‘క్లిక్‌ చేస్తే సమస్త సమాచారం వచ్చేస్తుంది..’

ABN , First Publish Date - 2020-11-22T16:44:15+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యచరణ రూపొందించామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు. శనివారం రాచకొండ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాచకొండ పరిధిలో మొత్తం 576 ప్రాంతాల్లో 1,637 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

‘క్లిక్‌ చేస్తే సమస్త సమాచారం వచ్చేస్తుంది..’

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యచరణ రూపొందించామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు. శనివారం రాచకొండ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాచకొండ పరిధిలో మొత్తం 576 ప్రాంతాల్లో 1,637 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో 512 కేంద్రాలు సమస్యాత్మకం కాగా, 53 కేంద్రాలు అత్యంత సమస్మాత్మకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్‌ భద్రత పెంచామన్నారు.


టెక్నాలజీకి పెద్దపీట..

రాచకొండ పరిధిలోని అన్ని పోలింగ్‌ లొకేషన్లను జియోట్యాగింగ్‌ చేసి గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వారి వద్ద ఉన్న ట్యాబ్‌లో ఏదైనా పోలింగ్‌ ప్రాంతంపై క్లిక్‌ చేసి, అక్కడి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంత మంది అధికారులు విధుల్లో ఉన్నారు. ఎంతమంది ఓటర్లు ఉన్నారు. పరిస్థితి ఎలా ఉంది. పాత నేరస్థులు ఎవరెవరు ఉన్నారు, సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అన్న సమాచారం తెలుసుకోవచ్చు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే అదనపు పోలీస్‌ బృందాలు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బంది దీనిని మానిటరింగ్‌ చేయనున్నట్లు సీపీ తెలిపారు. ఎక్కడైనా వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకే ప్రాంతంలో ఎదురుపడే అవకాశం ఉంటే ఐటీ మానిటరింగ్‌ సెల్‌ గుర్తించి అక్కడి పోలీసులను అలర్టు చేస్తుందన్నారు.


కట్టుదిట్టమైన భద్రత...

గ్రేటర్‌ ఎన్నికల్లో 8,000 మంది సివిల్‌, 2,000 మంది ఆర్మ్‌డ్‌ పోలీసులను వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, ఆరు స్టాటిక్‌ సర్వేలైన్స్‌, 29 డైనమిక్‌ చెక్‌ పోస్టులు, 90 పికెటింగ్‌ పాయింట్లతో 24/7 భద్రతను పర్యవేక్షస్తున్నామన్నారు. ఒక్కో సర్కిల్‌కు ఏసీపీ/ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌తో మార్చ్‌ఫ్లాగ్‌ నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు. ఎక్కడిక్కడ కెమెరా మౌంటెడ్‌ పోలీస్‌ వాహనాలతో భద్రత పర్యవేక్షిస్తామన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్టులో భాగంగా ఫిర్యాదు చేయాలంటే డయల్‌-100, వాట్సాప్‌ నంబర్‌ 94906 17444కు తెలియజేయాలన్నారు. హాక్‌ఐ అప్లికేషన్‌లో సిటిజన్‌ పోలీసింగ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌ డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T16:44:15+05:30 IST