మిథ్యేగా బాలికల కళాశాల విద్య

ABN , First Publish Date - 2022-07-19T05:47:11+05:30 IST

బాలికల విద్యాభివృద్ధి కోసం ఉన్నత పాఠశాలల్లోనే జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

మిథ్యేగా బాలికల కళాశాల విద్య
బాలికల జూనియర్‌ కళాశాలగా మారిన ఉదయగిరి ఉన్నత పాఠశాల

ఉన్నత పాఠశాలల్లో జూ.కాలేజీల ప్రారంభం

కొనసాగుతున్న అడ్మిషన్లు

ఎంపిక కాని బోధకులు

ఉపాధ్యాయులతోనే బోధన

విద్యార్థినులపై ప్రభావం


కూర్చునేందుకు తగినన్ని గదుల్లేవు. బోధకుల నియామకం చేపట్టలేదు. పాఠ్యపుస్తకాలూ అందుబాటులోకి రాలేదు.ప్రయోగశాల ఏర్పాటుకు కార్యాచరణ సంగతి ఆలోచనే లేదు. అయినా విద్యార్థినుల ప్రవేశాలకు మాత్రం హడావిడి కొనసాగుతోంది. ఇదీ జిల్లాలో ఈ ఏడాది బాలికల కోసం ఇంటర్‌ కోర్స్‌ ప్రవేశపెడుతూ ఉన్నతీకరించిన 23 ఉన్నత పాఠశాలల్లో పరిస్థితి. వివరాల్లోకి వెళితే..


నెల్లూరు (విద్య) జూలై 18 : బాలికల విద్యాభివృద్ధి కోసం ఉన్నత పాఠశాలల్లోనే జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.దీంతో జిల్లాలోని 23 ఉన్నత పాఠశాలల్లో  వీటిని ఏర్పాటు  చేశారు. అయితే  సన్నద్ధతే అస్తవ్యస్తంగా ఉంది. పదోతరగతిలో ఎక్కువమంది బాలికలున్న ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించారు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపుల్లో కనీసం రెండింటిని ఎంపిక చేసుకుని ప్రవేశాలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో 23 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో అల్లూరు మండలం నార్త్‌మోపూరు జడ్పీ,  అనంతసాగరం మండలం రేవూరు జడ్పీ, ఆత్మకూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, బోగోలు జడ్పీ బాలికోన్నత పాఠశాల, చేజర్ల మండలం ఆదూరుపల్లి జడ్పీ, దగదర్తి జడ్పీహెచ్‌ఎస్‌, ఇందుకూరుపేట మండలం ఎంకేఆర్‌ హెచ్‌ఎస్‌, జలదంకి జడ్పీ, కలువాయి బీవీఎన్‌ఆర్‌ జడ్పీ, కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెం జడ్పీ, మనుబోలు జడ్పీ బాలికోన్నత పాఠశాల, ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం జడ్పీ, నెల్లూరులోని సంతపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పొదలకూరు డీఎన్‌ఆర్‌ జడ్పీ, రాపూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సైదాపురం మండలం ఊటుకూరు జడ్పీ, సంగం  జడ్పీ, తోటపల్లిగూడూరు మండలం చెన్నపల్లిపాళెం జడ్పీ, ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లె జడ్పీ, వెంకటాచలం మండలం సర్వేపల్లి జడ్పీ, విడవలూరు మండలం వావిళ్ల జడ్పీ, వింజమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా  మార్పు చేశారు.


స్పందనేది ?

వీటిని ఈనెల ఒకటోతేదీ నుంచి అమల్లోకి తీసుకువస్తూ 220 పనిదినాలు బోధనకు సరిపోతాయని నిర్ణయించారు. అయితే ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు. సోమవారం (ఈనెల 18) నుంచి తరగతులు ప్రారంభిస్తున్నామని అధికారులు ప్రచారం చేపట్టినా పెద్దగా స్పందన లభించడం లేదు. ఉపాధ్యాయులు ఎక్కడికి వెళ్లినా కళాశాలల్లో వసతులు ఉన్నాయా, అధ్యాపకులను పూర్తిస్ధాయిలో నియమించారా..? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాక వారు తలలు పట్టుకుంటున్నారు.  ఈ కళాశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లలో పీజీ పూర్తిచేసిన వారికి ఓ ఇంక్రిమెంట్‌ ఇచ్చి నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన తరగతుల్లో  ఏం బోధిస్తున్నారో, బోధించబో తున్నారోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  


 టీసీలు ఇవ్వకుండా వేధింపులు

 కొత్తగా ఏర్పాటు చేసిన  జూనియర్‌ కళాశాలల్లోనే విద్యార్ధినులు అడ్మిషన్లు పొందాలని ఒత్తిడి తెస్తూ టీసీలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు.  అయితే అధికారులు వీరి గోడు పట్టించుకోకపోగా వారిని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


విద్యార్థినులపై ప్రభావం

ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటయ్యే జూనియర్‌ కళాశాలల్లో  ఉపాఽధ్యాయులతోనే బోధన చేసేలా సర్ధుబాటు చేస్తున్నారు. పీజీ అర్హత కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి వారితో బోధన చేయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంతమంది ఉపాధ్యాయులు ఇంటర్‌ విద్యను బోధించేందుకు ముందుకు వస్తారో చూడాలి. వీరి ఎంపిక, నైపుణ్యాలు తదితర అంశాలన్నీ కూడా పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి. 

 

బోధకులను నియమిస్తాం...

కొత్తగా ఏర్పాటైన జూనియర్‌ కళాశాలల్లో బోధకులను నియమించడానికి చర్యలు చేపడుతున్నాం. పీజీ పూర్తిచేసిన ఉపాధ్యాయుల జాబితాను సిద్ధం చేసి, వారి సంసిద్ధతతో డిప్యుటేషన్‌పై నియామకాలు చేపడతాం. 

-డీఈవో రమేష్‌ 






Updated Date - 2022-07-19T05:47:11+05:30 IST