మేమేమీ చేశాము పాపం? మాకెందుకీ శాపం??

ABN , First Publish Date - 2022-05-26T06:34:53+05:30 IST

జిల్లాలో నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏ పరిధిలో విలీనం చేస్తాం...అధికారం చేపట్టిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం.

మేమేమీ చేశాము పాపం?  మాకెందుకీ శాపం??
సుదూరంలో ఉన్న గెడ్డలో నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న రావికమతం మండలం చలిసింగం గ్రామ గిరిజనులు

మైదాన ప్రాంత గిరిజనుల అరణ్యరోదన

అభివృద్ధికి ఆమడ దూరంలో నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియాలోని గిరిజన గ్రామాలు

కొరవడిన మౌలిక సదుపాయాలు 

తాగునీటికి ఊటగెడ్డలే ఆధారం

మిథ్యగా మారిన విద్య, వైద్యం

గర్భిణులు ఆస్పత్రికి వెళ్లాలంటే డోలీ మోతలే శరణ్యం

ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం

5వ షెడ్యూల్‌లో చేర్చాలని దశాబ్దాలుగా పోరాటం

తీర్మానంతో సరిపెట్టిన గిరిజన సలహా మండలి

రెండేళ్లయినా కేంద్రానికి చేరని విలీన ప్రతిపాదనలు

ప్రకటనలకే పరిమితమైన పాలకుల హామీలు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనుమానాలు


(చోడవరం, పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏ పరిధిలో విలీనం చేస్తాం...అధికారం చేపట్టిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. నన్ము నమ్మండి... మీకు పూర్తి హామీ ఇస్తున్నా...

- 2018లో విపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద మైదాన ప్రాంత గిరిజనులకు జగన్‌ ఇచ్చిన హామీ


గిరిజనులు నివసిస్తున్న నాన్‌షెడ్యూల్‌ ఏరియాలను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.

- ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన.


అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గాలకు ఆనుకుని మైదాన ప్రాంత మండలాల్లో (నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియా) గల గ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అటు ఐటీడీఏ పరిధిలో చేర్చక, ఇటు మైదాన ప్రాంత అధికారులు పట్టించుకోకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పక్కా ఇళ్లు వంటి మౌలిక సదుపాయాలు కొరవడి, సమస్యలతో సతమతం అవుతున్నారు. కొద్దోగొప్పో చదువుకున్నా...ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాలకు అర్హులు కారు. మైదాన ప్రాంతంలోని ఇతర గిరిజనులతో పోటీ పడే పరిస్థితి లేదు. తమ గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చి, ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని సుమారు 300 గ్రామాల గిరిజనులు దశాబ్దాలుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు. మన్యానికి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజనుల గోడుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 

ఏజెన్సీలో అత్యంత వెనుకబడిన గిరిజనులు, ఆదివాసీల హక్కులను కాపాడడానికి, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి, ఇతరుల నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆయా ప్రాంతాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో చేరుస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమల్లోకి వచ్చింది. కానీ మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న సుమారు 300 గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చలేదు. 

