గోవిందుడి సేవకు గిర్‌ గోవులు

ABN , First Publish Date - 2021-07-28T08:38:40+05:30 IST

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి సేవకు త్వరలో గిర్‌ గోవులు తిరుమలకు చేరుకోనున్నాయి. శ్రీవారికి రోజూ సమర్పించే..

గోవిందుడి సేవకు గిర్‌ గోవులు

నైవేద్యానికి ఇక కొండపైనే నెయ్యి తయారీ

గుజరాత్‌ నుంచి వస్తున్న 25 గోవులు

ఇప్పటికే హైదరాబాద్‌కు చేరిక

తిరుమల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి సేవకు త్వరలో గిర్‌ గోవులు తిరుమలకు చేరుకోనున్నాయి. శ్రీవారికి రోజూ సమర్పించే నైవేద్యం, అఖండ దీపారాధన కోసం వినియోగించే నెయ్యి మరింత నాణ్యతతో ఉండేలా ఇకపై కొండపైనే తయారుచేసి వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. అది కూడా సిసలైన దేశీ జాతి గోవుల క్షీరాన్ని వినియోగించాలని సంకల్పించింది. ఆ నిర్ణయం అమలు ప్రక్రియ ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. 25 గిర్‌ గోవులు  ్వరలో తిరుమలకు చేరుకోనున్నాయి. వాస్తవానికి దేశీ జాతి గోవులను సమకూర్చుకోవడం కోసం టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్‌ సహా 8 మందితో టీటీడీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. ‘రెండ్‌సిందీ, సాయిబాల్‌, తార్పక్కర్‌, రాతి, గిర్‌, కాంక్రీస్‌, హర్యానా, ఒంగోలు, పుంగనూరు, పొడుతూర్పు’ వంటి దేశీ గోవు జాతులను పరిగణనలోకి తీసుకుంది. ‘ఏడుకొండల స్వామికి ఏడు జాతుల ఆవులు’ అనే సంకల్పంతో కనీసం ఏడు జాతులను సమకూర్చుకోవాలని నిర్ణయించిన ప్రత్యేక కమిటీ తొలి దశలో 25 గిర్‌ జాతి గోవులను కొనుగోలు చేసింది. రవాణా ఖర్చులతో కలిపి దాదాపు ఒక్కో గోవుకు రూ.1.20 లక్షలు వెచ్చించారు. వీటిని గుజరాత్‌ నుంచి మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మరో వారంలో వాటిని తిరుమలకు తీసుకువచ్చేలా కమిటీ ప్రణాళికలు రూపొందించుకుంది.

సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారీ

రోజూ శ్రీవేంకటేశ్వరస్వామి నైవేద్యాల తయారీకి 30 కిలోలు, అఖండ దీపారాధనకు మరో 30 కిలోల నెయ్యి అవసరముంటుంది.  సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యిని తయారుచేసి స్వామి సేవకు వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.  ఇప్పుడు కొన్న గిర్‌ గోవుల ద్వారా రోజుకు 10 కిలోల నెయ్యి తయారుచేయవచ్చని కమిటీ అంచనా వేస్తోంది. త్వరలో మిగిలిన జాతులకు సంబంధించిన గోవులను కూడా తీసుకొచ్చి.. నైవేద్యం, దీపారాధనకు అవసరమయ్యే 60 కిలోల నెయ్యిని ఇదే తరహాలో తయారుచేయాలన్నది ఆలోచన.

Updated Date - 2021-07-28T08:38:40+05:30 IST