గీతగోవిందం

ABN , First Publish Date - 2020-09-18T07:02:23+05:30 IST

భక్తి ధరించగల రూపాలలో ప్రేమకు మించింది లేదని ఓం ప్రథమంగా చాటిన కవి జయదేవుడు. ‘గీత గోవిందం’ వినా మరొక కావ్యాన్ని జయదేవుడు వ్రాయలేదు...

గీతగోవిందం

మధుర భక్తి కవితకు వరవడి దిద్దడంలో అగ్రస్థానం జయదేవుని ‘గీత గోవిందం’ కావ్యానిదే! మొగల్, రాజపుత్ర, బసోహ్లి, గులేర్ కళారీతుల ప్రభావాలు అంతర్వాహినులు కాగా, భారతీయ చిత్రకళారంగంలో అత్యద్భుత విజయాన్ని సాధించిన కాంగ్రా కళారీతికి ప్రాణం పోసినట్టిది కూడా జయదేవుని కావ్యమే.


భక్తి ధరించగల రూపాలలో ప్రేమకు మించింది లేదని ఓం ప్రథమంగా చాటిన కవి జయదేవుడు. ‘గీత గోవిందం’ వినా మరొక కావ్యాన్ని జయదేవుడు వ్రాయలేదు. పన్నెండు సర్గలున్నా అది ఏమంత పెద్ద కావ్యం కాదు. అయినా, దాని పద లాలిత్యం, దాని మధుర శైలి, దాని ప్రేమ సందేశం, దాని భక్తి పారవశ్యం దాన్ని ఒక మహాకావ్యాన్ని చేశాయి. భక్తులు కాని వారిని సైతం అలరించగల సాహిత్యపు విలువలు ఆ కావ్యంలో ఉన్నాయి. అయితే కొందరి దృష్టిలో అది కావ్యం కాదని ఇక్కడ చెప్పాలి. వేర్వేరు పండితులు దాన్ని వేర్వేరు విధాలుగా వర్ణించడం కద్దు. పాశ్చాత్య పండితులనే తీసుకుంటే సి.లాసెన్ దాన్ని శృంగారరస ప్రధానమైన రూపకంగా భావించాడు; సర్ విలియం జోన్స్ దాన్ని జానపద గాథగా అభివర్ణించాడు; సెల్వన్ లెవీ దాన్ని ఓపెరాగా పేర్కొన్నాడు; సిష్బెల్ గేయ నాటకంగా దాన్ని పరిగణించాడు; షాన్ ష్రోడర్ దాన్ని వీధి భాగవతం కింద (దీన్ని బెంగాలీలు ‘యాత్రా’ అంటారు) లెక్క కట్టాడు. ఇంతమందిలో ఒక్క ఎ.బి.కీత్ దానికి కావ్యలక్షణాలు లేకపోలేదన్నాడు. 


ఎవరేమన్నా ‘గీత గోవిందం’ ఒక మహా కావ్యం, అంతరంగంలో ప్రత్యేకత వలె బాహ్యరూపంలో సైతం ప్రత్యేకతనే అది సంతరించుకోగలిగింది. కీత్ చెప్పినట్టు దానికున్న పరిపూర్ణత సంస్కృత కావ్యాలలో మరి దేనికీ లేదు. శృంగార నాయికానాయకులు హావభావ విలాసాలను అది ప్రజ్ఞాపూర్వకంగా చిత్రిస్తున్నది. ప్రేమ విరహాలలోని వివిధావస్థలను వాటిలోని స్వల్పాతిస్వల్ప ఛాయా భేదాలను అది ప్రతిభా సమన్వితంగా వివరిస్తున్నది. భాషకు, భావానికి మధ్య అద్వైత స్థితి అది సాధిస్తున్నది. సాహిత్య, సంగీత శిఖరాలపై ఒకే సమయంలో తన విజయపతాకను ప్రతిష్ఠాపిస్తున్నది.


జయదేవుని తర్వాత కేరళలో బిల్వ మంగళుడు, వంగ రాష్ట్రంలోనే విద్యాపతి, చండీదాసులు, ఉత్తర హిందూస్తానంలో కృష్ణదాసు, సూరదాసు, పరమానంద దాసు, కుంభక దాసు, కేశవ దాసు, గోవిందదాసు, బీహారిలాల్, కాళిదాసు, ఆంధ్ర ప్రాంతంలో క్షేత్రయ్య -ఇట్టి ‘మధురభక్తి’ కవులెందరో తలయెత్తారు. వీరిలో కొందరు తమ కవిత ద్వారా చిత్రకళకు, మరికొందరు నాట్యకళకు దోహదాన్ని కూర్చారు. ఉదాహరణకు క్షేత్రయ్య పదాలు కూచిపూడి నాట్య వికాసానికి ఎంతగా తోడ్పడలేదు? సూరదాసు గీతాలు ‘రాగ-రాగిణి’ చిత్రాల ఆవిర్భావానికి ఎంతగా ప్రేరణ కాలేదు? 


ఐతే, ‘మధుర భక్తి’ కవితకు వరవడి దిద్దడంలో సైతం అగ్రస్థానం జయదేవుని ‘గీత గోవిందం’ కావ్యానిదే! మొగల్, రాజపుత్ర, బసోహ్లి, గులేర్ కళారీతుల ప్రభావాలు అంతర్వాహినులు కాగా, భారతీయ చిత్రకళారంగంలో అత్యద్భుత విజయాన్ని సాధించిన కాంగ్రా కళారీతికి ప్రాణం పోసినట్టిది కూడా జయదేవుని కావ్యమే. 


కాంగ్రాకళారీతిని సుప్రతిష్ఠం చేసిన మహా చిత్రకారులలో ఒకరు గీత గోవిందం కావ్యానికి చిత్రాలను కూర్చిన మాణక్. జయదేవుడు కవితతో వర్ణచిత్రాలను సృష్టించగా మాణక్ వర్ణాలతో కవితను చెప్పాడు. కుంచెను పట్టలేకపోయినా, జయదేవుడొక మహాచిత్రకారుడు, పదాల కూర్పు తెలియని వాడైనా మాణక్ ఒక మహాకవి. రాధాకృష్ణులనే వారెన్నుకోవడం భారతీయ సంస్కృతిలో వారిద్దరు సంయోగంలో సృష్టి పరిపూర్ణతకు, వియోగంలో సృష్టి విలయానికి సంకేతాలైనందునే! కృష్ణుడు ఆర్యావర్తానికి, మహా భారత కాలానికి చెందిన ఒక పురుషుడు కాదు; ఇదే విధంగా రాధ కూడా ఏదో ఒక దేశానికి, ఒక కాలానికి చెందిన చెందిన స్త్రీ కాదు. పరస్పర పరిపూర్ణతకై ఎక్కడ ఎప్పుడు రెండు నారీ నర హృదయాలు తపన చెందినా, అక్కడే, అప్పుడే రాధాకృష్ణులు అవతరిస్తారు. వారితో పాటు కవిత అవతరిస్తుంది. కళలు అవతరిస్తాయి. సౌందర్య లావణ్యాలు అవతరిస్తాయి. సత్యం, శివం అవతరిస్తాయి. జయదేవుడు తన మహాకావ్యం ద్వారా, మాణక్ తన చిత్రమాల ద్వారా లోకానికిస్తున్న మహత్తర సందేశమిదే.

1966 ఆగస్టు 21 ‘ఆంధ్రజ్యోతి’

గ్రంథ సమీక్ష ‘కాంగ్రా కళలో రాధాకృష్ణులు’ నుంచి

Updated Date - 2020-09-18T07:02:23+05:30 IST