరిపోదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్‌, కస్తూరిబాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ తదితర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2,950 ఉన్నాయి. అందులో 1 నుంచి 8వ తరగతి వరకు 3,82,924 మంది, 9, 10 తరగతుల్లో 88,100 మంది విద్యార్థులు కలిపి 4,71,024 మంది చదువుతున్నారని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. వారికి 5,24,27,472 నోట్‌ పుస్తకాలు అవసరం కాగా... పూర్తిగా వచ్చాయని తెలిపారు. విద్యా కానుక బ్యాగులు 4,72,844 రావాల్సి ఉంటే 92,301, ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు 4,72,844 దుస్తులకు (యూనిఫాం) గాను  77,912 జతలు వచ్చాయి. బూట్లు 4,72,844 జతలు అవసరం ఉంటే 57,631 జతలు మాత్రమే వచ్చాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ఈ లెక్క ప్రకారమే దుస్తులు 16.47 శాతం, బూట్లు 12.18 శాతం కూడా సరఫరా చేయలేదు. ఎప్పుడు వస్తాయో కూడా జిల్లా అధికారులకు సరైన సమాచారం లేదు. దీంతో గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. 

ఫ అరకొరగా వస్తువులు

 విద్యా కానుక కిట్లలో పది వస్తువులు ఉంటాయని సీఎం జగన ఆదోని వేదికగా స్పష్టం చేశారు. అయితే పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్ట్‌, బ్యాగు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షన రీ కలిపి ఎనిమిది వస్తువులు మాత్రమే ఇస్తున్నారు. తొలి రోజు కానుక పంపిణీ కార్యక్రమం కోసం వివిధ పాఠశాలలకు 5 నుంచి 10 కిట్లు సరఫరా చేశారు. అందులో కూడా ఒక వస్తువు ఉంటే మరొకటి ఉండడం లేదు. అంతేకాదు.. కేవలం ఐదారుగురు విద్యార్థులకు మాత్రమే విద్యా కానుక కిట్లు ఇస్తే మిగలిన విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఉందని మెజార్టీ పాఠశాలల్లో అసలు పంపిణీయే చేయలేదు.  

ఫ పాఠ్య పుస్తకాలూ అంతంతే...

 ఉమ్మడి జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 4.72 లక్షల మందికి మూడు దశల్లో 28,90,754 పాఠ్య పుస్తకాలు రావలసి ఉంది. కానీ 20,33,420 పుస్తకాలు వచ్చాయని, 8,57,328 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 30-35 శాతం కూడా రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. 

ఫ నోట్‌ పుస్తకాలు 24,27,472 అవసరం. అయితే ఇవి మాత్రమే వంద శాతం వచ్చాయి. కీలకమైన లెక్కలు, ఇంగ్లీష్‌ వంటి పాఠ్య పుస్తకాలు సరఫరా చేయలేదు. 8వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌సీ సిలబస్‌కు చెందిన ఏ ఒక్క పాఠ్యపుస్తకమూ పాఠశాలలకు చేరలేదు. 

ఫసరిపోని కుట్టు కూలీ: 

 ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 4.72 లక్షల మందికి ఏటా మూడు జతల యూనిఫారాలు (సమ దుస్తులు) ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో జత కుట్టు కూలీ రూ.40 వంతున మూడు జతలకు రూ.120 తల్లుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలీ రూ.350-400 వరకూ ఉంది. మూడు జతలకు సగటున రూ,1,200 అవుతుంది. 6 నుంచి 10వ తరగతి చదివే పిల్లల యూనిఫాం కుట్టు కూలీ ఒక జతకు రూ.450కు పైగా ఉంది. మూడు జతలకు రూ.1,350కు పైగా చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వమిచ్చేది కేవలం రూ120. ఇది ఏమాత్రం సరిపోదని తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫఇదీ పరిస్థితి

 ఫ ఆదోనిలో విద్యా కానుకను సీఎం జగన ప్రారంభించారు. అదే పట్టణంలోని అర్ధగేరి బసవన్నగౌడ్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 128 మంది విద్యార్థులు ఉంటే... ఇచ్చిన కిట్లు కేవలం పదే. అందులో పూర్తి వస్తువులు లేవు. 1,020 పాఠ్య పుస్తకాలకు గాను 620 వచ్చాయి. యూనిఫారాల క్లాత ఒక్కరికీ ఇవ్వలేదు. 

