Abn logo
Nov 29 2020 @ 01:12AM

సాయంత్రం 5తో బంద్‌..!

ప్రచార హోరు.. నేడు ఆఖరు..!

ఇప్పటికే మొదలైన ప్రలోభ పర్వం

మరింత ముమ్మరం చేసేందుకు ప్రణాళిక

పకడ్బందీ పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి

ఆఖరి రోజు వీలైనంత ఎక్కువ మందిని కలిసేలా అభ్యర్థుల ప్లాన్‌


పది రోజులపాటు హోరెత్తిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మైకుల గోల.. బ్యాండు బాజాల దరువు.. ఇంటింటి ప్రచారం ఈ రోజు సాయంత్రంతో బంద్‌ అవుతాయి. ఇన్నాళ్లు కాళ్లకు బలపం కట్టుకొని తిరిగిన అభ్యర్థులు.. చివరి రోజు వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేలా, ఎక్కువ మందిని కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కుల, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలపై దృష్టి సారించారు. 


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి) : మరో 48 గంటల్లో భాగ్యనగర ప్రజలు ఓటు ద్వారా అభ్యర్థుల భవిష్యత్‌ను, గెలుపోటములను నిర్ణయించనున్నారు. డిసెంబర్‌ 1న జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.


ప్రచారంలో వేడిపెంచిన అభ్యర్థులు..

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగుస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ జిల్లాల నుంచి తమకు మద్దతుగా వచ్చిన నాయకులకు, స్థానిక కార్యకర్తలను కాలనీలు, బస్తీల వారీగా వేర్వేరుగా తిప్పుతున్నారు. కొందరైతే నగదు, చీరలు, వివిధ రకాల వస్తువులు, బహుమతులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థి తమ బ్యాంకు ఖాతాలు, తెలిసిన వారి నుంచి రూ.100, రూ.200, రూ.500, రూ.2000 వేల నోట్లను రూ.లక్షల్లో తెచ్చుకుని దగ్గర ఉంచుకున్నారు. డబ్బును బంధువులు, స్నేహితుల దగ్గర పెట్టి బూత్‌ల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులకు చిక్కకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో ఏరియాలో తమకు అనుకూల ఓటర్లకు రూ.1500 నుంచి రూ.2వేల నగదు ఇవ్వనుండగా, ఇతర ప్రాంతాల్లోని వారికి రూ.500 ఇస్తున్నట్లు తెలుస్తోంది.


అధినేతల పర్యటనలతో నూతనోత్సాహం..

గ్రేటర్‌లో రెండోసారి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌, గులాబీ పార్టీని ఓడించి గోల్కొండపై కాషాయ జెండాను ఎగురవేస్తామని బీజేపీ సవాల్‌ విసురుతున్నాయి. ఇదే క్రమంలో మొత్తం 150 డివిజన్లలో 148 స్థానాల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లను చేజిక్కించుకుని టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని ప్రయత్నిస్తోంది. ఎంఐఎం తన సంప్రదాయ సీట్లను మరోసారి పొందేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. గ్రేటర్‌లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు మొదటి నుంచీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే పనులకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేయగా, తాజాగా శుక్రవారం బీజేపీ నాయకులు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నగరానికి రప్పించి రోడ్‌షో నిర్వహించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీల్లో రోడ్‌షో చేపట్టారు. ఆదివారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా నగరానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో ఉద్వేగ పూరితమైన ప్రసంగం చేసి పార్టీ శ్రేణులను ఆకట్టుకున్నారు. ఆయా పార్టీ నేతల రోడ్‌షోలు, బహిరంగ సభలతో నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం నిండింది. 


ప్రచార ప్రణాళికలు

ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కొందరు అభ్యర్థులు ప్రజా నాడిని తెల్సుకునేందుకు తమకు సంబంధించిన వారిని క్షేత్రస్థాయికి పంపుతున్నారు. ఏదో సంస్థ నుంచి వచ్చామనో, యూ ట్యూబ్‌ ఛానల్‌ అనో చెప్పి వారు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. దాని ఆధారంగా విజయావకాశాలను అంచనా వేసుకుని ప్రచార ప్రణాళికలు రచిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో పగలు, రాత్రనక కష్టపడిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు.. ఈ రెండు రోజులు మరింత శ్రమించాలని భావిస్తున్నారు.


పకడ్బందీ పోల్‌ మేనేజ్‌మెంట్‌...

అధికారిక ప్రచారం ముగియనున్న నేపథ్యంలో తదుపరి అంకంపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఇప్పటికే గంపగుత్తగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన వారు.. స్పీడ్‌ మరింత పెంచాలని భావిస్తున్నారు. పకడ్బందీ పోల్‌ మేనేజ్‌మెంట్‌కు వ్యూహాలు రచిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా  పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. నమ్మకస్తులను రంగంలోకి దించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇనాళ్లు ఒక లెక్క. ఈ రెండు రోజులు ఒక లెక్క. ఈ సమయం ఎంతో కీలకం. గెలుపునకు చేసే చివరి ప్రయత్నమిది. ఎంతైనా ఖర్చు చేయాలి తప్పదు’ అని శేరిలింగంపల్లికి చెందిన ఓ పార్టీ అభ్యర్థి పేర్కొన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో తమ ఏరియా పరిధిలోని ఓటర్ల జాబితాను దగ్గర పెట్టుకొని ఎపిక్‌ కార్డు తీసుకొచ్చిన వారికి డబ్బులు ఇస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తామని ప్రమాణం చేయించుకొని ఆ మొత్తం ఇస్తుండడం గమనార్హం. ఈ తరహా తాయిలాల పంపిణీ నగరంలోని చాలా డివిజన్లలో మొదలైంది. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరునాటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. 20వ తేదీ నుంచి ప్రచారం షురూ చేశారు. 22వ తేదీన నామినేషన్ల ఉపంసహరణ అనంతరం అభ్యర్థులు ఖరారయ్యారు. 23వ తేదీ నుంచి ప్రచారం ఊపందుకుంది. పార్టీల అగ్రనేతలు, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు, ఎన్నికల ఇన్‌చార్జ్‌లు విస్తృతంగా పర్యటించారు. 


Advertisement
Advertisement