భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-05-06T09:36:30+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు ముగించుకున్న తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు వీలుగా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ ‘క్రెడాయ్‌’ రాష్ట్ర

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ క్రెడాయ్‌ వినతి


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు ముగించుకున్న తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు వీలుగా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ ‘క్రెడాయ్‌’ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రాజా శ్రీనివాస్‌, కేఎ్‌ససీ బోస్‌ తదితరులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్యారోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజా శ్రేయస్సును, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 2 వారాల పాటు కర్ఫ్యూ విధించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించే భవన నిర్మాణ రంగానికి కర్ఫ్యూ వేళల నుంచి మినహాయింపు ఇవ్వని పక్షంలో వారందరూ ఇళ్లకు తిరిగి వెళ్లడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు జీవనోపాధి దెబ్బతినడంతో పాటు నిర్మాణ రంగ సంబంధిత రంగాలన్నింటిపైనా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే డెవలపర్లు, బిల్డర్లు భారీ జరిమానాలకు గురవుతారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భవన నిర్మాణ రంగ కార్మికులకు  సాయంత్రం 5-6 గంటల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతించాలని కోరారు. కొవిడ్‌ నివారణకు, కార్మికులు సురక్షితంగా పనులు చేసుకునేందుకు భవన నిర్మాణ రంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోదన్నారు.

Updated Date - 2021-05-06T09:36:30+05:30 IST