జీతాలివ్వండి.. మహాప్రభో!

ABN , First Publish Date - 2022-08-08T05:25:10+05:30 IST

ప్రతినెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ నెల ప్రారంభమై వారం రోజులు దాటుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జీతాలివ్వండి.. మహాప్రభో!
జీతాలు అందించాలని పార్వతీపురంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు (ఫైల్‌)

  రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
  గతంలో ఎన్నడూ లేని పరిస్థితి
  వేతనాల కోసం  కొన్ని శాఖల జిల్లా అధికారులూ ఎదురుచూపు
  సర్కారు తీరుపై విమర్శల వెల్లువ

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)


ప్రతినెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ నెల ప్రారంభమై వారం రోజులు దాటుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో శనివారం పార్వతీపురం జిల్లాకేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని గురువులు రోడ్డెక్కగా, కొన్ని శాఖల ఉన్నతాధికారులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
వాస్తవంగా జిల్లాలో 1722 పాఠశాలలు ఉండగా ఇందులో 3017 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే వారందరికీ ఒకేసారి జూలై నెల వేతనాలు ఒకేసారి జమ కావాల్సి ఉంది. కానీ పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, తదితర మండలాల పరిధిలో  ఉపాధ్యాయులకు ఆదివారం వరకు  వారి  బ్యాంకు ఖాతాల్లోకి జీతాలు జమ కాలేదు. దీంతో పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడతలవారీగా ఉపాధ్యాయులకు వేతనాలు అందించడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెల సకాలంలో వేతనాలు అందించకపోతే  నెలవారీ  వాయిదాలను అపరాధ రుసుంతో చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.  ఇదిలా ఉండగా జిల్లాలో కొన్ని శాఖలకు చెందిన అధికారులకు రెండు నెలల నుంచి వేతనాలు అందలేదు. ఈ విషయాన్ని బయటకు చెబితే వచ్చే ఇబ్బందుల కన్నా.. జీతం అందక ఆర్థికంగా పడుతున్న   కష్టాలే ఉత్తమమని అని ఒక జిల్లా అధికారి ఆ శాఖ ఉద్యోగుల వద్ద అన్నారంటే   పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా రెగ్యులర్‌ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన  జీతాలు అందించాల్సి ఉంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు విడతల వారీగా జీతాలు అందించడం, కొంతమంది జిల్లా శాఖ అధికారులకు వేతనాలు చెల్లించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
సకాలంలోనే  చెల్లింపు
ప్రభుత్వం సకాలంలోనే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తోంది. వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. జీతాలు అందలేదని ఎవరూ  నాకు ఫిర్యాదు చేయలేదు.
-  బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖ అధికారి

Updated Date - 2022-08-08T05:25:10+05:30 IST