Rahul Gandhiపై కోర్టు ధిక్కార పిటిషన్

ABN , First Publish Date - 2022-07-06T22:40:48+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోర్టు ధిక్కారానికి

Rahul Gandhiపై కోర్టు ధిక్కార పిటిషన్

బెంగళూరు : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆయన తన సామాజిక మాధ్యమాల ఖాతాలలో పోస్ట్ చేశారని పిటిషనర్ గిరీష్ భరద్వాజ్ ఆరోపించారు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ఇండియన్ కాపీరైట్ యాక్ట్, 1957; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కోర్టు ధిక్కార చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆరోపించారు. 


కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌పీ సందేశ్ వ్యాఖ్యలతో కూడిన వీడియోను రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారని గిరీష్ భరద్వాజ్ ఆరోపించారు. న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాలను తిరిగి ప్రసారం చేయకూడదని, మార్పులు చేయకూడదని పేర్కొన్నారు. 


‘‘ఆథరైజ్డ్ రికార్డింగ్స్‌ను ఒరిజినల్ ఫార్మ్‌లో కేవలం శిక్షణ, విద్యా సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇటువంటి రికార్డింగ్స్‌ను ప్రమోషనల్ పర్పసెస్ కోసం కానీ, సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడానికి కానీ, ఏ రూపంలోనైనా ప్రమోషన్ చేసుకోవడానికి కానీ ఉపయోగించకూడదని నిబంధనలు నిర్దిష్టంగా చెప్తున్నాయి. లైవ్ స్ట్రీమ్‌ను అనధికారికంగా ఉపయోగించడం ఇండియన్ కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్, కోర్టు ధిక్కార చట్టం సహా ఇతర చట్టాల నిబంధనల ప్రకారం శిక్షార్హం’’ అని గిరీష్ తన లేఖలో హైకోర్టుకు తెలిపారు. 


స్పష్టమైన ప్రకటనలు, నిషేధాలు, ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటన్నిటినీ రాహుల్ గాంధీ ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ వీడియోను రాజకీయ కారణాల కోసం ఉపయోగించారన్నారు. ఇది చాలా అభ్యంతరకరమని, చట్టాన్ని పరిహసించడమేనని తెలిపారు. చిల్లర రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రాహుల్ గాంధీ న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారన్నారు. ఈ దురుద్దేశపూరిత, ప్రేరేపిత చర్యపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. రాహుల్ చర్య కేవలం కోర్టు ధిక్కారం మాత్రమే కాకుండా, రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. 


భయం వద్దు : రాహుల్

రాహుల్ గాంధీ జూలై 5న ఇచ్చిన ట్వీట్‌లో, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను పెట్టారు. తనను బదిలీ చేయిస్తానని బెదిరించారని జస్టిస్ సందేశ్ చెప్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. 


‘‘కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినందుకు ఓ హైకోర్టు జడ్జిని బెదిరించారు. బీజేపీ ఓ వ్యవస్థ తర్వాత మరో వ్యవస్థను అణగదొక్కుతోంది. నిర్భయంగా విధులు నిర్వహిస్తున్నవారికి మనలోని ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. భయపడవద్దు’’ అని రాహుల్ ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-06T22:40:48+05:30 IST