జిన్నింగ్‌ చీటింగ్‌!

ABN , First Publish Date - 2022-08-20T09:30:08+05:30 IST

కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల స్థాపనకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జిన్నింగ్‌ చీటింగ్‌!

కొత్త మిల్లుల పేరుతో రాయితీ స్వాహా

ఐదేళ్ల తర్వాత యూనిట్ల బంద్‌.. మళ్లీ కొత్త పేర్లు, అడ్ర్‌సతో అనుమతులు

పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్తు సబ్సిడీలతో లబ్ధి

ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో జోరుగా దందా

అధికారులు, ప్రజాప్రతినిధుల ఆశీస్సులు.. ప్రతిగా 8-10శాతం కమీషన్‌

ప్రభుత్వానికి ఫిర్యాదులు.. రూ.350 కోట్ల నిధుల విడుదలకు బ్రేక్‌

వీటిలో రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా బోగస్‌ బిల్లులే?


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల స్థాపనకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాత మిల్లులను నష్టాల పేరుతో మూసేసినట్లు చేసి.. వాటికి కొత్త పేరు, చిరునామా తగిలిస్తున్నారు. ఆపై కొత్త మిల్లు కోసం అన్నీ సమకూర్చుకున్నామని, స్థాపనకు అనుమతులు కావాలంటూ సర్కారుకు అర్జీ పెట్టుకుంటున్నారు. అలా ప్రభుత్వం నుంచి పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్తు సబ్సిడీ, రిజిస్ట్రేషన్‌, రీయింబర్స్‌మెంట్‌, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ తదితరాలు పొందుతున్నారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా జరిగినట్లు సమాచారం. కొత్త చిరునామా, కొత్త పేర్లతో అనుమతులు తీసుకొని పాత మిల్లులనే నడిపిస్తూ రాయితీ దోపిడీ చేస్తున్న ఈ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి.


ఫలితంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. నిధులు దుర్వినియోగానికి చెక్‌ పెట్టేందుకు కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులకు చెల్లించాల్సిన రూ. 350 కోట్ల నిధులకు బ్రేక్‌ వేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 350 జిన్నింగ్‌ మిల్లులున్నాయి. ఏటా 15 నుంచి 20 జిన్నింగ్‌ మిల్లులు మూత పడుతున్నాయి. మళ్లీ 10 నుంచి 15 మిల్లులు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. అయితే ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కొన్ని జిన్నింగ్‌ మిల్లుల నేపథ్యం భిన్నంగా ఉంది.  తెలంగాణ ప్రభుత్వం ‘టీఎస్‌- ఐపా్‌స’లో భాగంగా పరిశ్రమలను ప్రోత్సహించటానికి పలు రాయితీలు ప్రకటించి అమలు చేస్తోంది. రూ. 25 లక్షల నుంచి రూ. 5 కోట్ల పెట్టుబడితో స్థాపించే యూనిట్లు చిన్నతరహా పరిశ్రమల విభాగంలో, రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల పెట్టుబడితో స్థాపించే యూనిట్లను మధ్యతరహా పరిశ్రమల విభాగంలో చేర్చారు. అయితే జిన్నింగ్‌ మిల్లులన్నీ దాదాపుగా మధ్య తరహా పరిశ్రమల విభాగంలోనే ఉన్నాయి. పెట్టుబడి రాయితీ గరిష్ఠంగా 33 శాతం వరకు ఉండగా, యూనిట్‌ స్థాపనకు బ్యాంకులో తీసుకున్న రుణానికి ‘పావలా వడ్డీ’ మాత్రమే చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఒక యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్తు బిల్లులో రాయితీ ఇస్తుండగా, స్టేట్‌ జీఎస్టీ 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ కల్పించటం గమనార్హం.


