‘ఇక మా ఇంట్లో సందడి లేదు...’

ABN , First Publish Date - 2020-09-20T12:35:58+05:30 IST

నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌లో వరదనీటి నాలాలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన బాలిక సుమేధ అంత్యక్రియలను శనివారం మల్కాజిగిరిలోని

‘ఇక మా ఇంట్లో సందడి లేదు...’

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌లో వరదనీటి నాలాలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన బాలిక సుమేధ అంత్యక్రియలను శనివారం మల్కాజిగిరిలోని పటేల్‌నగర్‌ శ్మశానవాటికలో నిర్వహించారు. తల్లిదండ్రులు బంధువులు, స్థానికులు సుమేధకు కన్నీటి వీడ్కోలు పలికారు. మొన్నటి వరకు ఇంట్లో సందడి చేసిన తమ కుమార్తె ఇక లేదనే మాటను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని కాటికి తీసుకెళ్లే పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదని వారు వాపోయారు. ఆడుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన కూతురు కడుపుకోత మిగిలేలా చేస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. బాలిక తల్లిదండ్రుల రోదనను చూసిన బంధువులు, స్థానికులు కంటతడి పెట్టా రు. సుమేధ చదువులో, ఆటల్లో, నృత్యంలో ప్రతిభ కనబర్చేదని, అందరితో కలిసిపోయేదని స్నేహితులు ఆమె జ్ఞాపకాలను తలచుకున్నారు.


జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే...

ఓపెన్‌ నాలాపై ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వహించడం వల్లే సుమేధ మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఓపెన్‌ నాలాలపై చర్యలు తీసుకుంటే బాలిక మృతి చెంది ఉండేది కాదని వారు పేర్కొన్నారు. బాలిక తలిదండ్రులను టీటీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన నాయకులు పరామర్శించారు.


సంబంధిత అధికారులపై కేసు

సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసినట్లు నేరేడ్‌మెట్‌ సీఐ నరసింహస్వామి తెలిపారు. గత 17వ తేదీన తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశామని, బాలిక నాలాలో కొట్టుకుపోయి చనిపోవడంతో తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామన్నారు. ఓపెన్‌ నాలాపై రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే తమ కుమార్తె చనిపోయిందని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు ఆయన తెలిపారు. 


రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలి

ఓపెన్‌ నాలాలో పడి మృతి చెందిన సుమేధ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ సంబంధిత అధికారులపై శనివారం హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఓపెన్‌ నాలాలపై కప్పులు వేసి, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కమిషన్‌ను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌ జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2020-09-20T12:35:58+05:30 IST