అభ్యర్థులూ.. ఈ నిబంధనలు పాటించండి..

ABN , First Publish Date - 2020-11-24T17:32:04+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.

అభ్యర్థులూ.. ఈ నిబంధనలు పాటించండి..

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో  అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను  కచ్చితంగా పాటించాల్సిందే.


నింబంధనలివే.. 

అభ్యర్థులు, పార్టీలు కుల, మత, భాష లేదా మరేతర విద్వేషాలను రెచ్చగొట్టకూడదు. ఆయా పార్టీల విధానాలపై, పనితీరుపై మాత్రమే విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్లకూడదు. కుల, మత ప్రాతిపదికపై ఓట్లు అడగకూడదు. గుళ్లు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు.  ఓటుకోసం డబ్బు ఇవ్వడం, ఓటు వేయమని బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును మరొకరు వేయడం చట్ట వ్యతిరేకం. సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా వారి భూమిని, భవనాలను ప్రచారానికి ఉపయోగించరాదు. విద్యాసంస్థలు, వారి మైదానాలను ప్రచారానికి వాడకూడదు. ఇతర పార్టీల ఎన్నికల ప్రచారాన్ని, సమావేశాలను అడ్డుకోరాదు.


ఎన్నికల సమావేశాలు..

సమావేశం నిర్వహించేందుకు ముందుగానే లిఖిత పూర్వకంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిషేధాజ్ఞలు/ఆంక్షలు ఉన్న ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించరాదు. సమావేశాలలో లౌడ్‌ స్పీకర్ల వినియోగించేందుకు ముందుగానే అనుమతి తీసుకోవాలి. సమావేశానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.


ర్యాలీలు...

ర్యాలీలు నిర్వహించే దారిని ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. నిషేధాజ్ఞలు అమలులోఉన్న దారుల్లో ర్యాలీలు నిర్వహించకూడదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ర్యాలీ  నిర్వహించాలి. ఎవరి దిష్టిబొమ్మలు తగులబెట్టకూడదు.


పోలింగ్‌ తేదీ రోజు..

ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులకు సహకరించాలి. ఎలక్షన్‌ స్లిప్పులపై, ఓటర్లు చిట్టిపై పార్టీ ఎన్నికల గుర్తు, అభ్యర్థి పేరు ఉండకూడదు. ఎన్నికల అధికారులు ధ్రువీకరించిన పాస్‌ లేకుండా పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించకూడదు. ఏవైనా ఫిర్యాదులుంటే ఎన్నికల పరిశీలకుడికి తెలియజేయాలి.


అధికారిక పర్యటనలొద్దు.. 

ఎన్నికల ప్రచారం, అధికారిక పర్యటనలు కలిపి చేయకూడదు. అధికార యంత్రాంగాన్ని వినియోగించకూడదు. ప్రభుత్వ వాహనాలనూ వినియోగించకూడదు. వాహనాలను ఇంటి నుంచి తమ కార్యాలయానికి మాత్రమే ఉపయోగించాలి. ఫైలెట్‌ కార్లు, ఎర్ర లైటు కార్లు ఉపయోగించకూడదు.  ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు అందరికీ ఇవ్వాలి. ప్రభుత్వ ఖర్చుతో మీడియాలో ప్రకటనలు ఇవ్వకూడదు. ఏ రకమైన గ్రాంటులు, చెల్లింపులను కొత్తగా విడుదల చేయరాదు. నూతన భవనాలకు, కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయరాదు. మంత్రులు పోలింగ్‌స్టేషన్లోకి ప్రవేశించకూడదు. అధికారులు, ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం ఉంటుంది. అధికార పార్టీ చేసిన పనులు గూర్చి తెలిపే ప్రభుత్వ ప్రచార హోర్డింగులు తీసివేయాలి. ఎంపీఎల్‌ఏడీఎస్‌ కింద నిధులు ఇవ్వకూడదు. కొత్త వాటికి ఆమోదం ఇవ్వకూడదు. ఇంతకు మునుపే మొదలైన పనులను కొనసాగించవచ్చు. పూర్తయిన పనులకు చెల్లింపులు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయక కార్యక్రమాలు చేపట్టవచ్చు. అధికారిక కార్యక్రమాలకు హాజరు కావచ్చు. కానీ, రాజకీయ ఉపన్యాసాలు చేయకూడదు. సందేహాలు, అనుమానాలు నివృత్తి కోసం చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారిని సంప్రదించాలి.


