New party: మరో రెండ్రోజుల్లో గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ

ABN , First Publish Date - 2022-09-25T23:34:25+05:30 IST

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరో..

New party: మరో రెండ్రోజుల్లో గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ

శ్రీనగర్: కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరో రెండు రోజులలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఆదివారంనాడు ఢిల్లీ నుంచి జమ్మూ చేరుకున్న ఆజాద్ ఆ వెనువెంటనే తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ''పార్టీ ప్రారంభించడానికి ముందు సోమవారంనాడు మీడియాను ఆహ్వానిస్తున్నాను. కార్యకర్తలు, నేతలతో మాట్లాడేందుకే ఇక్కడున్నాను'' అని ఆయన చెప్పారు.


ఆజాద్ కొత్త పార్టీ ప్రకటించనున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు ఒకరు ధ్రువీకరించారు. కార్యకర్తలు, నేతలతో ఆదివరాంనాడు ఆయన వరుస సమావేశాలు జరుపుతున్నారని, 27న శ్రీనగర్ వెళ్తారని చెప్పారు. పార్టీ జెండా, పేరు ఖరారయ్యాయని, జమ్మూకశ్మీర్‌లో కొత్త పార్టీ ఆవిర్భావానికి మరో ఒకటి రెండు రోజులు పడుతుందని చెప్పారు. 73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సంప్రదింపుల యంత్రాగాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు. ఆజాద్‌కు మద్దతుగా జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ సహా సుమారు 12 మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడం, ఇక్కడి స్థానికుల భూమి, ఉద్యోగ హక్కుల పరిరక్షణ తమ పార్టీ ప్రధాన ఎజాండా కానుందని ఆజాద్ ఇప్పటికే తెలియజేశారు. 

Updated Date - 2022-09-25T23:34:25+05:30 IST