రూ.238 కోట్లు ఇవ్వండి..!

ABN , First Publish Date - 2021-04-11T12:01:43+05:30 IST

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో 35వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాలు చేపట్టారు.

రూ.238 కోట్లు ఇవ్వండి..!

సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాలు అసంపూర్తి

పంట కాలువలూ పూర్తికాని వైనం

ఇప్పటికే రూ.261.74 కోట్ల ప్రజాధనం ఖర్చు

ఒక్క ఎకరాకు నీరిస్తే ఒట్టు

కాంట్రాక్ట్‌ సంస్థను రద్దు చేసిన ప్రభుత్వం

నిధులు ఇస్తేనే 35 వేల ఎకరాలకు సాగునీరు


రూ.వేల కోట్లతో నూతన ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నారు. కాస్త నిధులిస్తే వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను విస్మరిస్తున్నారు. అసంపూర్తి పనులు చేస్తే పర్సెంటేజీలు రావనో.. వాటిపై నిర్లక్ష్యమో ఏలిక పెద్దలకే ఎరుక. నిధులు లేక.. పనులు పూర్తికాక నిర్లక్ష్యానికి గుర్తుగా ఉన్నాయి. గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సర్వరాయసాగర్‌, వామికొండ ప్రాజెక్టులు ఆ కోవలోకే వస్తాయి. రూ.301.84 కోట్లతో చేపట్టి ఇప్పటికే రూ.261.70 కోట్లు వెచ్చించినా ఒక్క ఎకరాకు నీళ్లవ్వలేని దైన్యం. అసంపూర్తి పనులకు, భూ సేకరణకు మరో రూ.238 కోట్లు ఇవ్వండంటూ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన ఫైలుకు నెలలు గడిచినా కదలిక లేదు.


(కడప-ఆంధ్రజ్యోతి): గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో 35వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా సర్వరాయసాగర్‌, వామికొండ జలాశయాలు చేపట్టారు. ఈ మేరకు వీటికి కుడి, ఎడమ ప్రధాన కాలువలు, ఫీల్డ్‌ చానల్స్‌ వంటి నిర్మాణాలను 2005 మే 9న కాంట్రాక్ట్‌ సంస్థ గమ్మన ఇండియా రూ.301.84 కోట్లతో చేపట్టింది. అయితే ఆ సంస్థ పనులు చేయలేమంటూ 2015లో చేతులెత్తేయడంతో.. అదే అగ్రిమెంట్‌ ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్లకు పనులు చేసేందుకు కోరమండల్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ ప్రై.లి ముందుకొచ్చింది. ఈ రెండు కంపెనీలు కలిపి ఇప్పటికే రూ.261.74 కోట్లు ఖర్చు చేశాయి. జలశయాలు, మెయిన కెనాల్స్‌ 85 శాతం వరకు పూర్తి చేసినా పంట కాలువలు, డిసి్ట్రబ్యూటరీలు, డ్రాపులు వంటి పనులు 20 శాతం కూడా చేయలేదు. 17 ఏళ్లు గడిచినా అసంపూర్తి పనులతో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి. కాగా.. ఈ పనులు చేయలేం.. ఒప్పందం రద్దు చేయండి అంటూ కాంట్రాక్ట్‌ సంస్థలు పెట్టుకున్న ప్రీ క్లోజర్‌ దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


అసంపూర్తి పనులు పూర్తి చేస్తేనే..