కొరవడిన మౌలిక సదుపాయాలు 

అనకాపల్లి జిల్లాలో కోటవురట్ల, నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, చీడికాడ, వి.మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో 37 గ్రామ పంచాయతీల్లోని సుమారు 300 గ్రామాల్లో గిరిజనుల జనాభా అధికంగా ఉంది. అధికారుల అంచనా మేరకు ఈ పంచాయతీల్లో వాల్మీకి, భగత, కొండదొర, గదబ, నూకదొర, కొండ కమ్మరి, కోందు, మన్నెదొర తెగలకు చెందిన గిరిజనులు లక్ష మందికిపైగా ఉన్నారు. పోడు వ్యవసాయం, జీవాలు, పశువుల పెంపకమే వీరికి జీవనాధారం. 5వ షెడ్యూల్‌లో వున్న ఏజెన్సీ ప్రాంతంతో పోలిస్తే ఈ గ్రామాలు మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత విషయాల్లో బాగా వెనుకబడ్డాయి. గిరిజన సబ్‌ప్లాన్‌ నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో తాగునీరు, రహదారులు, విద్యుత్‌, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఈ గ్రామాల్లో ఎక్కడా ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నప్పటికీ ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండరు. నెలకు ఒకటి, రెండుసార్లు చుట్టంచూపుగా వచ్చి వెళుతుంటారు. తీవ్ర అస్వస్థతకు గురైనా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా...డోలీలో మోసుకుంటూ వాహనాలు నడిచే ప్రాంతం వరకు తీసుకురావాలి. తాగునీటికి ఊటగెడ్డలు, చలమలే ఆధారం. దీంతో కలుషిత నీటి వల్ల వ్యాధులు, జ్వరాలు, అతిసార బారిన పడుతున్నారు. సాగునీటి సదుపాయం లేదు. చేద్దామన్నా కూలి పనులు ఉండవు. ఒక్క ఉన్నత పాఠశాల కూడా లేదు. ఉదాహరణకు రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలో చలిశింగం, రొచ్చుపణుకు, కడగడ్డ గ్రామాలకు చెందిన గిరిజన బాలబాలికలు హైస్కూల్‌ విద్య కోసం 14 కి.మీ. దూరంలో వున్న ఎంకేపట్నం ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం దక్కడం లేదు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు మైదాన ప్రాంత గిరిజనులు అనర్హులని అధికారులు అంటున్నారు. కనీస సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మండల కార్యాలయాల వద్ద తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ అధికారులు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు.   

గిరిజన సలహా మండలిలో తీర్మానం

రాష్ట్రంలో మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయాలని 2020 జూలైలో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్పవాణి నేతృత్వంలో గిరిజన సలహా మండలి (టీఏసీ) తీర్మానం చేసింది. ఈ మేరకు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని గ్రామాల్లో సభలు నిర్వహించి 50 శాతానికిపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామాల జాబితాలను తయారుచేశారు. ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో 200 గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అధికారులు చెప్పిన  వాటికంటే ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయని, వాటిని కూడా ఏజెన్సీలో విలీనం చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు నిర్వహించి 22 నెలలు అయినా ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు. 

కేంద్రానికి చేరని ప్రతిపాదనలు

మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో (ఐటీడీఏ పరిధిలోకి) చేర్చేందుకు గల అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. గిరిజనులు నివసిస్తున్న నాన్‌షెడ్యూల్‌ ఏరియాలను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించారు. కనీసం జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అయినా తమను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేస్తారన్న ఆశలు సైతం ఆవిరయ్యాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఒత్తిళ్లే కారణమా?

మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న గిరిజన గ్రామాలను ఏజెన్సీలో విలీనం కాకుండా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, వి.మాడుగుల మండలాల పరిధిలో పెద్ద మొత్తంలో లేటరైట్‌, గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మైనింగ్‌ లైసెన్సులు ఎవరైనా పొందవచ్చు. అదే ఏజెన్సీ ఏరియాలో విలీనం చేస్తే గిరిజనేతరులకు అవకాశం లభించదు. మరోవైపు మైదాన ప్రాంతంలోని మండలాలను గత ఏడాది వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీని ఆనుకుని వున్న మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఈ మండలాల్లోని గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతంలో విలీనం చేస్తే గిరిజనేతరులు భూముల క్రయవిక్రయాలకు అనర్హులవుతారు. ఈ కారణాల వల్లనే మైదాన ప్రాంత గిరిజన గ్రామాలు ఏజెన్సీలో విలీనం కాకుండా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అడ్డుపడుతున్నారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 


వెంటనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి

- కె.గోవిందరావు, గౌరవ అధ్యక్షుడు, ఏపీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్‌ సాధన కమిటీ

నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలోని గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేస్తామని సుమారు రెండేళ్ల క్రితం గిరిజన సలహా మండలి సమావేశంలో తీర్మానం చేశారు. కానీ ఇంతవరకు ఎటువంటి కదలిక లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏజెన్సీ ఏరియాకు పాడేరు కేంద్రంగా ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటుచేసింది. కనీసం ఆ సమయంలో అయినా మైదాన ప్రాంతంలోని గిరిజన గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయకపోవడం శోచనీయం. ఇప్పటికైనా స్పందించి మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి.


Updated Date - 2022-05-26T06:34:53+05:30 IST