కౌంట్‌ డౌన్‌..!

ABN , First Publish Date - 2021-01-24T06:36:00+05:30 IST

గ్రేటర్‌ మేయర్‌ ఎన్నికకు కసరత్తు మొదలైంది.

కౌంట్‌ డౌన్‌..!

మేయర్‌ ఎన్నిక ప్రక్రియ మొదలు

ప్రిసైడింగ్‌ అధికారిగా కలెక్టర్‌..? 

ఈసారీ.. సామూహిక ప్రమాణస్వీకారం?

ఎక్స్‌అఫీషియో సభ్యులు 42 లేదా 43 మంది..

ఎమ్మెల్సీల వివరాల కోసం బల్దియా లేఖ

కేకేకు ఓటింగ్‌ చాన్స్‌?

హైదరాబాద్‌ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ మేయర్‌ ఎన్నికకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో అధికారిక ప్రక్రియను జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. వచ్చే నెల 11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ప్రిసైడింగ్‌ అధికారిగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతిని నియమించాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ  ఎన్నికల అధికారి హోదాలో కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా కలెక్టర్‌ పేరును సూచిస్తూ శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. నేడో, రేపో అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం గ్రేటర్‌ పరిధిలోని జిల్లాల్లో విధులు నిర్వహిస్తోన్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించే అవకాశముంది. ప్రస్తుతం శ్వేతామహంతి మేడ్చల్‌-మల్కాజ్‌గిరి ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై భిన్న ప్రచారాల నేపథ్యంలో కలెక్టర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా ఉండడం ఉత్తమమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 


అందరూ ఒకేసారి.. 

నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 11వ తేదీ 11గంటలకు జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని పేర్కొంది. కౌన్సిల్‌లో 149 మంది సభ్యులున్నారు. ఒకరికి మూడు నుంచి ఐదు నిమిషాల చొప్పున ఒక్కొక్కరుగా అందరూ ప్రమాణ స్వీకారం చేసేందుకు 8 నుంచి 13 గంటలు పడుతుంది. ఒక రోజు మొత్తం సమావేశం నిర్వహించినా ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యే అవకాశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంతకు ముందు కౌన్సిళ్ల తరహాలో ఈసారీ సామూహిక ప్రమాణ స్వీకారం చేయించాలని జీహెచ్‌ఎంసీ కార్యదర్శి కార్యాలయ వర్గాలు భావిస్తున్నాయి. 2001, 2009, 2016లో కూడా ఇదే పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేయించారని, ఇప్పుడూ అదే విధానంలో అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు. సామూహిక ప్రమాణ స్వీకారంలో భాగంగా అందరికీ ప్రమాణ పత్రాలు ఇస్తారు. తమ పేరు చెప్పి అందరూ ఒకేసారి ప్రమాణ పత్రం చదవాల్సి ఉంటుంది. ఇలా, అయితే 30 నిమిషాల నుంచి గంటలోపు ప్రమాణ స్వీకారం పూర్తవుతుంది. అనంతరం సమావేశం వాయిదా వేసి 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం కౌన్సిల్‌ను తిరిగి సమావేశపరుస్తారు. 


తేలని ఎక్స్‌అఫీషియో సభ్యులు

జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యు ల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. 2016లో ఈ సంఖ్య 49వరకు ఉండగా, ఈసారి 42 నుంచి 43 మంది వరకు ఉండే అవకాశముందని ఓ అధికారి చెప్పారు. ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీల్లో ఎంత మందికి గ్రేటర్‌లో ఓటు హక్కు ఉంది అన్న విషయాన్ని పరిశీలించిన అనంతరం ఈ సంఖ్య మారవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ సీడీఎంఏకు శనివారం లేఖ రాసింది. ఎమ్మెల్సీల వివరాలివ్వాలని శాసనసభా కార్యదర్శిని కూడా కోరినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం గ్రేటర్‌లో ఓటరు అయిన ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియోగా ఉండే అవకాశముంది. ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీని ఆప్ట్‌ చేసుకోవడం, పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మండలి నుంచి తీసుకునే ఎమ్మెల్సీల వివరాల ఆధారంగా వారికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు ఉందా, లేదా అన్నది ఎన్నికల విభాగం అధికారులు పరిశీలిస్తారు. నోటీసులు పంపే తేదీ నాటికి ఓటరు జాబితాలో ఎమ్మెల్సీ/ఎంపీ పేరుంటే 11వ తేదీన ప్రత్యేక సమావేశం ఉందన్న సమాచారంతో నోటీసులు పంపుతారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోని వారికి మాత్రమే జీహెచ్‌ఎంసీలో ఓటు వేసే అవకాశముంటుంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ఆదిభట్ల మునిసిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేశారు. కిందటి పదవీ కాలంలో ఆయన ఓటు వేయడం, ఇటీవల మళ్లీ ఎంపికైన నేపథ్యంలో ఈ సారి జీహెచ్‌ఎంసీలో కూడా ఎక్స్‌అఫీషియో ఓటు వేసే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కార్పొరేటర్లు పార్టీ విప్‌ పాటించాల్సి ఉండగా, ఎక్స్‌అఫీషియోలకు విప్‌ వర్తించదు.   


Updated Date - 2021-01-24T06:36:00+05:30 IST