GHMC మరో ముందడుగు.. చెత్త నుంచి బయో గ్యాస్

ABN , First Publish Date - 2022-05-24T19:23:11+05:30 IST

వ్యర్థాలకు సరికొత్త అర్ధాన్నిచ్చే దిశగా జీహెచ్‌ఎంసీ మరో అడుగు వేస్తోంది. చెత్త నుంచి బయో గ్యాస్‌ (Bio-Gas) ఉత్పత్తికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

GHMC మరో ముందడుగు.. చెత్త నుంచి బయో గ్యాస్

  • ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం
  • ఖైత్లాపూర్‌లో 20 టన్నుల సామర్థ్యంతో ప్రతిపాదన
  • సీఎస్ఆర్‌లో భాగంగా ముందుకు వచ్చిన హెచ్‌ఏఎల్‌  
  • రూ.4 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం
  • గతంలో దీప్తిశ్రీనగర్‌లో ప్రయోగం విఫలం

హైదరాబాద్‌ సిటీ : వ్యర్థాలకు సరికొత్త అర్ధాన్నిచ్చే దిశగా జీహెచ్‌ఎంసీ మరో అడుగు వేస్తోంది. చెత్త నుంచి బయో గ్యాస్‌ (Bio-Gas) ఉత్పత్తికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్‌)లో భాగంగా గ్రేటర్‌లోని ఖైత్లాపూర్‌ చెత్త రవాణా కేంద్రంలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌(సీబీజీ) విధానంలో బయో వ్యర్థాల నుంచి గ్యాస్‌ తయారు చేయనున్నారు. ఇందుకు అవసరమైన రూ.4 కోట్ల వ్యయాన్ని సీఎస్ఆర్‌లో భాగంగా ఇచ్చేందుకు బాలానగర్‌లోని హైదరాబాద్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ముందుకు వచ్చింది. 2022-23లో రూ.3 కోట్లు, 2023-24లో రూ.కోటి హెచ్‌ఏఎల్‌ ఇవ్వనుంది. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రేపటి స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం పొందితే నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని కూకట్‌పల్లికి చెందిన ఓ అధికారి చెప్పారు.


బయో మిథనైజేషన్‌తో..

బయో మిథనైజేషన్‌లో భాగంగా ఆహార వ్యర్థాల నుంచి గ్యాస్‌ తయారు చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసే ప్లాంట్‌లో బఫర్‌ ట్యాంక్‌, డైజెస్టర్‌, డీ గ్యాసర్‌ టవర్‌, గ్యాస్‌ హోల్డర్‌, గ్యాస్‌ బ్లోయర్‌ వంటి పరికరాలు ఉంటాయి. ఇక్కడ తయారైన గ్యాస్‌ను వంట సిలిండర్ల ఫిల్లింగ్‌ లేదా వాహనాల సీఎన్‌జీగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. చెత్త సేకరిస్తున్న ఆటో ట్రాలీలకు ఈ గ్యాస్‌ను ఉచితంగా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మిథనైజేషన్‌ ప్రక్రియ అనంతరం వచ్చే వ్యర్థాలతో సేంద్రియ ఎరువులూ తయారవుతాయి. ఈ ఎరువును నర్సరీలకు, పౌరులకు, రైతులకు ఉచితంగా ఇవ్వనున్నారు.


20 టన్నుల సామర్థ్యం..

ఖైత్లాపూర్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు నిత్యం 200-300 మెట్రిక్‌ టన్నుల బయో వ్యర్థాలు వస్తున్నాయి. ఈ మేరకు 20 టన్నుల సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనలను అధికారులు స్టాండింగ్‌ కమిటీ ముందుంచారు. 


సీఎన్‌జీ లేని ట్రాలీలు..

గ్రేటర్‌లో ప్రస్తుతం చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఏ వాహనానికీ సీఎన్‌జీ లేదు. ఖైత్లాపూర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే గ్యాస్‌ వినియోగించాలంటే ముందు వాహనాలను తదనుగుణంగా మార్చాలి. సీఎన్‌జీ ఏర్పాటుకు ఒక్కో వాహనానికి రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత మొత్తం ఖర్చు చేసి చెత్త సేకరణ కార్మికులు సీఎన్‌జీ ఏర్పాటు చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. సీఎస్ఆర్‌లో భాగంగా మూడేళ్ల క్రితం దీప్తిశ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన బయో గ్యాస్‌ ప్లాంట్‌ ప్రయోగం నిర్వహణ లోపంతో విఫలమైంది.

Updated Date - 2022-05-24T19:23:11+05:30 IST