ఆడపిల్ల పేరు నేమ్‌ప్లేట్‌ మీద!

ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST

ఎవరి ఇంటినైనా గుర్తించాలంటే నేమ్‌ప్లేట్‌ మీద పేరు చదవాల్సిందే. అయితే నేమ్‌ప్లేట్‌ మీద ఎక్కువగా మగవారి పేరు మాత్రమే ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలోని మథానా గ్రామంలో ఇంటి నేమ్‌పేట్ల మీద ‘ఆర్తీ నివాస్‌’, ‘సిమ్రన్‌ నివాస్‌’... ఇలా ఆడపిల్లల పేర్లు కనిపిస్తాయి...

ఆడపిల్ల పేరు నేమ్‌ప్లేట్‌ మీద!

ఎవరి ఇంటినైనా గుర్తించాలంటే నేమ్‌ప్లేట్‌ మీద పేరు చదవాల్సిందే. అయితే నేమ్‌ప్లేట్‌ మీద ఎక్కువగా మగవారి పేరు మాత్రమే ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలోని మథానా గ్రామంలో ఇంటి నేమ్‌పేట్ల మీద ‘ఆర్తీ నివాస్‌’, ‘సిమ్రన్‌ నివాస్‌’... ఇలా ఆడపిల్లల పేర్లు కనిపిస్తాయి. ఆడపిల్ల్లల హక్కులు, ఆస్తిలో వారికీ వాటా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మధ్యే ‘కూతుళ్ల పేరుతో ఇళ్లను గుర్తించడం’ అనే కొత్త కార్యక్రమం మొదలెట్టారు జిల్లా అధికారులు. అందులో భాగంగా నేమ్‌ప్లేట్‌ మీద ఆడపిల్లల పేర్లు రాయాలని, తద్వారా ఆ ఇంటిలోని ఆడపిల్లలకు సమాజంలో గౌరవం దక్కేలా చూడాలనేది ప్రధాన ఉద్దేశం.  




కొండ ప్రాంతంలోని ఈ జిల్లాలోని గ్రామాల నుంచి దిగువ ప్రాంతాలకు వలసలు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. అయితే ఆ జిల్లాలో  స్త్రీ,పురుష నిష్పత్తి (1000 మంది మగవాళ్లకు 1103 మహిళలు ఉన్నారు) ఏం మారలేదు. కానీ పిల్లల లింగ నిష్పతి  రాష్ట్రసగటు 963 ఉంటే, పౌరీ గర్వాల్‌ జిల్లాలో మాత్రం 904 మాత్రమే. ఈ పరిస్థితిలో మార్పు తేవాలనే ఆలోచనతో జిల్లా అభివృద్ధి అధికారి ఆశిష్‌ భాట్‌గేన్‌ ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులతో మాట్లాడి అందుకు వారిని ఒప్పించారు. ‘‘పోస్ట్‌మ్యాన్‌ లేదా కొరియర్‌ వాళ్లు మా ఇంటి తలుపు తట్టి ‘ఇది ఆర్తీ జీ ఇల్లేనా’, ‘ఆర్తీజీ ఇంట్లో ఉన్నారా’ అని అడిగినప్పుడు నాకు ఎంతో గర్వంగా, గొప్పగా అనిపిస్తుంది’’ అంటుంది సైకాలజీలో పీజీ చేస్తున్న 21 ఏళ్ల ఆర్తి. ఏడో తరగతి చదువుతున్న సిమ్రన్‌ ఏమంటుందంటే.... ‘‘ఈ చిన్న నేమ్‌ప్లేట్‌ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడైనా మా అమ్మానాన్న నన్ను పై చదువులు చదివిస్తారని ఆశిస్తున్నా’’. ఈ కార్యక్రమంపై జనాల స్పందన తెలుసుకొని, ఈ విధానాన్ని మిగతా జిల్లాల్లో కూడా మొదలుపెట్టే ఉద్దేశంతో ఉన్నామంటున్నారు ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్యా. లింగ సమానత్వం, మహిళల సాధికారత దిశగా మొదటి అడుగులు ఇంటి నుంచి పడాలి. అప్పుడే దేశమంతా మార్పు కనిపిస్తుంది.

Updated Date - 2020-12-07T05:30:00+05:30 IST