Abn logo
Jul 26 2021 @ 01:39AM

ఘోరం..

ఆస్పత్రి వద్ద విలపిస్తున్న మృతుల బంధువులు


రసూల్‌ (ఫైల్‌ఫొటో), ఖాజామైను (ఫైల్‌ఫొటో), విశ్వనాథ్‌ (ఫైల్‌ఫొటో)

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..

ముగ్గురు యువకుల దుర్మరణం

అతి వేగం వల్లే ప్రమాదం

గుత్తిరూరల్‌, జూలై 25: అతి వేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. గుత్తి మండలంలోని కొత్తపేట గ్రామ శివారులోని 67వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఖాజామైను(18), రసూల్‌(25), విశ్వనాథ్‌(27) మృతి చెందారు. గుత్తి పట్టణం తాడిపత్రి రోడ్డులోని మారుతీనగర్‌కు చెందిన ఖా జామైను, రసూల్‌ యంగిలిబండ డాబా వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై గుత్తికి వస్తుండగా కొత్తపేట గ్రామ శివారులో ఇసురాళ్లపల్లి నుంచి వస్తున్న విశ్వనాథ్‌ ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఖాజామైను, విశ్వనాథ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. రసూల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రసూల్‌ను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 


మృతుల నేపథ్యమిదీ

గుత్తికి చెందిన కూరగాయల వ్యాపారులు దస్తగిరి, కుళ్లాయమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు రసూల్‌ బీటెక్‌ చదువుతున్నాడు. పండ్ల వ్యాపారం చేసే రసూల్‌ పీరా, గౌసియా దంపతుల పెద్ద కుమారుడు ఖాజామైను తల్లిదండ్రులకు తోడుగా ఉండేవాడు. కర్నూలు జిల్లా ప్యా పిలి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, రామాంజినమ్మ దంపతుల పెద్దకుమారుడు విశ్వనాథ్‌ ముంబైలో వ్యాపారం చేస్తుండేవాడు. విశ్వనాథ్‌ తండ్రి మూడేళ్ల కిందట, తల్లి 40 రోజుల కిందట మరణించారు. విశ్వనాథ్‌ ఇసురాళ్లపల్లిలోని తన అక్క అనురాధ వద్దకు వస్తుండేవాడు. ఈ క్రమంలోనే ప్రమాదంబారిన పడ్డాడు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు రోదించటం పలువురికి కంటతడి పెట్టించింది. సీఐ రాము, ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ ఘటనా స్థలిని పరిశీలించి మృతదేహాలను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.