Abn logo
Jul 23 2021 @ 00:59AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి

 రామంతాపూర్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇరిగేషన్‌ విద్యుత్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి ఆదేశించారు. గురువారం రామంతాపూర్‌ పెద్ద చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ రజనీ, అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌ నరే్‌షరెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన  మాట్లాడారు. ఎంటమాలజీ అధికారులు చెరువులు, నాలాలు, కుంటలలో దోమల లార్వాలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు చెరువుల పరిసర కాలనీలు, లోతట్టు ప్రాంతాలకు చేరకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పెద్ద చెరువులోకి చేరిన వరద నీటిని ఎఫ్‌టీఎల్‌ పరిధి మేరకు అధికారులు తొలగిస్తున్న క్రమంలో పరిసర కాలనీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గరికె సుధాకర్‌, ఆకుల సుధాకర్‌, నందికంటి శివ, జేసీబీ రాజు, సాయి, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.