అమ్మాయిని గంటపాటు ఇంటర్వ్యూ చేసిన వరుడి కుటుంబం.. ఆసుపత్రిపాలైన యువతి

ABN , First Publish Date - 2022-01-31T00:36:53+05:30 IST

గతంలో పెళ్లి చూపులంటే దూరం నుంచి అమ్మాయిని చూసేవారు. నచ్చితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు

అమ్మాయిని గంటపాటు ఇంటర్వ్యూ చేసిన వరుడి కుటుంబం.. ఆసుపత్రిపాలైన యువతి

కోజికోడ్: గతంలో పెళ్లి చూపులంటే దూరం నుంచి అమ్మాయిని చూసేవారు. నచ్చితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే మిగతా విషయాలు వారు చూసుకునేవారు. అబ్బాయి తల్లి మాత్రం వంటొచ్చా? పాటలొచ్చా? ఎంతవరకు చదువుకున్నావ్? వంటి ప్రశ్నలు అడిగేవారు. అక్కడితే ఆ తంతు ముగిసేది.


ఆ తర్వాత కాలం మారింది. దాంతో పాటు పెళ్లి చూపుల్లోనూ మార్పులొచ్చాయి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. నచ్చితే ఓకే. నచ్చకుంటే అభిప్రాయాలను గౌరవించి అక్కడితే దానికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు.


అయితే, ఇది మాత్రం పెళ్లి చూపులకే పరాకాష్ట. అమ్మాయిని చూసేందుకు వచ్చిన అబ్బాయి కుటుంబంలోని మహిళలు ‘అమ్మాయి’ని కదలనివ్వకుండా గంటపాటు ‘ఇంటర్వ్యూ’ చేశారు. ఇంటరాగేషన్‌లా సాగిన ఇంటర్వ్యూ దెబ్బకు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై చివరికి ఆసుపత్రి పాలైంది. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది.


విలతాపురానికి చెందిన యువకుడి కుటుంబ సభ్యులు వనిమెల్‌లోని యువతి ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు. యువకుడు ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చూపులకు రెండు రోజుల ముందే యువకుడు తన సోదరుడు, సోదరితో కలిసి అమ్మాయిని చూసి నచ్చారు. దీంతో అమ్మాయిని చూసేందుకు శుక్రవారం ఏకంగా 25 మంది మహిళలు వారింటికి వెళ్లారు. అందరూ కలిసి యువతి గదిలోకి వెళ్లి తలుపులు మూశారు. గ్రాడ్యుయేట్ అయిన ఆ అమ్మాయిని గంటకు పైగా ‘ఇంటర్వ్యూ’ చేశారు.


అనంతరం భోజనం చేసి బయలుదేరబోతున్న సమయంలో అమ్మాయి విషయంలో తమ అంగీకారాన్ని ఆలోచించి తర్వాత చెబుతామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మాయి తొలుత నచ్చిందని చెప్పి, అంతసేపు మాట్లాడి, భోజనం చేసిన తర్వాత ఈ మాట మార్పు ఏంటంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు మండిపడ్డారు.


ఇంటి గేటు మూసేసి అక్కడి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకున్నారు. అయితే, స్థానికులు జోక్యం చేసుకోవడంతో ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. మహిళలతో పాటు వచ్చిన ఇద్దరు పురుషులను మాత్రం రెండు గంటలపాటు ఇంట్లోనే నిర్బంధించారు. అలాగే, వారు వచ్చిన కార్లలో ఒకదానిని అడ్డుకున్నారు. మరోవైపు, ఈ గందరగోళంతో తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన అమ్మాయిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. 


ఈ ఘటనపై ప్రవాస భారతీయుడైన యువతి తండ్రి మాట్లాడుతూ.. వివాహ ప్రతిపాదనల పేరుతో జరుగుతున్న ఇలాంటి సంప్రదాయాలకు స్వస్తి పలికేందుకే తాను ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  

 


Updated Date - 2022-01-31T00:36:53+05:30 IST