ఆనంద సాగరం

ABN , First Publish Date - 2020-11-22T06:07:25+05:30 IST

ఆనంద సాగరం

ఆనంద సాగరం

గిలకలదిండి హార్బర్‌ అభివృద్ధికి అడుగులు

రూ.348 కోట్లతో నిర్మాణం

సముద్ర ముఖద్వారం పూడికతీతకు మార్గం సుగమం

వందలాది కోట్ల రూపాయలు ఆదాయానికి అవకాశం

ఎంతోమంది మత్స్యకారులకు వరం

ఏళ్ల తరబడి కల ఎదుటకొచ్చి నిలబడింది. ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మత్స్యకారుల కళ్లల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్‌ ఇక జిల్లాకే మకుటాయమానంగా నిలవనుంది. రూ.348 కోట్లతో అత్యాధునిక హార్బర్‌ నిర్మించేందుకు మొదటి అడుగు పడటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరనుంది. ఆదాయమూ దండిగా వచ్చే అవకాశం ఏర్పడింది. 

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్‌ అభివృద్ధికి మార్గం ఏర్పడింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని  పురస్కరించుకుని గిలకలదిండి హార్బర్‌కు వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌ శనివారం శంకుస్థాపన చేశారు. రూ.348 కోట్లతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. ఈ హార్బర్‌ నుంచి 102  సోనాబోట్లు, 900కు పైగా ఫైబర్‌ బోట్లు చేపల వేట సాగిస్తుంటాయి. సముద్ర ముఖద్వారం వద్ద పూడిక తీయకపోవడంతో పోటు వచ్చే వరకు సరుకుతో ఉన్న బోట్లు సముద్రంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. సముద్రంలోకి మరింత దూరంలో బ్రేక్‌ వాటర్‌ నిర్మిస్తే పోటుతో నిమిత్తం లేకుండా బోట్లు అన్నివేళల్లో రాకపోకలు సాగించవచ్చు.

హార్బర్‌ నిర్మాణం ఇలా..

గిలకలదిండి నూతన హార్బర్‌లో పలు విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. బోటు రిపేర్‌ షాపు, స్లోపింగ్‌ హార్డ్‌, బ్రేక్‌ లాండింగ్‌, బోట్లు నిలిపే స్థలం, మత్స్యకారులు విశ్రాంతి తీసుకునే షెడ్‌,  గేర్‌షెడ్‌, వలలు సరిచేసుకునే యార్డు, పౌరసేవల కోసం ప్రత్యేక స్థలం,  చేపలు వేలంవేసే హాలు, రేడియో కమ్యునికేషన్‌ సెంటర్‌,  పరిపాలనా భవనం,  రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మరుగుదొడ్లు, ఐస్‌ప్లాంట్లు, వాహనాల పార్కింగ్‌ స్థలం, మంచినీటి సౌకర్యం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఎలక్ర్టిక్‌ సబ్‌స్టేషన్‌, ప్రధాన గేటు, సెక్యూరిటీ విభాగాలను నిర్మిస్తారు.

39వేల మందికి ప్రయోజనం

తీరం వెంబడి 64 గ్రామాల్లో 1.63 లక్షల మంది మత్స్య కారులు నివసిస్తున్నారు. వీరిలో 39 వేలమందికిపైగా సముద్రపు వేటనే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. గిలకలదిండి హార్బర్‌ను అభివృద్ధి చేస్తే వీరందరికీ ప్రయోజనంతో పాటు సకాలంలో, సులువుగా చేపల ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుంది. మార్కెటింగ్‌ సౌకర్యాలు మెరుగుపడతాయి.

ప్రతిపాదనలన్నీ పాతవే!

గిలకలదిండి హార్బర్‌ ప్రతిపాదన పాతదే. గత టీడీపీ ప్రభుత్వంలోనూ అప్పటి అంచనాతో కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, కేంద్రం నుంచి నిధులు రాక ముందుకు సాగలేదు. అయితే, గత ప్రభుత్వంలో ఇచ్చిన కాంట్రాక్టులు, ప్రాజెక్టుల అంచనాలపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి, ప్రజాధనం ఆదా చేస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం గతేడాది వేసిన అంచనాలనే పెంచేసింది. 

Updated Date - 2020-11-22T06:07:25+05:30 IST