అదే అలసత్వం...

ABN , First Publish Date - 2022-04-16T17:22:51+05:30 IST

అత్యవసర పనుల విషయంలోనూ జీహెచ్‌ఎంసీ అదే అలసత్వం చూపుతోంది. దీంతో మహా నగరానికి మరోసారి ముంపు ముప్పు తప్పేలా

అదే అలసత్వం...

చెరువుల మరమ్మతు.. బలోపేతం పనుల్లో తీవ్ర జాప్యం

గత నెలలో టెండర్‌ నోటిఫికేషన్‌ 

ఇప్పటికీ ప్రారంభం కాని పనులు


హైదరాబాద్‌ సిటీ: అత్యవసర పనుల విషయంలోనూ జీహెచ్‌ఎంసీ అదే అలసత్వం చూపుతోంది. దీంతో మహా నగరానికి మరోసారి ముంపు ముప్పు తప్పేలా లేదు. గ్రేటర్‌లో వరద నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు బహుముఖ వ్యూహాలు అమలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. నాలాల విస్తరణ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, చెరువుల బలోపేతం, మరమ్మతు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 2020లో గ్రేటర్‌లో వందేళ్ల రికార్డు స్థాయి వర్షం కురవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణ, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగడంతో యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టాలని ఆ శాఖ మంత్రి కె. తారక రామారావు గతంలో ఆదేశించారు. ఏడాదిన్నర అయినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా.. ఇప్పటికీ.. టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. 


ఇంజనీరింగ్‌ బృందాల నివేదిక

అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 185 చెరువులున్నాయి. వీటిలో మెజార్టీ చెరువులు ఆక్రమణలతో కుంచించుకు పోయాయి. చెరువుల్లోనే కాలనీలు, బస్తీలు రావడంతో భారీ వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఇన్‌లెట్‌లు, అవుట్‌ లెట్‌లు పాడవడం, తూములు మూసుకు పోవడం, అలుగులు ధ్వంసం కావడమే ముంపునకు ప్రధాన కారణమని గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన నీటి పారుదల, జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల బృందాలు గుర్తించాయి. గొలుసు కట్టుగా ఉండే చెరువుల మధ్య అనుసంధాన వ్యవస్థ తెగిపోవడంతో ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గిన చెరువుల్లో సామర్థ్యానికి మించి వరద నీరు నిలిచింది. దీంతో కొన్ని చెరువుల కట్టలు తెగాయి. అప్పా చెరువు బండ్‌ తెగి భారీగా వరద నీరు రావడంతో శంషాబాద్‌ వైపు రోడ్డు పూర్తిగా పాడైంది. ఆ మార్గంలో వెళ్తోన్న వాహనదారులు కొందరు గల్లంతయ్యారు. రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో కొన్ని చెరువులు పొంగిపొర్లాయి. దశాబ్దాలుగా నిర్వహణ విస్మరించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని గుర్తించిన బృందాలు కట్టల బలోపేతం, ఇన్‌లెట్‌లు, అవుట్‌లెట్‌లు, తూముల పునరుద్ధరణ, అలుగుల మరమ్మతు పనులు చేయాలని సూచించాయి. 


వర్షాకాలంలోపు కష్టమే?

ప్రాధాన్య క్రమంలో 61 చెరువుల నిర్వహణ, మరమ్మతు, పరిరక్షణ, మురుగు నీటి మళ్లింపు పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. రూ.95.54 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేసేందుకు గత నెలలో టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు 40 చెరువులకు సంబంధించి బిడ్‌లు దాఖలయ్యాయని, మరో 20 చెరువుల వద్ద పనులు చేసేందుకు ఏజెన్సీలు ఆసక్తి చూపడం లేదని ఓ అధికారి తెలిపారు. బిడ్‌లు దాఖలు చేసిన ఏజెన్సీలతో ఒప్పందాలూ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. ఈ నెలాఖరుకు పనులు ప్రారంభించినా.. జూన్‌ నాటికి పూర్తవడం అసాధ్యం. అసంపూర్తి పనులతో వర్షాకాలంలో కొత్త ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ ఉంది. చెరువుల బాధ్యతలు తరచూ ఒక అధికారి నుంచి మరో అధికారికి మారుతుండడం వల్లే టెండర్ల ప్రకటనలో జాప్యం జరిగిందని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గిన వెంటనే నవంబర్‌లో పనులు ప్రారంభిస్తే ఇప్పటికి తుది దశకు చేరేవని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2022-04-16T17:22:51+05:30 IST