GHMC ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాదైనా ‘ఫలిత’మేది..!?

ABN , First Publish Date - 2021-12-04T16:17:12+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సరిగ్గా యేడాది. ప్రభుత్వం...

GHMC ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాదైనా ‘ఫలిత’మేది..!?

  • పాలకమండలి కొలువుదీరినా అంతే..
  • తొమ్మిది నెలలైనా కౌన్సిల్‌ సమావేశమేది..?

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సరిగ్గా యేడాది. ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో పాలకమండలి మాత్రం మూడు నెలల తరువాత (ఫిబ్రవరి 11న) కొలువుదీరింది. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. తమకు ఎదురే లేదనుకున్న అధికార పార్టీ అంచనాలను తలకిందులు చేస్తు మహానగర వాసులు విలక్షణ తీర్పునిచ్చారు. 150 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ కేవలం 56 సీట్లకు పరిమితమైంది. 


2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో 99 డివిజన్లలో విజయం సాధించి రికార్డు సృష్టించిన అధికార పార్టీ బలం.. కిందటి సంవత్సరం సగానికి పడిపోయింది. అంతకుముందు తమ పార్టీకి ఉన్న 44 స్థానాలను ఎంఐఎం నిలుపుకోగా.. నాలుగు స్థానాలతో ఉన్న బీజేపీ అనూహ్యంగా 48చోట్ల విజయం సాధించింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓ డివిజన్‌ కోల్పోవడంతో కాషాయ కార్పొరేటర్ల సంఖ్య 47కు తగ్గింది. ఉప ఎన్నికలో గెలుపుతో కలుపుకొని కాంగ్రె‌స్‌కు మూడు స్థానాలు దక్కాయి. అభివృద్ధి, సంక్షేమం గట్టెక్కిస్తుందని భావించిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. అక్టోబర్‌లో భారీ వర్షాలతో నగరంలో బీభత్సం జరగడంతో రూ.10 వేల చొప్పున వరద సాయమూ ప్రకటించారు. అయినా ఎన్నికల్లో మాత్రం ఊహించని పరాజయం ఎదురైంది. ఇదంతా ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు.


సమావేశం లేదు.. సమస్యలపై చర్చ లేదు..

 ఎంఐఎం సాయంతో బల్దియా పీఠాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. నగరంలో మరిన్ని మంచిపనులు చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం లేదు. పాలకమండలి కొలువుదీరి తొమ్మిది నెలలైనా ఇప్పటి వరకు భౌతికంగా సాధారణ సమావేశం నిర్వహించలేదు. కొవిడ్‌ కారణంగా జూన్‌లో వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించిన మేయర్‌.. అనంతరం ఆ ఊసెత్తడం లేదు. ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. 


కార్పొరేటర్లకు ఇప్పటికీ బడ్జెట్‌ కూడా కేటాయించలేదు. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం ప్రతి మూడు నెలలకోమారు సాధారణ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా మేయర్‌ పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలకూ చెప్పుకోదగ్గ స్థాయిలో సంఖ్యాబలం ఉండడంతో ప్రజాసమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఆ భయంతోనే సమావేశాల నిర్వహణకు మేయర్‌ వెనక్కి తగ్గుతున్నారన్న ప్రచారమూ ఉంది. ఇదిలాఉంటే.. ఈ నెల 18వ తేదీన కౌన్సిల్‌ సమావేశం నిర్వహణకు ముహూుర్తం ఖరారు చేశారు.

Updated Date - 2021-12-04T16:17:12+05:30 IST