HYD : రెండు పర్యాయాలు నోటిఫికేషన్‌.. ముందుకు రాని సంస్థలు.. కియోస్క్‌.. ఓ టాస్క్‌!

ABN , First Publish Date - 2022-05-19T15:28:39+05:30 IST

వేసవి సీజన్‌ మరో రెండు, మూడు వారాల్లో ముగియనుంది. పౌరుల దాహార్తి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయాలనుకున్న వాటర్‌ కియో‌స్క్..

HYD : రెండు పర్యాయాలు నోటిఫికేషన్‌.. ముందుకు రాని సంస్థలు.. కియోస్క్‌.. ఓ టాస్క్‌!

  • కమిషనర్‌కు అధికారుల నివేదిక
  • గత ఏటీఎంల వైఫల్యం నేపథ్యంలోనే..? 
  • ప్రణాళిక లేకుండా అధికారుల చర్యలు
  • వేసవి మొదలయ్యాక టెండర్‌

హైదరాబాద్‌ సిటీ : వేసవి సీజన్‌ మరో రెండు, మూడు వారాల్లో ముగియనుంది. పౌరుల దాహార్తి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయాలనుకున్న వాటర్‌ కియో‌స్క్ (Water Kiosk) (వాటర్‌ ఏటీఎం.. Water ATMs)లు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అధికారులకు ముందస్తు ఆలోచన, ప్రణాళిక లేకపోవడంతో ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. కియోస్క్‌ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ ప్రకటించిన టెండర్‌కు స్పందన కరువైంది. మార్చి 23న ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ), రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) కు సంస్థ ప్రకటనలు జారీ చేసింది. ఏప్రిల్‌ 6న దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించింది. ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో ఏప్రిల్‌ 19న రెండో దఫా నోటిఫికేషన్‌ ప్రకటిస్తూ మే 2 నాటికి బిడ్‌ దాఖలుకు అధికారులు అవకాశం కల్పించారు. రెండు పర్యాయాలూ ఏజెన్సీలు ముందుకు రాలేదు. కియోస్క్‌ల ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని పేర్కొంటూ కమిషనర్‌కు నివేదిక పంపామని ఇంజనీరింగ్‌ అధికారొకరు తెలిపారు.


గతంలో 200కు పైగా..

వేసవి తీవ్రత నేపథ్యంలో నగరవాసుల దాహార్తి తీర్చేందుకు కియో‌స్క్‌ల ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ (GHMC) దృష్టి సారించింది. మూడేళ్ల క్రితం నగరంలో 200కు పైగా వాటర్‌ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. కాయిన్‌లు వేసి అవసరమైనంత నీరు తీసుకునే అవకాశం కల్పించారు. గతంలో చేసిన ఏటీఎంల ప్రయోగం పూర్తిగా విఫలమైంది. నగరంలోని ఏ ఏటీఎంలో ప్రస్తుతం చుక్క నీరు రావడం లేదు. ప్రధాన, అంతర్గత రహదారుల పక్కన ఉన్న ఈ ఏటీఎంలు పాదచారుల రాకపోకలకు అవాంతరంగా మారాయి. ఈ నేపథ్యంలో బిల్ట్‌ ఓన్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌(బీఓఓటీ) ప్రాతిపదికన కియో‌స్క్‌లు ఏర్పాటు చేయాలనుకున్నారు. మూడేళ్లు కాలవ్యవధిగా నిర్ణయించారు. కియో‌స్క్‌ల్లో గ్లాస్‌, లీటర్‌ చొప్పున నీటిని ఎంతకు విక్రయించాలి అన్నదీ స్పష్టంగా పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ గుర్తించిన ప్రాంతాల్లో ఎంపికైన ఏజెన్సీ కియో్‌స్కలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


నిబంధనలివి.. కారణమేంటి? 

బీఎస్ఐ నిబంధనల ప్రకారం నీటి నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 5000 - 10000 లీటర్ల సామర్థ్యంతో, 300 చదరపు అడుగుల విస్తీర్ణం మించకుండా సొంత ఖర్చులతో కియోస్క్‌ ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ చార్జీలు, అనుమతి (ట్రేడ్‌ లైసెన్స్‌), స్పేస్‌ లీజు రెంట్‌, ఇతరత్రా ఖర్చులు ఎంపికైన ఏజెన్సీలు భరించాలని నిబంధన పెట్టారు. నీటిని వాటర్‌బోర్డు, బోర్‌ వాటర్‌ (Boar Water) ద్వారా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. కియో‌స్క్‌పై ఏజెన్సీ పేరు కనిపించేలా ప్రకటన ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి సంబంధించి ప్రకటనల రుసుము జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రకటనపై జీహెచ్‌ఎంసీ (GHMC) లోగో కూడా ఉండాలని నిబంధనల్లో పొందుపర్చారు. నీటి విక్రయానికి సంబంధించి పరిమాణాన్ని బట్టి ఎంత ధరకు విక్రయించాలని నిర్ణయించారు. 


గ్లాస్‌ వాటర్‌ రూ.1, లీటర్‌ రూ.2, పది లీటర్ల నీటికి రూ.5, 20 లీటర్లకు రూ.10గా నిర్ణయించారు. ఈ వివరాలు కియో‌స్క్‌పై మూడు భాషల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు. నీటి విక్రయం, ప్రకటనలే ఎంపికైన ఏజెన్సీలకు ఆదాయ మార్గం. దీంతో కియోస్క్‌ల ఏర్పాటుకు ఏ ఏజెన్సీ ముందుకు రాలేదు. గతంలో కాయిన్‌ సిస్టమ్‌ ద్వారా నీటి అమ్మకానికి చేసిన ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో.. ఇప్పుడూ ఎవరూ ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా వేసవిలో వాటర్‌ కియో‌స్క్‌లు ఏర్పాటు చేయాలనుకుంటే జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించాలి. కానీ, అధికారులు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయలేదు. తీరా వేసవి మొదలైన అనంతరం బిడ్‌లు ఆహ్వానించగా ఏజెన్సీలు ముందుకు రాలేదు.

Updated Date - 2022-05-19T15:28:39+05:30 IST