ఏడాది క్రితం అదృశ్యమైన ఓడ.. సడెన్‌గా వేరే దేశ తీరంలో ప్రత్యక్షం

ABN , First Publish Date - 2020-02-19T14:32:57+05:30 IST

ఎప్పుడో ఏడాది క్రితం కనిపించకుండా పోయిన ఓ ఓడ.. సడెన్‌గా వేరే దేశ తీరంలో ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలానే జరిగింది గ్రీస్‌కు చెందిన ఎమ్వీ ఆల్టా అనే ఓడ విషయంలో.

ఏడాది క్రితం అదృశ్యమైన ఓడ.. సడెన్‌గా వేరే దేశ తీరంలో ప్రత్యక్షం

డబ్లిన్: ఎప్పుడో ఏడాది క్రితం కనిపించకుండా పోయిన ఓ ఓడ.. సడెన్‌గా వేరే దేశ తీరంలో ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలానే జరిగింది గ్రీస్‌కు చెందిన ఎమ్వీ ఆల్టా అనే ఓడ విషయంలో. 1976లో టాంజానియాలో నిర్మించిన ఈ ఓడను 2017లో గ్రీస్ దేశం కొనుక్కుంది. ఆ మరుసటి ఏడాదే అమెరికా దగ్గరలోని హైతీ నగరానికి పంపించింది. దాదాపు 1,380మైళ్లు అంటే సుమారు 2,220 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బెర్ముడా సమీపంలో సడెన్‌గా ఆల్టా ఆగిపోయింది. ఏమైందా అని చూస్తే ఓడలో పవర్ కనెక్షన్ పోయినట్లు తేలింది. ఈ సమాచారం అందుకున్న యూఎస్ కోస్ట్‌గార్డ్.. ఆల్టాలో ఉన్న సిబ్బందిని కాపాడారు.


ఆ తర్వాత ఓడను గుయానా వరకూ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడుండగా ఈ పడవను కనిపించకుండాపోయింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టులో బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ అధికారులు.. ఈ ఓడ అట్లాంటిక్ సముద్రంలో తమ కంటబడిందని, సాయం చేద్దామని వెళ్తే దానిలో ఎవరూ లేరని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఆల్టా ఎవరి కంటా పడలేదు. ఇప్పుడు సడెన్‌గా ఐర్లాండ్‌లోని బాలీకాటన్ ప్రాంతంలో సముద్రతీరంలో ప్రత్యక్షమైంది. డెన్నిస్ తుఫాను వల్లే ఈ ఓడ ఇక్కడకు వచ్చిందని ఐర్లాండ్ అధికారులు భావిస్తున్నారు. నిపుణులు పరిశీలించిన తర్వాత దీన్ని ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - 2020-02-19T14:32:57+05:30 IST