కనీసం స్కేలూ ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-09-18T09:39:44+05:30 IST

కనీసం స్కేలూ ఇవ్వరా?

కనీసం స్కేలూ ఇవ్వరా?

కస్తూర్భా స్కూళ్ల కాంట్రాక్ట్‌ టీచర్లను రెగ్యులర్‌ చేస్తామని ఎన్నికల్లో హామీ

శాసనమండలి సాక్షిగానూ ప్రకటన

రెండున్నరేళ్లుగా ఎదురుచూపులే ఇంతలో టైమ్‌స్కేల్‌పైనా మోసం

ఇచ్చేది లేదన్న సర్వశిక్ష అభియాన్‌


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల్ని రెగ్యులర్‌ ఉద్యోగులుగా చేస్తాం...గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానమిది! కానీ రెగ్యులర్‌ ఉద్యోగులుగా చేయడం సంగతి పక్కనపెడితే, గత ప్రభుత్వం ఇవ్వాలని చెప్పిన కనీస టైమ్‌ స్కేల్‌ కూడా ఇవ్వడం కుదరదని ఇప్పుడు తేల్చేశారు. గత ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో జీవోనం. 24ను విడుదల చేసింది. వీరందరికీ కనీస టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలంటూ దానిలో స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఈ జీవోను అమలుచేయాలని కస్తూర్భాగాంధీ బాలికా ఉన్నత పాఠశాలల్లోని (కేజీబీవీ) కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లు గత రెండున్నరేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కొత్త ప్రభుత్వం కూడా శాసనమండలిలో హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని మాత్రం అమలుచేయలేదు. ఇంతలో, అసలు వీరికి కనీస టైమ్‌ స్కేల్‌ ఇచ్చేదిలేదంటూ సర్వశిక్ష అభియాన్‌ ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నియమించిన కారణంగా.. టైమ్‌ స్కేల్‌ ఇచ్చేందుకు అవకాశం లేదని తేల్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల పరిధిలో 2500 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు కేజీబీవీలు ఏర్పాటయ్యాయి. శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు తదితర చోట్ల ఈ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా కొంతమేర నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద కేజీబీవీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 352 పాఠశాలలున్నాయి. వీటిలో సగం చోట్ల ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు ఉండగా...మరో సగం చోట్ల ఇంటర్‌ విద్యను కూడా బోధిస్తున్నారు. ఇక్కడ పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులంతా ఉన్నత అర్హతలున్నవారే. అంతేకాదు, ఈ పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంలో ఉన్నాయి. అంటే ఉపాధ్యాయులు కాంట్రాక్టు పద్ధతిలోనే ఉన్నా...అత్యంత సమర్థత ఉన్నవారే ఇక్కడ ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కనీస వేతన స్కేల్‌ ఇవ్వాలని వీరంతా డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి అప్పట్లో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ ఇవ్వాలంటూ 2019 జనవరిలో జీవోనెం.12, అనంతరం ఫిబ్రవరి నెలలో దాని ఆధారంగా జీవోఎం.ఎ్‌స.నెం.24ను ప్రభుత్వం జారీచేసింది. అందులో స్పష్టంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ జీతాలు ఇవ్వాలని పేర్కొంది. దానికి ముందు 2018లో వీరి జీతాలను కూడా పెంచింది. అప్పటివరకు రూ.14వేలు ఉన్న కేజీబీవీ ఉపాధ్యాయుల జీతాలను రూ.22వేలు చేసింది. అదేవిధంగా స్పెషల్‌ ఆఫీసర్‌కు(హెడ్‌మాస్టర్‌) రూ.20వేల నుంచి రూ.25వేలకు పెంచింది. అంటే అప్పట్లోనే ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.8వేలు చొప్పున, హెడ్‌మాస్టర్‌కు రూ.5వేలు చొప్పున పెంచింది. ఆ తర్వాత 2015 పే రివిజన్‌ కమిషన్‌ ప్రకారం మినిమమ్‌ టైమ్‌స్కేలు ఇవ్వాలంటూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడు వాటిని అమలుచేస్తే కూడా వారికి పెద్దగా జీతాలేం పెరగవు. రూ.22వేలు ఉన్నవారికి రూ.29వేలు మాత్రమే అవుతుంది. హెడ్‌మాస్టర్లకు కూడా కొంతమేర పెరుగుతుంది. 


అప్పుడు ఇస్తామన్నారు.. 

ఇప్పుడు మరిచారు..

కొంతకాలం క్రితం ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి శాసనమండలిలో ఈ అంశం లేవనెత్తారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సమాధానం ఇస్తూ...కేజీబీవీ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులందరికీ కనీస టైమ్‌ స్కేల్‌ ఇస్తామన్నారు. వీరందరికీ ఆ టైమ్‌ స్కేల్‌ వర్తింపచేసేందుకు రూ.132కోట్ల మేర అదనంగా ఖర్చు అవుతుందని కూడా తెలిపారు. కానీ ఇప్పుడు సర్వశిక్ష అభియాన్‌ డైరక్టర్‌...అసలు వీరికి కనీస టైమ్‌స్కేల్‌ ఇవ్వడం కుదరదంటూ పేర్కొనడం సరికాదని, దీనిపై మళ్లీ శాసనమండలిలో లేవనెత్తుతానని కత్తి నర్సింహారెడ్డి పేర్కొన్నారు. టైమ్‌స్కేల్‌ కోసం రెండేళ్లుగా సాగిస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్‌ ఎం.బాలకాశి తెలిపారు. 

Updated Date - 2021-09-18T09:39:44+05:30 IST