సోలార్‌.. సక్సెస్‌

ABN , First Publish Date - 2021-12-01T17:10:51+05:30 IST

ఆర్థిక భారం తగ్గించుకునేలా జీహెచ్‌ఎంసీ చేసిన ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. సంప్రదాయ విద్యుత్‌ స్థానంలో సోలార్‌ వెలుగులు అద్దేందుకు తీసుకున్న నిర్ణయంతో సంస్థకు ఆదా

సోలార్‌.. సక్సెస్‌

జీహెచ్‌ఎంసీ భవనాలపై ఏర్పాటు

34 చోట్ల ప్యానెళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఆర్థిక భారం తగ్గించుకునేలా జీహెచ్‌ఎంసీ చేసిన ప్రయోగం సత్ఫలితాలనిస్తోంది. సంప్రదాయ విద్యుత్‌ స్థానంలో సోలార్‌ వెలుగులు అద్దేందుకు తీసుకున్న నిర్ణయంతో సంస్థకు ఆదా అవుతోంది. జోనల్‌, సర్కిల్‌, వార్డు ఇతరత్రా కార్యాలయాల భవనాలపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 34 భవనాలపై గ్రిడ్‌ రూఫ్‌ టాప్‌ సిస్టమ్‌ ద్వారా నెట్‌ మీటరింగ్‌ పద్ధతిలో విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. కార్యాలయాల అవసరాలకు సరిపడా విద్యుత్‌ వినియోగం పోను మిగతాది గ్రిడ్‌కు వెళ్లేలా నెట్‌ మీటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన, వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (టీఎస్‌ రెడ్కో)తో రూ.3.50 కోట్లకు కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఐదేళ్ల వరకు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. అందుబాటులో ఉన్న సోలార్‌ ప్యానెళ్లతో ఏటా 14,11,500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగాలి. సంవత్సరంలో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే సంతృప్తికర స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోందని, వర్షాకాలం, శీతాకాలం కలుపుకొని నాలుగు నెలలపాటు ఉత్పత్తి పూర్తిస్థాయిలో ఉండదని అధికారులు చెబుతున్నారు. అవసరం కంటే ఎక్కువగా ఉత్పత్తి అయి గ్రిడ్‌కు చేరే విద్యుత్‌ను తక్కువ ఉత్పత్తి జరిగిన సమయంలో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు.

Updated Date - 2021-12-01T17:10:51+05:30 IST