మొత్తం మీరే ఇవ్వండి!

ABN , First Publish Date - 2021-06-13T08:48:28+05:30 IST

రాష్ట్రంలోని పేదల కోసం రూ.50వేల కోట్లతో ఇళ్లు కట్టించబోతున్నామని... భారీగా నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని వైసీపీ సర్కారు ఊదరగొట్టింది

మొత్తం మీరే ఇవ్వండి!

‘మౌలిక’ భారం భరించలేం 

రూ.34వేల కోట్లు అవసరం

ప్రధానికి సీఎం జగన్‌ లేఖ 

ఇళ్లకిచ్చే రాయితీలన్నీ కేంద్రం నిధులే

కొత్త ఊళ్లంటూ ఊదరగొడుతున్న సర్కారు 

గోరంత ఖర్చుకు కొండంత ప్రచారం 

నిధుల కోసం మాత్రం కేంద్రంపై ఆధారం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని పేదల కోసం రూ.50వేల కోట్లతో ఇళ్లు కట్టించబోతున్నామని... భారీగా నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని వైసీపీ సర్కారు ఊదరగొట్టింది. దీనిపై ప్రభుత్వ నిధులతో ప్రకటనలు ఇచ్చి మరీ భారీ ప్రచారం చేసుకుంది. కానీ అందులో ఒక్కో ఇంటికి ఎంతమేర రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే విషయం మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. పేదలకు పక్కా ఇళ్ల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది. ఇప్పటికే పేదల ఇళ్లకు రాయితీలన్నీ దాదాపుగా కేంద్రమే ఇస్తుండగా, తాజాగా జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా తమవల్ల కాదని తేల్చేసింది. ఆ నిధులు కూడా కేంద్రమే భరించాలని కోరుతూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ మూడు రోజుల కిందట లేఖ రాశారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కడుతున్న కాలనీలకు తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులు చేపట్టేందుకు రూ.34,109కోట్లు అవసరమని, ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసే పరిస్థితి రాష్ర్టానికి లేనందున గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అటు ఇళ్లు, ఇటు ‘మౌలిక’ భారం మొత్తం కేంద్రంపైనే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 


రాష్ట్రం వాటా అతి స్వల్పం 

వైసీపీ ప్రభుత్వం అమలుచేయనున్న పక్కా ఇళ్ల పథకంలో రాష్ట్రం వాటా అతి స్వల్పంగా ఉంది. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ ఇళ్లు కట్టుకున్నా ఇంటికి రూ.1.80 లక్షల రాయితీ ఇస్తామని సర్కారు ప్రకటించింది. అందులో రూ.1.50 లక్షలు కేంద్రం రాయితీ ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా ఒక్కో ఇంటికి మరో రూ.30వేల రాయితీ సర్దుబాటు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఒక్కో ఇంటికి రూ.30వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద భరించనుంది. గ్రామాల్లో ఏ ఇంటికీ ఒక్క రూపాయి కూడా రాష్ట్రం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయినా మొత్తం రాష్ట్రమే భరిస్తున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ఒకే పథకానికి రెండుసార్లు శంకుస్థాపనలు చేసి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంది. తీరా ఇప్పుడు ఇక మౌలిక సదుపాయాలు కూడా కేంద్రమే భరించాలంటూ లేఖ రాయడంతో పేదలకు కట్టించే ఇళ్లలో అసలు రాష్ట్రం వాటా ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో కేంద్రం వాటా తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఇళ్లకు ఎక్కువ రాయితీలు ఇచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా గతంలో ఇచ్చిన రాయితీలను తగ్గించింది. 


ఆ మిగులు మొత్తానికి కూడా కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 28 లక్షల ఇళ్లు కట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి. పట్టణాల్లో గరిష్ఠంగా 10లక్షల ఇళ్లు ఉన్నా ఒక్కో ఇంటికి రూ.30వేలు చొప్పున రాష్ట్రం ఇచ్చే రాయితీ రూ.3వేల కోట్లు దాటదు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా పక్కా ఇళ్ల రాయితీలకు రూ.50వేల కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.34వేల కోట్లు వెరసి మొత్తం రూ.84వేల కోట్లు అవుతుంటే అందులో వైసీపీ ప్రభుత్వం వాటా అక్షరాలా రూ.3వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. ఇళ్ల నిర్మాణానికి గోరంత ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... కొండంత  ప్రచారం చేసుకుంటోందని, మొత్తం తామే చేస్తున్నామంటూ ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం పేరును నామమాత్రం చేసి, సొంత డబ్బా కొట్టుకుంటోందన్న విమర్శలొస్తున్నాయి. 


స్వరం మార్చేశారు

ఇళ్లు కట్టుకునే స్థోమత లేనివారి బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుని ఇల్లు కట్టించి ఇస్తుందని మెన్నటివరకూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు స్వరం మార్చింది. కేవలం సహకారం మాత్రం అందిస్తామని కొత్త పాట పాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.1.8 లక్షలకు ఇల్లు కట్టడం దాదాపు అసాధ్యం. దానికి కనీసం మరో రెండు రెట్లు అయినా వేసుకుంటేగానీ ఇల్లు పూర్తవదు. ఆ మొత్తం ప్రభుత్వమే భరించి కట్టించి ఇస్తుందని ఆశించిన నిరుపేదలకు ఇప్పుడు నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పేదలైనా, నిరుపేదలైనా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన సొంత నిధులు వెచ్చించే పరిస్థితి కనిపించడం లేదు. 


ఇంటికిచ్చే రాయితీల్లో ఎవరి వాటా ఎంత?

కాంపోనెంట్‌ మున్సిపాలిటీలు గ్రామాలు

కేంద్రం రాయితీ 1,50,000 1,50,000

ఉపాధి హామీ నిధులు 0 30,000

రాష్ట్రం రాయితీ 30,000 0

మొత్తం రాయితీ 1,80,000 1,80,000

Updated Date - 2021-06-13T08:48:28+05:30 IST