వెనక్కి తగ్గిన టీఆర్ఎస్ సర్కార్.. కారణమిదేనా..?

ABN , First Publish Date - 2020-10-21T17:49:18+05:30 IST

హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచనలో పడిందా? లేక ముందు చెప్పిన ప్రకారమే ముందుకు వెళుతుందా? టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలు పట్టించుకోలేదా? లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏకంగా కార్పొరేటర్ల మీద దాడికే

వెనక్కి తగ్గిన టీఆర్ఎస్ సర్కార్.. కారణమిదేనా..?

హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం ఆలోచనలో పడిందా? లేక ముందు చెప్పిన ప్రకారమే ముందుకు వెళుతుందా? టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలు పట్టించుకోలేదా? లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏకంగా కార్పొరేటర్ల మీద దాడికే దిగడం దేనికి సంకేతం? ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్‌కు ప్రజలు చేస్తోన్న ఫిర్యాదులేంటి? భారీ వర్షాల తర్వాత గులాబీ కార్పొరేటర్ల గుండెల్లో గుబులెందుకు రేగుతోంది?


కలవర పెడుతున్న వరదలు...

గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు అధికార టీఆర్ఎస్‌ పార్టీని కలవరపెడుతున్నాయి. ఫీల్ గుడ్ వెదర్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌కు వెళ్లాలని భావించిన గులాబీ దళానికి.. నగరాన్ని జలదిగ్బంధం చేసేలా కురిసిన వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ప్రజలు ఊహించని షాకులిస్తున్నారు. బీఎన్ రెడ్డి నగర్‌లో ముంపు బాధితులు మంత్రి కేటీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆయనతోపాటు వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నేరుగానే విమర్శలు చేశారు. మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వరదల్లో నిరసన సెగలు తగిలాయి. పడవలో పర్యటనకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని బాధిత మహిళలు మొహం మీదే కడిగేశారు. ఇక ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీదకు ఏకంగా చెప్పులు విసిరారు. కూకట్‌పల్లి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చేదు అనుభవమే ఎదురైంది.


ఎక్కడికక్కడ నిలదీతలు...

మంత్రులు వెళ్లిన చోటల్లా ప్రజలు స్థానిక కార్పొరేటర్లు ఎక్కడ అంటూ నిలదీయడం కనిపిస్తోంది. తమ సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. దందాలు తప్పా తమ సమస్యలను పరిష్కరించలేదని కొన్నిచోట్ల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కబ్జాలు, ఆక్రమణలను అడ్డుకోలేదనీ, నాలాల వెడల్పు, పూడికతీత వంటి సమస్యలు గాలికి వదిలేశారనీ, పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో చూపడం లేదనీ విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండి పరిష్కారం చూపకుండా పలకరింపులకు వస్తారా? అంటూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. హయత్ నగర్ కార్పొరేటర్ పై ముంపు భాదితులు ఏకంగా దాడికే దిగడం ప్రజల ఆగ్రహానికి అద్దం పడుతోంది. అక్కడ ఒక్కచోటే కాకుండా.. నగరంలో చాలాచోట్ల సిట్టింగ్ కార్పొరేటర్ల పట్ల ప్రజలు మండి పడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకుని తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజల వద్దకు వెళ్లాలంటేనే.. ఇప్పుడు పలువురు కార్పొరేటర్లు జంకుతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసే పనిలో పడిందట.


తెగ బాధపడిపోతున్నారట...

గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దించాల్సిన పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది టీఆర్ఎస్. సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తోంది. వాటి ఆధారంగా 15 శాతం కార్పొరేటర్ల పనితీరు సరిగా లేదంటూ కేటీఆర్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాక ఇన్‌ఛార్జీలను నియమించి వారి నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. మరోవైపు మంత్రులు కూడా తాము పర్యటిస్తున్న డివిజన్లలో సిట్టింగ్‌ల పనితీరుపై రిపోర్టులు తయారు చేస్తున్నారట. ఎక్కడైతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందో అక్కడ స్థానిక కార్పొరేటర్‌పై నెగిటివ్ రిపోర్ట్ తయారు చేసి పార్టీ పెద్దలకు ఇస్తున్నారట. అయితే అక్కడా- ఇక్కడా అని కాకుండా నగరంలో మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు అన్నిచోట్లా కార్పొరేటర్ల పై ప్రజలు ఆరోపణలు చేశారు. దాంతో ఎన్నికల ముంగిట వచ్చిన వరదలు తమ కొంప ముంచుతున్నాయని సిట్టింగ్‌లు తెగ బాధపడిపోతున్నారట. మరోమారు టిక్కెట్ దక్కకుండా చేసే ప్రమాదంలోకి నెట్టాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. 


పునరాలోచనలో ప్రభుత్వం...

మొత్తంమీద, గ్రేటర్ హైదరాబాద్‌లో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు తమ పట్ల గుర్రుగా ఉన్నారన్న స్పష్టతకు అధికార పార్టీ కార్పొరేటర్లు వచ్చారట. వరద పరిస్థితి మెరుగుపడిన తర్వాత ప్రజలను మళ్లీ తమ వైపునకు తిప్పుకోవాలని వారు భావిస్తున్నారని తెలిసింది. అందుకోసం ఎన్నికలను ఇప్పుడు అనుకుంటున్న షెడ్యూల్ కంటే కొంత వెనక్కి నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారట. మరోవైపు ప్రభుత్వం కూడా.. వరదల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఇన్‌ఛార్జీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-10-21T17:49:18+05:30 IST