Advertisement
Advertisement
Abn logo
Advertisement

వికసించని ‘గిరి వికాసం’

క్షేత్ర స్థాయిలో పథకంపై ప్రచారం కరువు
గిరిజన రైతుల్లో కొరవడిన అవగాహన
ఆరు జిల్లాల్లో 94 దరఖాస్తులే దాఖలు
మొదటి యేడాది ఒక్కటి కూడా రాలేదు
పథకం అమలుకు నిబంధనల అడ్డంకి
నిధులున్నా అమలు శూన్యం


వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న పేద గిరిజన రైతులకు చేదోడుగా నిలవడానికి రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరి వికాస పథకం అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. సాగులో వెనుకపడ్డ గిరిజన రైతులను గుర్తించి వారికి ఆర్థికంగా భరోసా కల్పించడంతోపాటు బీడు భూములను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ ఈ పథకం గురించి గిరిజన రైతులకు అవగాహన లేకపోవడం, నిబంధనలు, లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో జాప్యం వెరసి పథకం లక్ష్యం నీరుగారుతోంది.

హనుమకొండ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : గిరి వికాస పథకాన్ని 2019-20లో ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గిరిజన రైతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేట్టు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద మొత్తం 423 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో మహబూబాబాద్‌ జిల్లాకు 77, ములుగు జిల్లా 96, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు 89, హనుమకొండ జిల్లాకు 46, వరంగల్‌ జిల్లాకు 71,  జనగామకు 44 యూనిట్లు  కేటాయించారు. ఈ యూనిట్ల అమలుకు ఈ ఆరు జిల్లాలకు కలిపి సుమారు రూ. 3.60 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ పథకం గురించి గిరిజన ప్రాంతాల్లో పెద్దగా ప్రచారం చేయకపోవడంవల్ల రైతులకు అవగాహన లేకుండా పోయింది. దీంతో గిరి వికాసం కింద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ ఆరుజిల్లాల్లో 94 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులోనూ ధ్రువపత్రాలు సరిగా లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో 21 దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా 73 దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలనలో ఉన్నాయి.

విధి విధానాలు

కేవలం బీడు భూములు మాత్రమే ఉన్న గిరిజన రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఐదెకరాల కంటే తక్కువ బీడు భూములు ఉన్నవారు అర్హులు. ఒకే చోట ఉన్న ఇద్దరిని ఒక బృందంగా చేసి ఉమ్మడి యూనిట్‌ మంజూరు చేస్తారు. వ్యవసాయ పనులకు అవసరమైన విద్యుత్‌ను మూడు దశలుగా అందచేస్తారు. ఈపథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎంపీడీవో, తహసీల్దార్‌నుంచి అవసరమైన ధృవ, అనుమతిపత్రాలు తీసుకొని జత చేయాలి. దరఖాస్తులు తీసుకునే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వాటిని పరిశీలించి తుది అనుమతి కోసం కలెక్టర్‌ కార్యాలయానికి పంపిస్తారు. ఎంపికైన లబ్ధిదారుల భూమిలో వందశాతం రాయితీతో బోరు మోటారు ఏర్పాటు చేస్తారు. బోరు పంపు లోతు, విద్యుత్‌ సరఫరా చేసే తీరును బట్టి ఒక్కో యూనిట్‌కు రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు చెల్లిస్తారు.

ఇబ్బందులు
ఐదెకరాల బీడు భూమిని ఒక యూనిట్‌గా గుర్తించడం ఈ పథకం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణంగా ఒకే రైతుకు కచ్చితమైన విస్తీర్ణం కలిగి ఉండడు. ఇద్దరికి కలిపి మంజూరు చేద్దామంటే నిబంధనల ప్రకారం భూమి ఎక్కువైనా, తక్కువైనా అనర్హులు. అర్హులైన వారికి ఒకే చోట ఉండకపోవచ్చు. ధరఖాస్తు చేసుకోవాలంటే ఉపాధి హామీ జాబ్‌ కార్డు కలిగి  ఉండాలి.

ఇందిర జలప్రభ స్థానంలో..

గిరి వికాస పథకం అమలు బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. గిరిజన సంక్షేమ శాఖ సౌజన్యంతో అమలయ్యే ఈ పథకం ద్వారా గిరిజన భూములను సాగులోకి తీసుకురావడం, గిరిజన రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. నగదు బదిలీ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. గతంలో ఇందిర జలప్రభ పథకం ఉండేది. ఆ పథకం ఆగిపోవడంతో దాని స్థానంలో గిరి వికాకం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా నాలుగు రకాలుగా గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరుస్తారు. పనికిరాని మొక్కలు, స్టంప్‌లు, బండరాళ్లు మొదలైన వాటిని తొలగించడం ద్వారా బంజరు భూములను, సాగుభూములుగా మారుస్తారు. ఇక గిరిజన రైతుల పొలాలకు బోర్లు వేయించడం, బోర్లు తవ్వించడం చేస్తారు.  బోర్లు ఉన్న రైతులకు విద్యుత్‌  సదుపాయం కల్పిస్తారు. చెరువులను నిర్మిస్తారు.

కొరవడిన ప్రచారం

ఈ పథకం గురించి గిరిజన రైతులకు అవగాహన కల్పించేలా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి  అర్హత పొందాలంటే గిరిజన రైతలు పట్టా కలిగి ఉండాలి. ఇందిర జలప్రభ పథకంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏ మాత్రం పరిజ్ఞానం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించడం వల్ల కమీషన్లకు కక్కుర్తిపడి ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేశారు. అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. దీంతో ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఎంతో నష్టం కలిగింది. గిరిజన రైతులకు కూడా లబ్ధిచేకూరలేదు. దీంతో ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి గిరిజన వికాసం పేరుతో ప్రవేశపెట్టినా ఫలితం పెద్దగా లేకుండా పోతోంది. పథకం అమలులో లోపించిన చిత్తశుద్ధి, నిర్లక్ష్యం, నిబంధనల ఫలితంగా గిరిజనుల బీడు భూముల పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ఈ పథకం గురించి గిరిజన రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని గిరిజన రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement
Advertisement