సర్వరాయసాగర్‌ జలాశయం మట్టికట్ట పూర్తయినా రాతిపరుపు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వామికొండ జలాశయం 95 శాతం పూర్తయింది. గమ్మన ఇండియా సంస్థ రూ.239.29 కోట్లు, కోరమండల్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ ప్రై.లి సంస్థ రూ.22.45 కోట్లు కలిపి రూ.261.74 కోట్లు పనులు చేశారు. పంట కాలువలు, స్ట్రక్చర్స్‌ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ పనులు పూర్తి చేసి స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలంటే రూ.158 కోట్లు అవసరమని గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వానికి నివేదిక పంపారు. వాస్తవంగా బ్యాలెన్స పనుల విలువ రూ.40.10 కోట్లే. కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం బ్యాలెన్స పనుల విలువ రూ.158 కోట్లకు చేరిందని ఇంజనీర్లు అంటున్నారు. జాప్యం, నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపైన రూ.117.90 కోట్లకుపైగా అదనపు భారం తప్పడం లేదు. ఒప్పందం మేరకు పనులు చేసి ఉంటే ఖజానాపై భారం తప్పడమే కాకుండా ఇప్పటికే కరువు నేలకు సాగునీరు అంది బీడు చేలు సస్యశామలం అయ్యేవి. ఇప్పటికైనా నిధులు ఇచ్చి పనులు చేపడతారా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకమే. అలాగే.. కాలువ పనులు చేయాలంటే రైతుల నుంచి 840 ఎకరాల భూ సేకరణ చేయాలి. ఎకరా రూ.10 లక్షలు పరిహారం చెల్లించినా 840 ఎకరాలకు రూ.84 కోట్లు అవసరమని అంటున్నారు. బ్యాలెన్స వర్క్స్‌, భూ సేకరణకు రూ.238 కోట్లు ఇవ్వాలని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.


ఎక్కడి పనులు అక్కడే..

- సర్వరాయసాగర్‌ జలాశయం రాతి పరుపు (రివిట్మెంట్‌) 30 వేల క్యూబిక్‌ మీటర్లు, ఆనకట్టపై ప్రహరీగోడ నిర్మించాలి. కుడి, ఎడమ ప్రధాన కాలువల తూములు ఏర్పాటు చేయాలి.

- రైట్‌ మెయిన కెనాల్‌ 16.65 కి.మీలకు గానూ 9 కి.మీలే తవ్వారు. మిలిగిన 7.65 కి.మీలు ప్రధానకాల్వ తవ్వాలి. లెఫ్ట్‌ మెయిన కెనాల్‌ 9.3 కి.మీలకు గానూ 8 కి.మీలు పూర్తి చేస్తే.. 1.30 కి.మీలు తవ్వాలి. అలాగే.. ప్రధాన కాలువ కింద తూములు, డ్రాపులు, డిస్ర్టిబ్యూటరీలు, కల్వర్టులు వంటి స్ట్రక్టర్స్‌ నిర్మించాల్సి ఉంది.

- ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ నుంచి పంట చేలకు సాగునీరు మళ్లించే పంట కాలువలు, డిస్ర్టిబ్యూటరీల నిర్మాణాల్లో ఒక్క గంప మట్టి కూడా తియ్యలేదు. కాలువలు తవ్వాలంటే భూ సేకరణ చేసినా.. 840 ఎకరాలకు రైతులకు పరిహారం ఇవ్వాలి.

- వామికొండ రిజర్వాయర్‌ పరిధిలో 2.5 కి.మీలు ప్యారిపెట్‌ వాల్‌, 5 శాతం రాతి పరుపు ఏర్పాటు చేయాలి. లెఫ్ట్‌ మెయిన కెనాల్‌ 3.66 కి.మీలు తవ్వకాలు పూర్తి చేసినా లైనింగ్‌, స్ట్రక్చర్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. రైట్‌ మెయిన కెనాల్‌ పరిస్థితి ఇలాగే ఉంది. పంట కాలువలు, డిస్ర్టిబ్యూటరీలు నిర్మించలేదు.


ప్రతిపాదనలు పంపాం..

- మధుసూదనరెడ్డి, ఎస్‌ఈ, గాలేరు-నగరి ప్రాజెక్టు, కడప

గాలేరు-నగరి ఫేజ్‌-1 ప్యాకేజీ-2 కింద చేపట్టిన సర్వరాయసాగర్‌, వామికొండ రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు, పంట కాల్వలు అసంపూర్తిగా ఉన్నమాట నిజమే. కాంట్రాక్ట్‌ సంస్థ ప్రీక్లోజర్‌కు దరఖాస్తు చేస్తే ప్రభుత్వం ఆమోదించింది. తాజా ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. నిధులు రాగానే టెండర్లు పూర్తి చేసి పనులు చేపడతాం.

Updated Date - 2021-04-11T12:01:43+05:30 IST