వాహనాలు..

ఎన్నికల ప్రచారానికి ఎన్ని వాహనాలైనా వాడుకోవచ్చు. రిటర్నింగ్‌ అధికారి వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒరిజినల్‌ అనుమతి పత్రాన్ని స్పష్టంగా కనబడేట్టు వాహనానికి అతికించాలి. పర్మిట్‌ మీద వాహన సంఖ్య, అభ్యర్థి వివరాలు ఉండాలి. ఆ వాహనాన్ని ఆ అభ్యర్థికి మాత్రమే వాడాలి. మరో అభ్యర్థికి ఉపయోగిస్తే ఐపీసీ-171హెచ్‌ సెక్షన్‌ కింద శిక్షార్హులు. మోటార్‌ వెహికల్‌ చట్టానికి లోబడి వాహనాలకు అదనపు హంగులు జత చేయవచ్చు.


ఇతర నిబంధనలు..

ఎన్నికల కరపత్రాలపై ముద్రణాలయాల పేరు, అడ్రసు విధిగా ఉండాలి. ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వవచ్చు. వీటిని ఎన్నికల ఖర్చుల్లో చూపించాలి. చీరలు, చొక్కాలు ఇవ్వకూడదు. దేవుళ్ల ఫోటోలు, అభ్యర్థి ఫోటోలతో డైరీలు, క్యాలెండర్లు ప్రచురించరాదు. వాహనాల స్టెపినీ కవర్లపై కూడా మత సంబంధిత ఫోటోలు, అభ్యర్థి ఫోటోలు ఉండడానికి వీలు లేదు. ప్రార్థనా స్థలాలకు, పాఠశాలలకు, పోలింగ్‌ స్టేషన్లకు 200 మీటర్లు లోపు అభ్యర్థి తాత్కాలిక కార్యాలయం ఉండకూడదు. ఆఫీసుపై తమ పార్టీ జెండాను, బ్యానర్‌ను, పార్టీ చిహ్నాన్ని పెట్టకోవచ్చు. ఎన్నికల ప్రచార తేదీ ముగిసిన తర్వాత ఓటర్లు కాని వారెవ్వరూ నియోజకవర్గంలో ఉండకూడదు. అభ్యర్థికి, ఎన్నికల ఏజెంట్‌కు ఇది వర్తించదు. రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 గంటల లోపు మైకులు, లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు. రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ సమావేశం ఏర్పాటు చేయరాదు. పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని పూర్తి చేయాలి. పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో పోలింగ్‌ ఏజంట్‌ ఓటరుగా నమోదై, ఫోటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. ఎన్‌ఎంఎ్‌సల ద్వారా అభ్యంతరకర వార్తలను ప్రచారం చేయరాదు. అలా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు వస్తే, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల బూత్‌ను పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 200 మీటర్ల దూరంలో పెట్టుకోవచ్చు. ఒక టేబుల్‌, రెండు కుర్చీలు, అభ్యర్థి పేరు, పార్టీ జెండాతో కూడిన ఒక బ్యానర్‌ను పెట్టుకోవచ్చు. పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 100 మీటర్ల లోపు ప్రచారం నిషేధం. ఈ పరిధిలో మొబైల్‌ ఫోన్‌ వాడకూడదు. ఆయుధాలతో తిరగకూడదు.  పోలింగ్‌ రోజు అభ్యర్థికి ఒక వాహనం, ఎన్నికల ఏజెంట్‌కు ఒక వాహనం, పార్టీ వర్కర్ల కోసం మరో వాహనాన్ని వాడవచ్చు. ఒక్కో వాహనంలో డ్రైవర్‌తో సహా ఐదుగురికన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఓటర్లను వాహనాల ద్వారా ఎన్నికల బూత్‌కు తీసుకురాకూడదు. అది చట్టరీత్యా నేరం.

Updated Date - 2020-11-24T17:32:04+05:30 IST