ఈ రాయితీలు, సబ్సిడీలన్నీ ఐదేళ్ల వరకే వర్తిస్తాయి.  అయితే ఐదేళ్లపాటు అన్నిరకాల రాయితీలు పొందిన తర్వాత నిక్షేపంగా నడుస్తున్న మిల్లులను నష్టాల పేరుతో మూసివేసినట్లు కాగితాలపై చూపుతున్నారు. ఆ మిల్లునే కొత్త పేరు, అడ్ర్‌సతో కొత్త మిల్లుగా తెరమీదికి తెస్తున్నారు.   ఉదాహరణకు ఆదిలాబాద్‌ జిల్లా రాంపూర్‌ రోడ్డులో ఒక కాటన్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం సేల్‌ ట్యాక్స్‌, పెట్టుబడి రాయితీ, విద్యుత్తు సబ్సిడీ కలిపి రూ. 1.13 కోట్లు డ్రా చేసింది. తర్వాత ఇండస్ట్రీ పేరుమార్చిన తర్వాత సేల్‌ ట్యాక్స్‌, విద్యుత్తు సబ్సిడీ పేరు తో రూ. 85.15 లక్షలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుంది. ఇలానే రాంపూర్‌ ఏరియాలో ఉన్న 12 జిన్నింగ్‌ మిల్లులను యాజమాన్యాలు  రెండు, మూడుసార్లు ఖాయిలా పడేసి, తిరిగి వాటినే మారుపేరుతో తెరిచి అక్రమంగా రాయితీలు పొందాయనే ఆరోపణలున్నాయి. భైంసా, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఇచ్చోడ, బోఽథ్‌ ప్రాంతాల్లో ఉన్న జిన్నింగ్‌ మిల్లులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. వరంగల్‌ జిల్లా ధర్మారం ప్రాంతంలో ఉన్న జిన్నింగ్‌ మిల్లుల దందా ఇదే తరహాలోనే నడుస్తోంది.  ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన అక్రమాలు, వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పరిశ్రమలశాఖ ఇన్స్‌పెక్టర్‌పై దాడి చేయటమే కాకుండా, ఆయన్ను జిల్లా నుంచి బదిలీ చేయించిన ఉదంతం కూడా జరిగింది. జిన్నింగ్‌ మిల్లర్లు సంబంధిత శాఖల అధికారులతో కుమ్మ క్కై ఈ తరహా అక్రమాలకు పాల్పడతున్నారు.  


‘రాయితీ’ దందాపై సీఎంవోకు ఫిర్యాదులు

జిన్నింగ్‌ మిల్లర్ల రాయితీ దోపిడీ ఉదంతంపై విచారణ జరిపించేందుకు గతంలో ఆదిలాబాద్‌ జిల్లాలో పనిచేసిన ఒక కలెక్టర్‌ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఆ విచారణ ముందుకు సాగలేదు. మరోవైపు జిన్నింగ్‌, ప్రెసింగ్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులు రాయితీల బకాయిలు మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ముగ్గురు మంత్రులను కలిసి రాయితీలు విడుదలచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిన్నింగ్‌ మిల్లులన్నింటికి కలిపి ‘రాయితీ’ బిల్లు బకాయిలు రూ. 450 కోట్లు ఉండగా  గతంలో రూ. 100  కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా రూ. 350 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో కొన్ని డూప్లికేట్‌ బిల్లులు ఉన్నాయని, ఖాయిలా పడిన జిన్నింగ్‌ మిల్లులపై బిల్లులు డ్రాచేస్తున్నారని సీఎంవోకు కొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ చెల్లింపులు కూడా పద్ధతి ప్రకారం జరగలేదని... సిరిసిల్ల, ఆదిలాబాద్‌, వరంగల్‌ కొత్త జిల్లాల్లోని కొందరు జిన్నింగ్‌ మిల్లర్లకు మాత్రమే రాయితీలు విడుదల చేశారంటూ ఇతర జిల్లాలకు చెందిన కాటన్‌ జిన్నింగ్‌ మిల్లర్లు సీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకున్నట్లు, సుమారు 350 కోట్ల విడుదలకు బ్రేక్‌ వేసినట్లు సమాచారం. జిన్నింగ్‌ మిల్లులకు సంబంధించి ఎలాంటి బిల్లు మంజూరు చేయొద్దని, ‘ఇన్సెంటివ్‌’లో అవకతవకలున్నాయని, పైగా ఖజానాలో నిధుల కొరత ఉన్నదని సీఎంవో నుంచి ఆదేశాలున్నట్లు తెలిసింది. 


చేతులు మారుతున్న నిధులు

జిన్నింగ్‌ మిల్లులకు సంబంధించిన ‘రాయితీ’ బిల్లులు మంజూరుచేసే ప్రక్రియలో... పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఫిర్యాదులున్నాయి. కొందరు ప్రజాప్రతినిఽధులు, అధికారులకు కలిపి 8 శాతం నుంచి 10 శాతం వరకు పర్సంటేజీలు ముట్టజెప్పినట్లు తెలిసింది. జిన్నింగ్‌ మిల్లుల్లో జరిగిన ‘రాయితీ’ దోపిడీపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు జిన్నింగ్‌ మిల్లర్లు మాత్రం... బోగస్‌ మిల్లులు, డూప్లికేట్‌ బిల్లులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని, పక్కాగా ఉన్న జిన్నింగ్‌ మిల్లుల బిల్లులు ఆపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-20T09:30:08+05:30 IST