ఫ ఆదోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 1,350, నెహ్రూ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో 1,817 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఈ పాఠశాలలోనే సీఎం జగన విద్యాకానుకను ప్రారంభించారు. వంద శాతం కిట్లు ఇచ్చామని అధికారులు చెబుతున్నా.. 9,10వ తరగతి తెలుగు మీడియం ఇంగ్లీష్‌, లెక్కలు, ఇంగ్లీషు మీడియం లెక్కలు పాఠ్య పుస్తకాలు, 8వ తరగతి సీబీఎస్‌సీ సిలబస్‌ పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. 

ఫ గూడూరు ప్రాథమిక పాఠశాల (స్పెషల్‌ గాంఽధీ)లో 168 మంది విద్యార్థులు ఉంటే 10 మందికే కిట్లు ఇచ్చారు.

ఫగోనెగండ్ల మండలం తిప్పనూరు ప్రాథమిక పాఠశాలలో 90 మంది విద్యార్థులకు గానూ 10 కిట్లే ఇచ్చారు.

ఫ కోసిగి జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 1,140 మంది విద్యార్థులు ఉంటే.. అరకొరగా కానుక కిట్లు సరఫరా చేశారు. పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, యూనిఫాం సగం మందికి కూడా రాలేదు. పూర్తిగా వచ్చాకే పంపిణీ చేస్తామని ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి వివరించారు. 

ఫ ఆలూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 568 మంది విద్యార్థులు చదువుతున్నారు. కేవలం 60 కానుక కిట్లే ఇచ్చారు. అందులోనూ ఒక వస్తువు ఉంటే మరొకటి లేదు. కీలకమైన బ్యాగులు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు అరకొరగా వచ్చాయి. సర్దుబాటు చేయడం కష్టంగా ఉందని.. వంద శాతం వచ్చాకే విద్యార్థులకు అందజేస్తామని ప్రధానోపాధ్యాయురాలు అర్లమ్మ పేర్కొన్నారు. 

ఫ మద్దికెర జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ  తరగతి వరకు 480 మంది పిల్లలు ఉన్నారు. నోట్‌ పుస్తకాలు, సాక్సులు వంద శాతం వస్తే.. బ్యాగులు 250 వచ్చాయి. పాఠ్య పుస్తకాలు, దస్తులు సగం కూడా రాలేదు. ప్రభుత్వం చెబుతున్న 10 వస్తువులతో పూర్తి స్థాయిలో ఒక్క కిట్‌ కూడా ఇవ్వలేదు. 

ఫతుగ్గలి మండలం ఆర్‌ఎస్‌ పెండేకల్లు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడా అదే పరిస్థితి.

ఫ నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 750 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 20 బ్యాగులు ఇచ్చారు. పాఠ్య పుస్తకాలు 40 శాతం వచ్చాయి. ఒక్క జత దస్తులు ఇవ్వలేదు. నోట్‌ పుస్తకాలు, టై, బెల్టులు వంద శాతం సరఫరా చేశారు. 

ఫ రుద్రవరం ఆదర్శ పాఠశాలలో 340 మంది విద్యార్థులు ఉంటే.. 20 బ్యాగులు వచ్చాయి. పది మందికి మాత్రమే విద్యా కానుక కిట్లు ఇచ్చారు. దస్తులు రాలేదు. 

ఫ ఈ నెలాఖరులో పంపిణీ పూర్తి చేస్తాం 

పాఠశాలకు వచ్చే విద్యార్థుల బయోమెట్రిక్‌ నమోదు ఆధారంగా విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా పూర్తిగా అందజేస్తాం. ఉమ్మడి జిల్లాలో నోట్‌ పుస్తకాలు వంద శాతం, బెల్టులు 93 శాతం, డిక్షనరీలు 53 శాతం వచ్చాయి. 4,72,844 మంది విద్యార్థులకు గానూ 77,912 దుస్తులు, 92,301 బ్యాగులు వచ్చాయి. బూట్లు 57,631 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు చేర్చాం. కొవిడ్‌  నిబంధనలు పాటిస్తూ బయోమెట్రిక్‌ నమోదు చేసి నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేస్తాం. 

- వేణుగోపాల్‌, సమగ్ర శిక్ష, జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌, కర్నూలు: 


Updated Date - 2022-07-07T06:05:27+05:30 IST