Congressకి 300 సీట్లు రావడం డౌటే.... గులాం నబీ

ABN , First Publish Date - 2021-12-02T19:00:48+05:30 IST

ప్రస్తుత పరిస్థితులనుబట్టి చూస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి

Congressకి 300 సీట్లు రావడం డౌటే.... గులాం నబీ

న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితులనుబట్టి చూస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 300 స్థానాలు లభించే అవకాశం తనకు కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవన్నారు. దీనిని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దీనిని పునరుద్ధరించే అవకాశం లేదన్నారు. జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 


‘‘మాకు సొంతంగా (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి) 300 మంది ఎంపీలు వచ్చేదెప్పుడు? అందువల్ల నేను (అధికరణ 370ని పునరుద్ధరిస్తానని) వాగ్దానం చేయలేను, ఎందుకంటే 2024లో 300 మంది ఎంపీలు మాకు ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, మాకు 300 మంది ఎంపీలు వచ్చేలా భగవంతుడు చేయవచ్చు. కానీ ప్రస్తుతం నాకు అలా కనిపించడం లేదు. అందుకే నేను ఎలాంటి తప్పుడు వాగ్దానం చేయబోను, అధికరణ 370 గురించి మాట్లాడటం లేదు’’ అని గులాంనబీ ఆజాద్  బుధవారం జరిగిన బహిరంగ సభలో చెప్పారు. ప్రస్తుతం ఆయన జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 


ఇటీవల కశ్మీరులో ఆజాద్ మాట్లాడుతూ, అధికరణ 370 గురంచి మాట్లాడటం సంబంధం లేని విషయమవుతుందన్నారు. జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, సత్వరమే శాసన సభ ఎన్నికల నిర్వహణ  తన ప్రధాన డిమాండ్లు అని చెప్పారు. 


Updated Date - 2021-12-02T19:00:48+05:30 IST