జీహెచ్‌ఎంసీ సహాయ నిరాకరణ!

ABN , First Publish Date - 2022-07-03T09:13:25+05:30 IST

టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రాజకీయ వైషమ్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

జీహెచ్‌ఎంసీ సహాయ నిరాకరణ!


  • ప్రధాని సభకు కనీస ఏర్పాట్లు చేయని బల్దియా..
  •  బీజేపీ నేతల వినతులను పట్టించుకోని వైనం


సికింద్రాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రాజకీయ వైషమ్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇంత వరకు రాజకీయాల్లో భాగమే అయినా.. సాక్షాత్తూ దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరవుతున్న పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగ సభ ఏర్పాట్లకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం ఏ మాత్రం సహకరించలేదు! ఇప్పుడీ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజకీ య పార్టీ సభ అయినప్పటికీ, ప్రధాని హాజరవుతున్నా పట్టించుకోకపోడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే తరహా బహిరంగ సభలు నిర్వహించినప్పుడు వ్యవహరించినట్లుగానే ఇప్పుడూ వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరేడ్‌గ్రౌండ్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ఉంది. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ మొదలు అన్ని పనులూ కంటోన్మెంట్‌ బోర్డే చేపట్టాల్సి ఉంటుంది. కానీ, గతంలో జరిగిన ఎన్నో సభలు, సమావేశాల ఏర్పాట్లకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహకరించింది. పరేడ్‌గ్రౌండ్‌కు వెళ్లే మార్గాలను శుభ్రం చేయ డం, చెట్ల కొమ్మలు నరకడం, మురుగునీటి లీకేజీలు అరికట్టడం, డివైడర్లకు రంగులు వేయడం, మైదానాన్ని ముస్తాబు చేయడం.. ఇలా ఎన్నో పనులు జీహెచ్‌ఎంసీ చేసింది. ప్రస్తుతం ప్రధాని మోదీ బహిరంగ సభ విషయంలో జీహెచ్‌ఎంసీ వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.  కంటోన్మెంట్‌ బోర్డు యంత్రాంగం అంతా తానై పనులు పూర్తి చేసింది.


విన్నపాలను తోసిపుచ్చిన జీహెచ్‌ఎంసీ

పరేడ్‌గ్రౌండ్‌ వర్షానికి చిత్తడిగా మారే అవకాశం ఉన్నందున తమకు సహకరించాలని బీజేపీ నాయకత్వం, కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు జీహెచ్‌ఎంసీకి విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభ సన్నాహక సమావేశాల తొలి రోజు నుంచే జీహెచ్‌ఎంసీకి పలు అభ్యర్థనలు పంపారు. సన్నాహక సమావేశాలకు హాజరైన జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులకు నేరుగా విజ్ఞప్తి చేశారు. ఆయా పనుల కోసం ఖర్చయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని బీజేపీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. అయినా జీహెచ్‌ఎంసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. బేగంపేట విమానాశ్రయం చుట్టుపక్కల వీధి కుక్కలను పట్టుకునేందుకు డాగ్‌ వ్యాన్‌ను కూడా పంపకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీంతో అన్ని పనులనూ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు యంత్రాంగమే చేయక తప్పలేదు. కంటోన్మెంట్‌ బోర్డు చరిత్రలో తొలిసారిగా బైసన్‌పోలో గ్రౌండ్‌లో బోర్డు యంత్రాంగం ప్రవేశించింది. ఇక్కడ సాధారణంగా అన్ని ఏర్పాట్లు మిలిటరీనే చూసుకుంటుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంటోన్మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు. మైదానాన్ని చదను చేయడం, వర్షపునీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం తదితర పనులు చేపట్టారు. మరోవైపు.. సభ నర్వహించే పరేడ్‌గ్రౌండ్‌లో వర్షపునీరు నిలుస్తోంది. దీనివల్ల పార్కింగ్‌ స్థలం మొదలు అనేక చోట్ల గుంతలమయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి అజిత్‌రెడ్డి ఆదేశాల మేరకు బోర్డు అధికారులు సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సర్‌ 50 లోడ్ల వరకూ తీసుకొచ్చి, ఆయా పాయింట్లలో నింపేశారు. ఇక భద్రతా బలగాలు పరేడ్‌ గ్రౌండ్‌ను తమ అధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నాయి. గ్రౌండ్‌ చుట్టూ నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. 


బహిరంగ సభకు 953 ఆర్టీసీ బస్సులు

బీజేపీ బహిరంగ సభకు గ్రేటర్‌ జోన్‌లో 953 ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నేతలు ఈ బస్సులను బుక్‌ చేశారు. గ్రేటర్‌ జోన్‌లోని 28 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే బస్సులు కేటాయించవద్దని కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరిగింది. 


కొలువు తీరిన పీఎంవో

ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో పరేడ్‌గ్రౌండ్‌లో ప్రధాని కార్యాలయం కొలువుదీరింది. మోదీ ఆసీనులయ్యే వేదిక కింది భాగంలో గుడారం నమూనాలో పీఎంవోను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి పీఎంవోలోని కొందరు అధికారులు ఈ ఆఫీసుకు తరలివచ్చారు. 

Updated Date - 2022-07-03T09:13:25+05:30 IST