మీకు సిగ్గు, శరం లేదా?: మేయర్ విజయలక్ష్మి

ABN , First Publish Date - 2021-11-23T23:43:54+05:30 IST

జీహెచ్ఎంసీ ఆఫీస్‌పై బీజేపీ దాడి ఘటనపై నగర మేయర్ ఘాటుగా

మీకు సిగ్గు, శరం లేదా?: మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆఫీస్‌పై బీజేపీ దాడి ఘటనపై నగర మేయర్ ఘాటుగా స్పందించారు. " మీకు మీ అధిష్టానం చెప్పినా.. ఇలాంటిది చేయడానికి మీకు సిగ్గు, శరం లేదా?" అని బీజేపీ నాయకులను మేయర్ నిలదీశారు. జీహెచ్ఎంసీ ఆఫీస్‌పై బీజేపీ శ్రేణుల దాడిని ఖండించారు. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేసింది పబ్లిక్ ప్రాపర్టీ కాదా అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ మేయర్‌లా కాకుండా కార్పొరేటర్లు అందరిని కలుపుకొని వెళ్తున్నానని ఆమె పేర్కొన్నారు. మీకు మీరే చేసారా లేక మీ అధిష్టానం ఆదేశాలతో బల్దియా ఆఫీస్‌పై దాడి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాల టైంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రాంతాల్లో కూడా తాము పర్యటించామన్నారు.


జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం అని అనుకున్నామని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, ఒక ఎడ్యుకేటెడ్ ప్రజాప్రతినిధులుగా మీకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. నిరసన పేరుతో విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మాకు చేత కాక కాదన్నారు. మా కార్పొరేటర్లు కూడా ఈ ఘటనపై కాల్స్ చేస్తున్నారన్నారు. గ్రేటర్‌లో అభివృద్ధి పనులు మీకు కనపడటం లేదా అని ఆమె నిలదీశారు. నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని, ఇవి ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు. విధ్వంసం దేనికి చేశారు, ఎవరు చెప్తే చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  


తాను కార్పొరేటర్ అనుభవం నుంచి మేయర్‌గా వచ్చానన్నారు. తనకు కార్పొరేటర్ల బాధ్యత తెలుసన్నారు. గ్రేటర్ కార్పొరేటర్లుగా ఉండి జీహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే కొట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. దాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన కార్పొరేటర్లు ఇలా ధ్వంసం చేస్తారని అనుకుంటామా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 



బీజేపీ మెరుపు ధర్నాతో బల్దియా కార్యాలయంలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా బీజేపీ కార్యకర్తలు పూల కుండీలను పగలగొట్టారు. మేయర్ ఛాంబర్‌లో భైఠాయించి ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు టేబుల్ విరగొట్టారు. వారంతా ఛాంబర్‌లోకి దూసుకెళ్లినా పోలీసులు అడ్డుకోలేకపోయారు. గ్రేటర్ కార్యాలయం అంతా పూల కుండీల మట్టితో నిండిపోయింది. మేయర్ ఛాంబర్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. బల్దియా ఆఫీస్‌లో మేయర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టర్లు అంటించారు. జీహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే కొట్టి నిరసన తెలిపారు.


మేయర్, కమిషనర్ ఛాంబర్‌ల వద్ద కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తలుపులు తోసుకుంటూ దూసుకెళ్లారు.  మెరుపు ధర్నాను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. జనరల్ బాడీ మీటింగ్, గ్రేటర్‌కు నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. 

Updated Date - 2021-11-23T23:43:54+05:30 IST