టార్గెట్‌ 15వేల కోట్లు!

ABN , First Publish Date - 2021-06-18T09:09:31+05:30 IST

పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, జిల్లా కేంద్రాల చుట్టు పక్కల అమ్మకానికి వీలుగా ఉన్న భూములనూ గుర్తించాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులకు సూచించింది.

టార్గెట్‌ 15వేల కోట్లు!

  • అమ్మకానికి వీలైన భూముల జాబితా ఇవ్వండి
  • జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని స్థలాలూ గుర్తించండి
  • ఆదాయం పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి
  • అధికారులకు మంత్రి వర్గ ఉప సంఘం సూచనలు
  • భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెంపుపైనా సుదీర్ఘ చర్చ
  • అన్ని వివరాలతో సీఎంకు నివేదిక ఇవ్వాలని నిర్ణయం


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, జిల్లా కేంద్రాల చుట్టు పక్కల అమ్మకానికి వీలుగా ఉన్న భూములనూ గుర్తించాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులకు సూచించింది. భూముల అమ్మకం ద్వారా రూ.15వేల కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బీఆర్‌కే భవన్‌లో మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన గురువారం ఉప సంఘం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. దీనిపై చర్చించి, స్టేక్‌ హోల్డర్స్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత, ప్రాథమిక నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ ఏడాది భూముల విక్రయం ద్వారా సుమారు రూ.20వేల కోట్లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగానే కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల అమ్మకానికి వీలుగా ఇటీవల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అదేక్రమంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఉప సంఘం.. రాష్ట్రానికి ఏయే రూపాల్లో ఆదాయం వస్తుంది? దాన్ని పెంచడం ఎలా? అన్న అంశంపై చర్చించింది. పట్టణ ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రాలకు దగ్గరలో అమ్మకానికి వీలైన భూములనూ గుర్తించాలని సూచించింది. 


డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల జాబితా అందించాలని ఆదేశించింది. ఆదాయం పెంపులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచే అంశాన్నీ కమిటీ పరిశీలించింది. ప్రస్తుతం ఉన్న విలువతో వస్తున్న ఆదాయం ఎంత? విలువను ఏ మేర పెంచితే ఎంత ఆదాయం వస్తుంది? అన్న కోణంలో చర్చ జరిగింది. దీనిపై కూడా నివేదిక అందించాలని మంత్రులు అధికారులకు సూచించారు. అలాగే, ఎక్సైజ్‌తోపాటు ఇతర రంగాల ద్వారా మరింత ఆదాయాన్ని పొందడానికి వీలైన మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఇలా అన్ని రకాల వనరులను సమీకరించి, కనీసం రూ.15వేల కోట్ల మేర ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించినపూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే సీఎంకు నివేదికను అందించాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి,  భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, రిజిస్ట్రేషన్‌-స్టాంపుల శాఖ సీఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T09:09:31+05:30 IST