తానామిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-17T05:08:57+05:30 IST

కురబలకోట మండలంలోని తానామిట్ట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తానామిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
లారీ కిందకు దూసుకెళ్లిన బైక్‌

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం

మహిళ పరిస్థితి విషమం..తిరుపతికి తరలింపు

ఎద్దులవారిపల్లెలో అలుముకున్న విషాదం


మదనపల్లె క్రైం, మే 16: కురబలకోట మండలంలోని తానామిట్ట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన ఖాదర్‌బాషా (19), అతడి పెదనాన్న కుమార్తె అజీరా (36), ఆమె పిల్లలు జోయా (8), జునెద్‌ (6)లు సోమవారం ద్విచక్రవాహనంలో మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. కాగా సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. దారిలో కురబలకోట మండలం తానామిట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో ఖాదర్‌బాషా, జోయా, జునెద్‌లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా అజీరా తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితికి చేరుకుంది. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ముదివేడు పోలీసులకు సమాచారం అందించి అజీరాను చికిత్సనిమిత్తం 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుకుమార్‌ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అయితే జోరుగా వర్షం కురుస్తుండడంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు ఇబ్బందిపడ్డారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ద్విచక్రవాహనం లారీ ముందు చక్రాల కిందకు దూసుకెళ్లి ఆగింది. కాగా అతి వేగంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. లారీకి రోడ్డు పల్లం కావడంతో ఓవర్‌స్పీడుగా రాగా ద్విచక్ర వాహనంలో వెళుతున్న వారు కూడా వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.


ఎద్దులవారిపల్లెలో విషాదం..

ఈ ఘటనతో ఎద్దులవారిపల్లెలో విషాదం అలుముకుంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మరణించడం, మరొకరు తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితికి చేరుకోవడంతో బాధిత కుటుంబంలో తీరని విషాదం నింపింది. ముఖ్యంగా ఖాదర్‌బాషా, అజీరాల కుటుంబీకులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.



Updated Date - 2022-05-17T05:08:57+05:30 IST