‘గడప గడప’లో బెల్లం రైతు ఆందోళన

ABN , First Publish Date - 2022-05-20T06:09:23+05:30 IST

నల్లబెల్లం విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విఽధిస్తే తమ పరిస్థితి ఏమిటని చెరకు రైతులు ఆందోళనకు దిగారు.

‘గడప గడప’లో బెల్లం రైతు ఆందోళన
కన్నంపేటలో బెల్లం దిమ్మను పగలగొట్టి ఆందోళన తెలుపుతున్న రైతులు.

నల్లం బెల్లంపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌

ఎమ్మెల్యే ధర్మశ్రీకి బెల్లం దిమ్మలతో నిరసన తెలపాలని నిర్ణయం

అటువైపు వెళ్లకుండా రూటు మార్చిన వైసీపీ నేతలు

బెల్లం దిమ్మలు పగలగొట్టి బిగ్గరగా నినాదాలు

రైతుల వద్దకు వచ్చి వాకబు చేసిన ఎమ్మెల్యే

మార్కెట్‌ యార్డులో అమ్ముకుంటే ఇబ్బందులు ఉండవని సలహా


రావికమతం, మే 19: నల్లబెల్లం విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విఽధిస్తే తమ పరిస్థితి ఏమిటని చెరకు రైతులు ఆందోళనకు దిగారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి తమ సమస్య  తెలపడానికి రోడ్డుపై బెల్లం దిమ్మలతో రోడ్డుపై బైఠాయించారు. కానీ స్థానిక వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే అటువైపు వెళ్లకుండా దారి మళ్లించే ప్రయత్నం చేశారు.   దీంతో రైతులు నల్లబెల్లం దిమ్మలను పగలగొట్టి, తమ సమస్య పరిష్కరించాలని పెద్దగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వారి వద్దకు వచ్చి మాట్లాడారు. 

 ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం మండలంలోని కన్నంపేట గ్రామంలో పర్యటించారు. వార్డుల వారీగా సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో 4, 5వ వార్డులకు చెందిన చెరకు  రైతులు.. నల్లబెల్లం అమ్మకాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులను ఎమ్మెల్యేకు చెప్పుకోవడానికి రోడ్డుపై నల్లబెల్లం దిమ్మలు పెట్టి నిరీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే అటుగా వస్తున్న సమయంలో ఆయన వెంట వున్న వైసీపీ నాయకులు... బెల్లం దిమ్మలతో నిరసన తెలుపుతున్న వారంతా టీడీపీ మద్దతుదారులని, అందువల్ల వాళ్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ మరో వార్డులోకి తీసుకెళ్లారు. ఇది గమనించిన రైతులు నల్లబెల్లం దిమ్మలను పగలగొట్టి, తమ సమస్యను పరిష్కరించాలని  పెద్దగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ధర్మశ్రీ వారి వద్దకు వచ్చి సమస్య ఏమిటని అడిగారు. నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారన్న నెపంతో నల్లబెల్లం అమ్మకాలపై ప్రభుత్వ ఆంక్షలు విధించిందని, దీంతో వ్యాపారులు కొనుగోలుచేయక ఇళ్లల్లో బెల్లం దిమ్మలు పేరుకుపోయాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సారా తయారీని అరికట్టడంలో విఫలమైన అధికారులు, బెల్లం అమ్మకాలపై ఆంక్షలు విధించడం విడ్డూరంగా వుందని చెరకు రైతులు పైలా అప్పారావు, దంట్ల సత్తిబాబు, గొల్లవిల్లి రాము, దంట్ల శ్రీను, లక్ష్మి, జోగినాయుడు తదితరులు విమర్శించారు. చెరకు సాగు కోసం అధిక వడ్డీకి అప్పులు చేసి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు నల్లబెల్లం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తే బెల్లం ఏం చేయాలని ప్రశ్నించారు. బెల్లం తయారీపై ఆధారపడి వేలాది మంది రైతులు జీవిస్తున్నందున తక్షణమే  ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ, నల్లబెల్లాన్ని నాటుసారా తయారీకి కాకుండా మార్కెట్‌ యార్డుల్లో విక్రయించాలని సూచించారు.

కాగా తమకు వైఎస్‌ఆర్‌ చేయూత నిలిపివేశారని దంట్ల పార్వతమ్మ, సుబ్బలక్ష్మి, మల్లేశ్వరి, రాజు, రాజేశ్వరి, లక్ష్మి, పడాల పద్మ తదితర 16 మంది మహిళలు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి, అర్హులందరికీ పథకాన్ని పునరుద్ధరించాలని ఎంపీడీఓ రామచంద్రమూర్తిని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దంట్ల వెంకటరమణ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ గుమ్ముడు సత్యదేవ, వైసీపీ మండల అధ్యక్షుడు కంచిపాటి జగన్నాథరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:09:23+05:30 IST