తాళి కట్టిన ఘటనలో.. బాలికను ఇంటి నుంచి గెంటేసిన తండ్రి

ABN , First Publish Date - 2020-12-05T07:06:29+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కాలేజీ క్లాస్‌ రూమ్‌లో పసుపు కొమ్ముతో తాళి కట్టిన ఘటనలో బాలికను ఆమె తండ్రి ఇంట్లోకి రానివ్వలేదు.

తాళి కట్టిన ఘటనలో..  బాలికను ఇంటి నుంచి గెంటేసిన తండ్రి

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 4: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కాలేజీ క్లాస్‌ రూమ్‌లో పసుపు కొమ్ముతో తాళి కట్టిన ఘటనలో బాలికను ఆమె తండ్రి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మహిళా స్ర్తీశిశు సంక్షేమశాఖ వెంటనే కాకినాడ చిల్డ్రన్‌హోమ్‌కు తరలించింది. గత నెల 17న జూనియర్‌ కాలేజీలో ఒక విద్యార్థి తన తోటి విద్యార్థినికి తాళి కట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఆ బాలిక తండ్రి దృష్టికి గత నెల 25న వెళ్లింది. దీంతో అతను ఆగ్రహించి కాలేజీకి వెళ్లి అక్కడ అధ్యాపకులతో గొడవ పడడంతో కాలేజీలోనూ విషయం తెలిసింది. దీంతో తన పరువు పోయిందని తన కుమార్తెకు, తనకు ఏ సంబంధంలేదని ఆ బాలికను తాళికట్టిన బాలుడు ఇంటికి పంపేశాడు తండ్రి. ఆ బాలికను ఇంటికి తీసుకువెళ్లలేక ఆ బాలుడు తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఆ బాలికను బాలుడు ఇంటికి తీసుకెళ్లి జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడం, వారు వెంటనే స్పందించి బాలిక తండ్రిని వారి పెద్దల ద్వారా సంప్రదించగా అతను తన కుమార్తెకు తనకు సంబంధం లేదని చెప్పడంతో ఆ బాలికను బాలుడు తండ్రి తన ఇంట్లోనే ఉంచారు. శుక్రవారం మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి వచ్చి బాలబాలికలను హోమ్‌కు తీసుకువచ్చి మాట్లాడాలని అధికారుల కు సూచించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ బాలికను మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖ వెంటనే కాకినాడ చిల్డ్రన్‌ హోమ్‌కు తరలించారు. ఈ విషయంపై ఆ శాఖ ప్రాజెక్టు అధికారిణి సీహెచ్‌ నరసమ్మ రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వివాహం చేసుకోవడం నేరం కాబట్టి తాళికట్టిన బాలుడిపైనా, వీడియో తీసీన బాలిక (పెళ్లిచేసుకున్న బాలికకు వరుసకు అక్క)పైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం వీరిని జూవైనల్‌ హోమ్‌కు తరలించొచ్చు.

Updated Date - 2020-12-05T07:06:29+05:30 IST