జోన్లవారీగా జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2021-03-07T14:07:14+05:30 IST

పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు దిశగా కసరత్తు మొదలైంది...

జోన్లవారీగా జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : తక్షణ అనుమతులపై పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు దిశగా కసరత్తు మొదలైంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జోన్లవారీగా టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. కొత్త నిబంధనల ప్రకారం 500 చదరపు గజాల వరకు భవన నిర్మాణాలకు ఇన్‌స్టంట్‌ పర్మిషన్‌ పొందే అవకాశముంది. 75 చదరపు గజాల వరకు అనుమతి అవసరం లేదు. అయితే, పట్టణ ప్రణాళికా విభాగం నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. సెట్‌ బ్యాక్‌లు వదలడంతోపాటు స్థలవిస్తీర్ణం ప్రకారం భవనం ఎత్తు నిర్ణీత స్థాయిని మించకూడదు. తక్షణ అనుమతులు పొందిన భవనాలకు సంబంధించి దరఖాస్తు చేసిన 14 పనిదినాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్మాణ పనులు మొదలు పెట్టాలి.


అయితే.. ఇవన్నీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా..? లేదా..? అన్నది పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. జోన్ల వారీగా ఏర్పాటు చేసే బృందాలకు జోనల్‌ స్థాయిలో జోన్‌ కమిషనర్‌ నేతృత్వం వహిస్తారు. సంస్థలోని వివిధ విభాగాల అధికారులు బృందంలో సభ్యులుగా ఉంటారు. కేంద్ర కార్యాలయ స్థాయిలోనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ బృందాలకు ప్రత్యేకంగా ఒక జోన్‌ కేటాయించకుండా, ఒక్కో రోజు ఒక్కో జోన్‌కు పంపుతారు. దీంతో తనిఖీలు సక్రమంగా జరిగే అవకాశముందని చెబుతున్నారు. గ్రేటర్‌లోని ఆరు జోన్లున్నాయి. ఆరు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో దీనికి సంబంధించి కమిషనర్‌ అధికారిక ఆదేశాలు జారీ చేసే అవకాశముందని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-03-07T14:07:14+05:30 IST