చేతులెత్తేస్తున్న GHMC.. కీలక బాధ్యతలు రాంకీకి.. ఏటా రూ.444 కోట్లు..!

ABN , First Publish Date - 2022-06-10T15:19:34+05:30 IST

గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణపై జీహెచ్‌ఎంసీ చేతులెత్తేస్తోంది. క్రమేణా ప్రైవేట్‌ పరం చేస్తోంది..

చేతులెత్తేస్తున్న GHMC.. కీలక బాధ్యతలు రాంకీకి.. ఏటా రూ.444 కోట్లు..!

  • శానిటేషన్‌పై హ్యాండ్సప్‌
  • పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్‌ పరం
  • రవాణా, శాస్త్రీయ నిల్వ వంటి కీలక బాధ్యతలు రాంకీకి
  • ఇంటింటి చెత్త సేకరణకే జీహెచ్‌ఎంసీ పరిమితం
  • మున్ముందు ఈ బాధ్యతల నుంచీ తప్పుకునే అవకాశం
  • ఉన్నతస్థాయి ఆదేశాలతోనే..

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణపై జీహెచ్‌ఎంసీ చేతులెత్తేస్తోంది. క్రమేణా ప్రైవేట్‌ పరం చేస్తోంది. గతంలోనే శాస్ర్తీయ నిల్వ, నిర్వహణ, డంపింగ్‌ యార్డుకు చెత్త తరలింపు అప్పగించగా.. సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌ బాధ్యతల నుంచీ జీహెచ్‌ఎంసీ తప్పు కుంటోంది. మెజార్టీ సర్కిళ్లలో రోడ్లపై వ్యర్థాలు, నివాసేతర సంస్థలు, సముదాయాల నుంచి చెత్త తరలింపు బాధ్యతలు రాంకీకి అప్పగిస్తూ తాజాగా బల్దియా నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చెత్త రవాణాను పర్యవేక్షిస్తున్నారు. మున్ముందు ఇంటింటి చెత్త సేకరణా అప్పగించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్‌ సంస్థకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నతస్థాయి ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మెరుగైన సమగ్ర వ్యర్థాల నిర్వహణ పేరిట రాంకీకి పూర్తిగా పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఏటా ఆ సంస్థకు సుమారు రూ. 444 కోట్లు జీహెచ్‌ఎంసీ చెల్లించనుంది. 


90 శాతం అమలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ది హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా రాంకీతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటింటి చెత్త సేకరణ, రవాణా, శాస్ర్తీయ నిల్వ, నిర్వహణ బాధ్యతలు 25 ఏళ్లపాటు ఆ సంస్థకు అప్పగించాలన్నది ఒప్పందంలోని సారాంశం. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ సదరు సంస్థకు టిప్పింగ్‌ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. 2009లో అగ్రిమెంట్‌ జరగగా, కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2012 నుంచి పరిమిత బాధ్యతలు అప్పగిస్తూ ఒప్పందాన్ని అమలు చేశారు. అయితే, తొలుత జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త శాస్ర్తీయ నిల్వ, నిర్వహణకు రాంకీని పరిమితం చేశారు. కేవలం నిల్వ, నిర్వహణ బాధ్యతలు మాత్రమే కట్టబెట్టిన నేపథ్యంలో నిర్ధారిత టిప్పింగ్‌ ఫీలో 40 శాతం చెల్లించాలని నిర్ణయించారు.


ఆ తర్వాత చెత్త రవాణా బాధ్యతలు ఆ సంస్థకు అప్పగించేందుకు అధికారులు పకడ్బందీ ప్రణాళిక అమలు చేశారు. జీహెచ్‌ఎంసీకి చెందిన కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయకుండా నాలుగేళ్ల క్రితం నుంచి అద్దె వాహనాల వినియోగం మొదలు పెట్టారు. దీంతో అంతకుముందుతో పోలిస్తే రవాణా వ్యయం 50 శాతం పెరిగింది. అనంతరం అద్దె వాహనాలను తగ్గిస్తూ.. రాంకీ ద్వారా క్లోజ్డ్‌ కంపాక్టర్‌లను తెరపైకి తీసుకొచ్చారు. తరలింపు సమయంలో రోడ్లపై చెత్త పడకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకే ఈ వాహనాలని పాలకవర్గంలోని కీలక నేతలు ప్రకటించారు. ప్రస్తుతం 10 ప్రధాన, 60 సెకండరీ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి 90 కంపాక్టర్‌, 50 సెకండరీ కలెక్షన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పాయింట్‌ మొబైల్‌ వాహనాల ద్వారా జవహర్‌నగర్‌కు చెత్త తరలిస్తున్నారు. ఇందుకు20శాతం టిప్పింగ్‌ ఫీ రవాణా చార్జీల కింద చెల్లిస్తున్నారు. వాహనాల కొనుగోలు వ్యయంలో జీహెచ్‌ఎంసీ 50 శాతం వాటాగా.. రూ.100 కోట్లు ఖర్చు చేసింది.


సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌ అంటే..?

రోడ్లపై కార్మికులు ఊడ్చే చెత్తతోపాటు హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల(స్వచ్ఛ ట్రాలీలు సేకరించని) నుంచి వెలువడే చెత్తను సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌లో భాగంగా రాంకీ తరలించనుంది. రోడ్లపై పౌరులు వేసే చెత్త కూడా ఆ సంస్థే తొలగించాలి. రెండు, మూడు వారాలుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తోన్న రాంకీ సిబ్బంది.. డివిజన్లవారీగా గార్బేజ్‌ పాయింట్ల వివరాలు సేకరించారు. పారిశుధ్య కార్మికులు రోడ్లు ఊడ్చిన చెత్త ఎక్కడ వేస్తున్నారు? ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్లు ఎక్కడున్నాయన్న వివరాలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని సర్కిళ్లలో రాంకీ వాహనాలు ఆయా ప్రాంతాల్లోని చెత్తను ట్రాన్స్‌ఫర్‌ స్టేషనకు తీసుకెళ్తున్నాయి. కొన్నిచోట్ల అద్దె వాహనాలను వినియోగిస్తుండగా.. త్వరలో వీటిని తొలగించే అవకాశముందని ఓ అధికారి చెప్పారు.


ఏటా రూ.444 కోట్లు చెల్లించనున్న జీహెచ్‌ఎంసీ

ఒప్పందం అమలు సమయంలో రూ. 1,200 పైచిలుకు ఉన్న టిప్పింగ్‌ ఫీ ప్రస్తుతం రూ.2,106కు పెరిగింది. అగ్రిమెంట్‌లో భాగంగా ప్రతియేటా నిర్ణీత శాతం టిప్పింగ్‌ ఫీ పెరుగుతుంది. ఈ క్రమంలో రూ.2,100 దాటిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం టిప్పింగ్‌ ఫీలో శాస్ర్తీయ నిల్వ, నిర్వహణకు 40 శాతం ప్రకారం రూ.842.49, రవాణా చార్జీల కింద 20 శాతంలో భాగంగా రూ.421.25 చొప్పున మెట్రిక్‌ టన్నుకు రూ.1,264 ప్రస్తుతం చెల్లిస్తున్నారు. నిత్యం సగటున 6,500 మెట్రిక్‌ టన్నుల చొప్పున వెలువడుతోన్న చెత్తకు.. నెలకు రూ.24.64 కోట్లు.. ఏడాదికి రూ.295 కోట్ల టిప్పింగ్‌ ఫీ రాంకీకి చెల్లిస్తున్నారు. ఈ నెల నుంచి సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌ బాధ్యతలు అప్పగించనున్న నేపథ్యంలో ఈ మొత్తం మరింత పెరగనుంది. సెకండరీ ట్రాన్స్‌పోర్టేషన్‌కు మొత్తం టిప్పింగ్‌ ఫీలో 30శాతం.. అంటే మెట్రిక్‌ టన్నుకు రూ.632 చొప్పున.. నెలకు రూ.12.32 కోట్లు, ఏడాదికి రూ.148 కోట్లు చెల్లించనున్నారు. జీహెచ్‌ఎంసీ తాజా నిర్ణయంతో రాంకీతో కుదుర్చుకున్న ఒప్పందం 90 శాతం అమలైనట్టవుతుంది. మొత్తంగా చెత్త నిర్వహణ, రవాణాకు సంబంధించి నెలకు రాంకీకి రూ.37 కోట్లు.. ఏడాదికి రూ.444 కోట్లు జీహెచ్‌ఎంసీ చెల్లించనుంది.

Updated Date - 2022-06-10T15:19:34+05:30 IST