పైసల ‘పరిహారం’

ABN , First Publish Date - 2022-04-11T17:49:15+05:30 IST

గ్రేటర్‌లో నాలుగైదేళ్లుగా కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు మొదలయ్యాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం

పైసల ‘పరిహారం’

ఆస్తులు కోల్పోయిన వారు ముట్టచెప్పాల్సిందే

జీహెచ్‌ఎంసీలో సేకరణ 

విభాగంలో ఇదో సంప్రదాయం

కొందరు అధికారుల తీరు వివాదాస్పదం

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే


జీహెచ్‌ఎంసీలోని ఆస్తుల సేకరణ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తులు కోల్పోయిన వారికి అండగా నిలవాల్సిన కొందరు అధికారులు వారి నుంచి అందినంత దండుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఏదో ఒక డాక్యుమెంట్‌ లేదని సాకు చెబుతూ.. బాధితులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో నాలుగైదేళ్లుగా కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు మొదలయ్యాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ ఆర్‌డీపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఎన్‌డీపీ), మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల నిర్మాణం వంటివి జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల కోసం పలు ప్రాంతాల్లో ఆస్తులు సేకరిస్తున్నారు. ఆస్తుల సేకరణ విభాగం ఇళ్లు, ప్లాట్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లిస్తోంది. అనంతరం సేకరించిన ఆస్తులను పట్టణ ప్రణాళికా విభాగం కూల్చివేస్తోంది. అయితే, అధికారుల తీరుతో ఆస్తులు కోల్పోతున్న బాధితులు పరిహారం పొందడంలో చుక్కలు చూస్తున్నారు. 


తిప్పలు పెట్టి.. జేబులు నింపుకొని..

సేకరించిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి జీహెచ్‌ఎంసీ అధికారులు పరిహారం చెల్లిస్తుంటారు. ఆసక్తి చూపిన వారికి అభివృద్ధి బదలాయింపు హక్కు(టీడీఆర్‌) కల్పిస్తుండగా.. ఇతరులకు డబ్బులు ఇస్తున్నారు. సేకరణ చట్టం 2013 ప్రకారం సబ్‌ రిజిస్ర్టార్‌, నిర్మాణ విలువ ఆధారంగా పరిహారం నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు బాధితులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దారికి వస్తే ఓకే.. లేదంటే లింక్‌ డాక్యుమెంట్‌, పూర్వీకులు చనిపోతే వారి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబీకుల అభిప్రాయం అవసరమంటూ కొర్రీలు పెడుతున్నారు. బహదూర్‌పురలో ఓ ఆస్తికి సంబంధించిన పరిహారం కోసం యజమాని కుటుంబం దాదాపు ఎనిమిది నెలలు కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగింది. అన్నీ సక్రమంగా ఉన్నా, ఏదో ఒక కారణం చెబుతూ వెనక్కి పంపించారు. విషయం అర్థమైన వారు కొంత మొత్తం ముట్టచెప్పడంతో రెండు వారాల్లో వారి బ్యాంకు ఖాతాలో పరిహారం జమయింది. ఉప్పల్‌లో ఓ ఆస్తికి సంబంధించిన పరిహారంలోనూ ఇదే జరిగింది. తిరిగి తిరిగి వేసారిన ఓ వ్యక్తి.. ప్రైవేట్‌గా అధికారిని కలవడంతో పని పూర్తయింది. రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన అధికారులతోపాటు, జీహెచ్‌ఎంసీలోని కొందరు ఈ తతంగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 


  ఇష్టారాజ్యం..

అంబర్‌పేటలో ఓ నిర్మాణానికి పరిహారం చెల్లింపు వివాదాస్పదంగా మారిం ది. యాజమాన్యపు హక్కు వివాదం నేపథ్యంలో ఇప్పటికీ స్థల సేకరణ జరగలేదు. దీంతో ఛే నెంబర్‌ నుంచి ఇరానీ హోటల్‌ సమీపం వరకు వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. పిల్లర్లు వేసినా.. స్థల సేకరణ జరుగకపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శేరిలింగంపల్లి జోన్‌లో ఓ ఆస్తి సేకరణ పరిహారం నిర్ధారణలో భారీ మొత్తం చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మాణ విలువను అమాం తం పెంచి పరిహారం చెల్లించినట్టు సమాచారం. ఆస్తుల యజమానులతో సంప్రదింపుల పేరిట కొందరు అధికారులు తమ వాటా మాట్లాడుకొని పరిహారం పెంచుతున్నారు. సేకరణ విభాగంలో ఏం జరుగుతోందన్నది జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం.. విభాగాధిపతిగా పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం, తర చూ బదిలీలు జరుగుతుండడంతో కింది స్థాయి ఉద్యోగులు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా పరిస్థితి మారింది. 

Updated Date - 2022-04-11T17:49:15+05:30 IST