భెల్‌ వర్సెస్‌ ఎంఐజీ కాలనీ సొసైటీ

ABN , First Publish Date - 2022-05-18T16:57:49+05:30 IST

బీహెచ్‌ఈఎల్‌ యాజమాన్యం, భెల్‌ ఎంఐజీ కాలనీ ఫేజ్‌ - 1 సొసైటీ మధ్య మిగులు స్థలాల విషయంలో నెలకొన్న వివాదం మంగళవారం

భెల్‌ వర్సెస్‌ ఎంఐజీ కాలనీ సొసైటీ

తారాస్థాయికి చేరిన స్థల వివాదం

పార్కు స్థలంలో భెల్‌ యాజమాన్యం బోర్డు

తొలగించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది


హైదరాబాద్/భెల్‌కాలనీ: బీహెచ్‌ఈఎల్‌ యాజమాన్యం, భెల్‌ ఎంఐజీ కాలనీ ఫేజ్‌ - 1 సొసైటీ మధ్య మిగులు స్థలాల విషయంలో నెలకొన్న వివాదం మంగళవారం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రక్షణ చర్యల పేరిట ఎంఐజీకాలనీలోకి ప్రవేశించే నాలుగు ప్రధాన రహదారుల్లో రెండింటిని శాశ్వతంగా మూసివేసి, రోడ్లపైనే మొక్కలు నాటిన యాజమాన్యం మరో రెండు గేట్లను రాత్రి వేళ్లలో, సెలవు దినాల్లో మూసేస్తోంది. 35 ఏళ్ళ క్రితం భెల్‌ కాలనీ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) 200 ఎకరాలు కేటాయించింది. దాంట్లోని 207.75 ఎకరాల్లో నిర్మాణాలు ఏర్పడ్డాయి. మిగిలిన 7.75 ఎకరాల స్థలం విషయంలో కాలనీ సొసైటీ, భెల్‌ యాజమాన్యం మధ్య వివాదం కొనసాగుతోంది. అందులోని పార్కు స్థలం భెల్‌ యాజమాన్యానిదని పేర్కొంటూ మంగళవారం బోర్డులు పాతారు.


ఈ విషయంలో యాజమాన్యం, సొసైటీ సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్‌ సింఽధూ ఆదర్శ్‌రెడ్డి ఘటనాస్థలికి వచ్చేలోపు భెల్‌ అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సొసైటీ అధ్యక్షుడు బాలయ్య, కోశాధికారి సత్యనారాయణ ఇతర సభ్యులు పార్కు వద్దకు చేరుకుని బోర్డును తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. వారి వినతి మేరకు బోర్డులు తొలగించాలని ఎమ్మెల్యే జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి భెల్‌ యాజమాన్యం అడుగడుగునా ఇబ్బందులకు గురి చేయడం శోచనీయమని కార్పొరేటర్‌ సింధూ ఆదర్శ్‌రెడ్డి అన్నారు. 


యాజమాన్యంతో మాట్లాడతా : ఎమ్మెల్యే గాంధీ

భెల్‌ యాజమాన్యం కార్మిక, కాలనీవాసుల సంక్షేమాన్ని మరిచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సొసైటీ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక పక్క సొసైటీతో చర్చలు జరుపుతూ మరోపక్క అడ్డంకులు సృష్టిస్తోంది. కాలనీలోనే థీం పార్కు నిర్మాణం జరుగుతున్న తరుణంలో బోర్డులను పాతి, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోంది. కార్పొరేట్‌ యాజమాన్యంతో చర్చించి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తా.

నిబంధనల ప్రకారమే : ఎస్టేట్‌ అధికారులు

ఎంఐజీ కాలనీలో మిగులు స్థలాల విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఎస్టేట్‌ అధికారులు తెలిపారు. కార్పొరేట్‌ యాజమాన్యం ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని అన్నారు. 

Updated Date - 2022-05-18T16:57:49+05:30 IST