జ్వరం ఉన్న హైదరాబాదీల్లో.. 25-30% మందికి కరోనా లక్షణాలు!

ABN , First Publish Date - 2021-05-07T10:15:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘ఫీవర్‌ సర్వే’ సత్ఫలితాలనిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో జ్వరంతో బాధపడుతున్న వారిలో 25-30% మందిలో కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు తొలి నాలుగు రోజుల్లోనే గుర్తించారు. నగరవ్యాప్తంగా ఏఎన్‌ఎంలు,

జ్వరం ఉన్న హైదరాబాదీల్లో.. 25-30% మందికి కరోనా లక్షణాలు!

జీహెచ్‌ఎంసీ ఫీవర్‌ సర్వేలో గుర్తింపు..

రంగంలోకి 700 ప్రత్యేక బృందాలు

1.50 లక్షలకుపైగా ఇళ్లలో పరీక్షలు సర్వే పూర్తి

నెలరోజుల్లో జీహెచ్‌ఎంసీలో అన్ని ఇళ్లు టార్గెట్‌

జ్వరం ఉన్న వారికి కరోనా మెడికల్‌ కిట్స్‌

లక్షణాలను బట్టి ఔషధాలు తీసుకోవాలని సూచన

ఇతర అనారోగ్య సమస్యలున్న వారిపై ప్రత్యేక దృష్టి

కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయాలంటూ ప్రచారం


హైదరాబాద్‌ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘ఫీవర్‌ సర్వే’ సత్ఫలితాలనిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో జ్వరంతో బాధపడుతున్న వారిలో 25-30% మందిలో కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు తొలి నాలుగు రోజుల్లోనే గుర్తించారు. నగరవ్యాప్తంగా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో కూడిన 700 ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేపడుతుండగా.. గడిచిన నాలుగు రోజుల్లో 1.50 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. ఇప్పటి వరకు మొత్తం 7 వేల మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించగా.. వారిలో కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వం ‘కొవిడ్‌ కిట్లు’ అందజేస్తోంది. బస్తీ, కాలనీ అన్న తేడా లేకుండా.. ఈ బృందాలు అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో 20 లక్షలకు పైగా ఇళ్లు ఉన్నాయి. అన్ని ఇళ్లను చుట్టిరావడానికి ఈ బృందాలకు 30 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు.


అవసరమైతే ఈ బృందాల సంఖ్యను మరింత పెంచుతామని చెబుతున్నారు. ప్రతి 500 ఇళ్లకు ఒక బృందాన్ని నియమించామని వివరించారు. ఈ బృందాలు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేపడుతూ.. జ్వరం వచ్చిన వారిని గుర్తిస్తున్నాయి. వారిలో 25-30ు మందికి కరోనా లక్షణాలు ఉంటున్నాయని, జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ ‘కొవిడ్‌ కిట్లు’ ఇస్తున్నామని అధికారులు చెప్పారు. ఆ కిట్లలో ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలనే వివరాలు ఉన్నాయని తెలిపారు. లాక్‌డౌన్‌ డిమాండ్‌లు వినిపిస్తున్న నేపథ్యంలో.. జ్వరం (ప్రధానంగా కరోనా లక్షణాలు) ఉన్న వారికి ఇళ్లలోనే చికిత్సను అందించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జ్వరం ఉన్న కొమార్బిటీస్‌ (ఒకటి కంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు) పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడం.. శ్వాస ఇబ్బందిగా ఉన్నవారిని వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. 


సర్వేలో సేకరిస్తున్న వివరాలివే..

  1. థర్మల్‌ స్ర్కీనింగ్‌తోపాటు.. ఇటీవల బయటకు వెళ్లారా? ఎక్కడికి? ఆ సమయంలో మాస్కు ధరించారా? అనే వివరాలు సేకరిస్తున్నారు
  2. జ్వరం వచ్చిన వారి మొబైల్‌ నంబర్లు తీసుకుని.. వారి పరిస్థితిని ఫోన్‌ద్వారా కనుక్కొంటున్నారు
  3. కరోనా లక్షణాలు ఉన్నవారిని.. కాంటాక్ట్‌లో ఎవరెవరున్నారు? వారి పరిస్థితి ఏమిటి? అనే వివరాలు తెలుసుకుంటున్నారు
  4. జీహెచ్‌ఎంసీ కొవిడ్‌ కంట్రోల్‌ రూం నంబరు 040- 21111111 నంబరుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు
  5. నగరంలోని 250 బస్తీ దవాఖానాల్లో కూడా కొవిడ్‌ ఔట్‌పేషెంట్‌ సేవలపై వివరిస్తున్నారు

Updated Date - 2021-05-07T10:15:21+05:30 IST